● స్పష్టం చేసిన భేతాళపురం రైతులు

మందస:రెండు రోజుల క్రితం కొన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉద్దానం కార్గో ఎయిర్‌ పోర్టుకు భూములు ఇవ్వడానికి భేతాళపురం గ్రామ రైతులు ముందుకు వచ్చారనేది అవాస్తవమని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని బాధిత రైతులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం మాట్లాడుతూ.. గత 20 నెలలుగా ఎయిర్‌ పోర్టు నిర్మాణం చేపట్టరాదని అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. కలెక్టర్‌ స్వప్నికల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఇతర అధికారులు, ప్రభుత్వ పెద్దలకు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేశామన్నారు. గ్రామాలకు దూరంగా ఎక్కడైనా ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఉంటే అక్కడ ఇటువంటి నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మడియా పురుషోత్తం, బత్తిని ఉమాపతి, గార ఆనందరావు, కార్గో ఎయిర్‌పోర్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ మీడియా వింగ్‌ కన్వీనర్‌ బత్తిని లక్ష్మణ్‌, జుత్తు నారాయణ, సాహుకరి కృష్ణారావు, బత్తిని తులసీరావు, దున్న పార్వతి, కీలు గున్నమ్మ, మడియా రుషి, దున్న మోహన్‌రావు, కోరిబిల్లి సుమలత, సాహుకరి ఉపేంద్ర, మడియా వల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.