
కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?
బాబు ‘బాండు’ ఉత్తిదేనా..?
అనంతపురం టవర్‌క్లాక్:‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు’ అంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన అనంతపురంలో ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ ఆనంద్, జెడ్పీ సీఈఓ శివశంకర్ హాజరయ్యారు. బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా కొత్తగా సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. దరఖాస్తుకు వెబ్‌సైట్ కూడా ఓపన్ కావడం లేదంటూ మండిపడ్డారు. దీనికి అధికారులు స్పందించకనే ఎంపీ బీకే పార్థసారథి కల్పించుకుని పింఛన్లపై విచారణ చేపట్టి బోగస్ ఏరివేసిన తర్వాత కొత్తవి ఇస్తామని బదులిచ్చారు. తొలగింపులు సరే కొత్తవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మిగతా సభ్యులు డిమాండ్ చేశారు. ఎంపీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు వాగ్వాదానికి దిగారు.
ప్రజారోగ్యం పట్టదా?
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యం గురించి పట్టదా అని పలువురు సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని ఎంపీ బీకే పార్థసారథి తెలపగా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారని శివరామిరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు సభ్యులు 108 అంబులెన్సులు, పంచాయతీ కార్మికులకు వేతనాల అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు.
‘ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ’ అంటూ ఊదరగొట్టారు. తాము గెలిస్తే అమలు చేసే సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఇంత లబ్ధి అంటూ లెక్కలేశారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన బాండు ఇచ్చారు. ఇప్పటికి రెండేళ్లు అవుతోంది. ఎవ్వరికీ చెప్పినది చెప్పినట్టు ప్రభుత్వ సాయం అందింది లేదు. చంద్రబాబు రాసిచ్చిన బాండుకు విలువ లేదా..? ఇది ఎందుకూ పనికిరాని ఉత్తుత్తి బాండేనా’ అంటూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు ‘బాండు’ జిరాక్సు ప్రతులతో ఎంపీ బీకే పార్థసారథిని నిలదీయగా.. త్వరలో అన్నీ చేస్తామంటూ తప్పించుకున్నారు.
108 అంబులెన్సులు
సకాలంలో రావడం లేదు
ఆరోగ్యశ్రీ సేవలందక పేదల జేబులకు చిల్లు
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం
ఆర్డీటీ రెన్యూవల్‌పై ఎంపీ తడబాటు
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయకపోవడంతో పేదలకు సేవా కార్యక్రమాలు అందడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ ఎప్పు చేయిస్తారని ప్రశ్నిస్తే.. ఎంపీ బీకే పార్థసారథి స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఆర్డీటీని నిర్వీర్యం చేస్తే తాము ఇప్పుడు రెన్యూవల్ చేయించామని చెప్పారు. ఆర్డీటీకి ఇప్పటి వరకూ రెన్యూవల్ ఉత్తర్వులు రాకపోతే తప్పుడు సమాధానం ఎలా చెప్తారని సభ్యులు నిలదీశారు. తడబాటుకు గురైన ఎంపీ.. త్వరలో రెన్యూవల్ చేయిస్తాం అంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. కేరళలో పేదరిక నిర్మూలన విజయవంతంగా చేపట్టారని, అక్కడ అనుసరించిన విధానాలను ఏపీలోనూ అమలు చేయాలని నల్లమాడ జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. దీనికి ఎంపీ బీకే కల్పించుకొని గత ప్రభుత్వంపై అభాండాలు వేసేందుకు ప్రయత్నించగా.. సభ్యులు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఎన్ని.. మీ రెండేళ్ల పాలనలో ఎంత అప్పు చేశారో మీకు తెలియదా అని చురకలంటించారు.