
Revanth Reddy: చచ్చినా.. బతికినా.. తెలంగాణ కోసమే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
కేసీఆర్‌కు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీరివ్వాలని లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట రూ.55 వేల కోట్లలో.. కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్ల బిల్లులు ఇచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదనే వాటిని పునర్విభజన చట్టంలో చేర్చారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో కొత్త ప్రాజెక్టు అని చంద్రబాబు అడ్డం పడ్డారు.
ఈనాడు, హైదరాబాద్: ‘‘చచ్చినా తెలంగాణ కోసం చస్తాం. ఈ మట్టిలోనే కలుస్తాం. ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇదీ.. ఇక్కడున్న వారి అందరి చిత్తశుద్ధి. మా అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం ఉంది. నూటికి నూరు శాతం ఈ తెలంగాణ కోసం నిక్కచ్చిగా.. నిటారుగా నిలబడతాం తప్ప.. ఎవరికీ తలవంచం’’అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడతామన్నారు. ‘‘పాలమూరు-రంగారెడ్డికి 45 టీఎంసీలు మొదటి విడత.. 45 టీఎంసీలు మలివిడత అనుమతులు రావాల్సిందే. అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలను మేము తరలిస్తాం. జూరాలకు వచ్చిన జలాలను వచ్చినట్టు ఇటే తరలిస్తా. ఆపడానికి జగన్ వస్తారా? చంద్రబాబు వస్తారా? నరేంద్రమోదీ వస్తారా? ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తా. ‘తెలంగాణ అభివృద్ధి, రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని ఎవరైనా ప్రశ్నిస్తే.. తోలు తీస్తా’ అన్న వారి నాలుక కోస్తా. నా పదాలు అన్‌పార్లమెంటరీ అయితే రికార్డుల నుంచి తొలగించండి. కానీ ప్రజల మదిలో శాశ్వతంగా ఉంచడానికి అధికారికంగా ఇక్కడ మాట్లాడుతున్నా. రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు కానీ తెలంగాణ హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలి. ఏకతాటిపై నిలబడాలి. కానీ సభలో ఉండకుండా భారాస, భాజపా పారిపోయాయి. ఈ కుర్చీలో ఉన్నంత కాలం.. తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. ఇది దేవుడి మీద ఆన. తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వను’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అసెంబ్లీలో కృష్ణానదీ జలాలపై శనివారం నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సుమారు 2 గంటల పాటు సీఎం మాట్లాడారు. ‘‘వైఎస్ జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి.. కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే.. నేను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించా. అదీ నా చిత్తశుద్ధి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి.. అని అడిగితే మా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపించారు. ఆ పనులు ఆగాయో.. లేదో తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని పంపించండి. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను.. ఆ నాయకత్వాన్ని, ఆ పార్టీని వదిలిపెట్టాను. అలాంటిది నేను తెలంగాణకు అన్యాయం చేస్తానా? మొదట నాకు తెలంగాణ. ఆ తర్వాతే పార్టీ. నాలాంటి వాళ్లు తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడతారా? తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కంకణంకట్టుకొని బయలుదేరా. కేసీఆర్ శాసనసభకు హాజరై ఏమైనా సూచనలు ఇస్తారని అనుకున్నా. ఈ ప్రభుత్వం ఆ సూచనలు పరిగణనలోకి తీసుకుటుందని చెప్పాం. అందుకే వారి డిమాండ్ మేరకు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.
ఎవరి తోలుతీయాలో ప్రజలే నిర్ణయించేవారు
కృష్ణా జలాలపై చర్చ పెట్టాలని ప్రతిపక్షమే కోరింది. కేసీఆర్ పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. బీఏసీలో కృష్ణా జలాలపై చర్చ జరగాలని ప్రతిపక్షమే అడిగింది. కానీ ముఖాముఖి చర్చలో పాల్గొనేందుకు సభకు రాలేదు. ‘సభలు పెట్టండి. తోలుతీస్తాం..’ అన్నారు. సభలోకి వచ్చి చర్చల్లో పాల్గొంటే ఎవరి తోలు తీయాలో 4 కోట్ల మంది ప్రజలే నిర్ణయించేవారు. కృష్ణాజలాల కేటాయింపుపై 1976లో బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటైంది. ఇప్పుడు 2026 లోకి వచ్చినా ఈ పంచాయితీ తెగలేదు. ఇదో రావణ కాష్టంగా మారింది.
తప్పుడు లెక్కలు ఇచ్చింది కేసీఆర్ బంధువే..
అప్పటి నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ.. కేసీఆర్‌కు సమీప బంధువు అయిన మురళీధర్‌రావు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హక్కులు కాలరాయాలని తప్పుడు లెక్కలతో అప్పటి ప్రణాళికశాఖకు లేఖరాశారు. ఈ అబద్ధాల కాగితంపై కేంద్రం వద్ద 2015 జూన్ 18, 19 తేదీల్లో చర్చ జరిగినపుడు 299 టీఎంసీలు చాలని తెలంగాణ ప్రతినిధిగా ఎస్‌కే జోషి సంతకం పెట్టారు. ఈ సంతకం తెలంగాణకు మరణ శాసనం అయింది. తెలంగాణకు మంజూరైన 24 ప్రాజెక్టుల సామర్థ్యం ప్రకారం 490 టీఎంసీలు ఇవ్వాలని కోరలేదు. 2016లోనూ ఇలాగే సంతకం పెట్టారు. ఈ సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. నీటి పంపకాలపై తీర్పు వచ్చే వరకు పాత ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తామని 2020లోనూ చెప్పారు. అది ఏపీకి వందకు రెండు వందల శాతం అనుకూలంగా మారింది. తెలంగాణ ప్రాంతం కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పుకొనే కేసీఆర్ తెలంగాణకు ప్రాణప్రదమైన నీళ్లను తాకట్టు పెట్టారు.
రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టారు
2016లో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలో సముద్రంలో కలిసే గోదావరి నీటిని ఏవిధంగా వినియోగించుకోవాలన్న విషయమై కేసీఆర్ చర్చ చేయడంతో చంద్రబాబు మదిలో ఆలోచన వెలిగి.. బనకచర్లకు పునాది పడింది. చంద్రబాబు గతంలో పాత యజమాని కావడంతో 2016లో కేసీఆర్ భయపడి ఉండొచ్చు. జగన్ వచ్చిన తరువాత 2020లోనూ కేసీఆర్ గట్టిగా మాట్లాడలేదు. నీటి పంపకాలు తేలేందుకు ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితుల్లో తీర్పు పేరిట రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు. అంతర్జాతీయ జలవిధానం ప్రకారం పరీవాహక ప్రాంతం ప్రకారం నీటి కేటాయింపులు జరగాలి. ఈ లెక్కన తెలంగాణకు 71శాతం.. ఏపీకి 29 శాతం రావాలి. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయిపుల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాలి. నీటి లభ్యత 1005 టీఎంసీలు తీసుకుంటే 763 టీఎంసీలు రావాలి. ఎపెక్స్ కౌన్సిల్ వద్ద కేసీఆర్ ఈ వాదన వినిపించలేదు. ఇప్పుడేమో తెలంగాణకు రావాల్సిన హక్కులను కేంద్రం, ఎపెక్స్ కౌన్సిల్ వద్ద తాకట్టుపెట్టామని మాపై అబద్ధ ప్రచారం చేస్తున్నారు. నిజాలు బయటపెట్టేలోపే అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని పన్నాగం పన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా రోజుకి 4.47 టీఎంసీలు చౌర్యం చేస్తే.. కేసీఆర్ తన హయాంలో ఏపీ రోజుకి 13.17 టీఎంసీలు దోచుకునేలా బహుమానం ఇచ్చారు.
ప్రతిపాదించింది మాజీ ఎంపీ విఠల్‌రావు..
రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కోసం ప్రాజెక్టు కట్టాలని మాజీ ఎంపీ విఠల్‌రావు ప్రతిపాదన చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పేరు పెట్టాల్సి వస్తే ఆయన పేరు పెట్టాలి. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయితే రూ.85 వేల కోట్లు అవసరం. లేదంటే రూ.లక్ష కోట్లకు చేరుతుంది. 2022 వరకు ప్రాజెక్టు అంచనాలు రూపొందించలేదు. ఏడేళ్లు అంచనాలు లేకుండా ఈ ప్రాజెక్టులో రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రాష్ట్ర నిధులతో కట్టుకుంటామని చెప్పారు. మహబూబ్‌నగర్ కరవు ప్రాంతం. ఏఐబీపీ కింద ప్రాజెక్టును చేర్చితే 90శాతం కేంద్ర నిధులు వచ్చేవి. పోలవరానికి ఇచ్చినట్లు రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి తలెత్తేది. లేకుంటే నరేంద్రమోదీ తెలంగాణలో కాలుపెట్టలేని పరిస్థితి ఉండేది. సొంత నిధులతో నిర్మిస్తామని ఆర్‌ఈసీ నుంచి స్వల్పకాల వ్యవధికి (12ఏళ్లు) 11.50 నుంచి 11.90 శాతం వడ్డీకి నిధులు తెచ్చారు. ఈ వడ్డీరేటుకు జూదం ఆడేవారు కూడా అప్పు తీసుకోరు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత తక్కువ వడ్డీకి 36 ఏళ్ల కాలపరిమితికి ఆ రుణాన్ని పునర్‌వ్యవస్థీకరించాం. మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు ద్వారా 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలు వినియోగించుకునే 45 టీఎంసీలు కలుపుకొని ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు కోరింది. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో 150 టీఎంసీలు వాడుతున్నారంటూ ఏపీ ప్రభుత్వం.. సీడబ్ల్యూసీకి వివరాలు అందించింది. దీనివల్ల 90 టీఎంసీలకు అనుమతులు ఎలా వస్తాయి? ఈ విషయంపై మేము అధికారంలోకి వచ్చాక.. కేంద్రంతో సంప్రదింపులు జరిపి.. చెరువులకు సంబంధించి క్లస్టర్ వారీగా వివరాలు అందజేసి, 45 టీఎంసీలకు ముందుగా అనుమతి ఇవ్వాలని కోరాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభలో పాలమూరు-రంగారెడ్డిపై ఏకగ్రీవ తీర్మానం ప్రతిపాదించారు. ‘‘తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర కరవు ప్రాంతం. అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. నాటి ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత..ఈ ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 90 టీఎంసీలతో సాగు, తాగునీటి కోసం సంబంధిత అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా శాసనసభ తీర్మానించింది. ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకూ ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు.. లేదా మరే ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా సభ తీర్మానించింది. ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.