నందిగాం: మండలంలోని బెజ్జిపల్లి రాళ్ల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందుల కోసం అమర్చిన నాటుబాంబు పేలి లేగదూడ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో రాత్రివేళ అడవి పందులు సంచిరిస్తూ దుంపలు తింటూ ఉంటాయి. అయితే అడవి పందుల వేటగాళ్లు ఆయా చెరువుల్లో పందులు సంచరించే ప్రాంతాల్లో రాత్రివేళల్లో నాటుబాంబులు అమర్చుతారు. దుంపలనుకొని నాటుబాంబును అడవి పంది నోటితో కొరికిన వెంటనే అది పేలి పంది మృత్యువాత పడుతుంది. దీంతో వేటగాళ్లు అడవి పందులను రహస్యంగా తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే బుధవారం ఉదయం బెజ్జిపల్లి రాళ్ల చెరువులోకి పోతులూరు తమిరె రాజుకు చెందిన పశువులు మేతకు వెళ్లాయి. అయితే ఒక లేగదూడ వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును కొరకడంతో అది పేలి దూడ మృతి చెందింది. రహస్యంగా నిర్వహిస్తున్న ఈ అడవి పందుల వేటతో మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో, ఈ వ్యవహారంపై పోలీసులు, ఫారెస్టు అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. బాంబులు పెట్టినవారిపై చర్యలు తీసుకొని, బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Sakshi
June 18, 2026, 12:23 AM