● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో ఎటువంటి అలసత్వం వహించరాదని, నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం టెక్కలి డివిజన్‌ రెవెన్యూ అధికారులతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డివిజన్‌ పరిధిలోని మొత్తం 140 గ్రామాలకు గాను ఫేజ్‌–3, ఫేజ్‌–4 రీసర్వే ప్రక్రియలు, విలేజ్‌ సర్వేయర్‌, వీఆర్వో, తహసీల్దార్‌ లాగిన్లలో డేటా ఎంట్రీల స్థితిగతులను నివేదికల ఆధారంగా నిశితంగా పరిశీలించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, బాగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ పద్మావతి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.