climate change: ప్రకృతి హెచ్చరిస్తోంది... వింటున్నారా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం ఏడాదికేడాది ఉద్ధృతమవుతోంది. నిరుడు జనవరి నుంచి నవంబరు వరకు 334 రోజులు ఉంటే, వాటిలో 331 రోజులపాటు దేశంలో ఎక్కడో ఒకచోట తుపానులు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, మట్టిపెళ్లలు విరిగిపడటం వంటివి ఎక్కువగా సంభవించాయి. వీటి దెబ్బకు మొత్తం 4,419 మంది ప్రాణాలు కోల్పోగా, 4.3 కోట్ల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఇలాంటి విపత్తుల కట్టడికి అంతర్జాతీయ సమాజంతో కలిసి భారత్ తక్షణమే గట్టి చర్యలకు పూనుకోవాలి.

గతి తప్పిన రుతువులు
విపత్తుల వల్ల నిరుడు దేశంలో చాలామంది జీవనాధారం దెబ్బతినిపోయింది. అనేక కుటుంబాలు మానసిక కుంగుబాటుకు లోనయ్యాయి. ఈ నష్టం వెలకట్టలేనిది. బిహార్‌లో మెరుపులు, పిడుగుల వల్ల 250 మంది మరణించారు. ఆకస్మిక వరదల వల్ల పంటలు కోల్పోయిన 80శాతం వ్యవసాయ కుటుంబాలు జీవిక కోసం పంజాబ్, దిల్లీలకు వలసవెళ్లక తప్పలేదు. వీటికితోడు మాదక ద్రవ్యాల సేవనం, మనుషుల అక్రమ రవాణా వంటివీ సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. కలుషిత వరద నీరు వ్యాధులకు దారితీసి, ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. 54లక్షల మంది నిర్వాసితులయ్యారు. వారిలో అత్యధికులు స్త్రీలూ పిల్లలే. 2050కల్లా 4.5 కోట్ల మంది ప్రకృతి ప్రకోపాల వల్ల నిర్వాసితులవుతారని అంచనా. భారతదేశానికి 1993 నుంచి 2022 వరకు 18వేల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. వాతావరణ మార్పుల వల్ల భారీగా నష్టపోయిన దేశాల్లో భారత్‌ది ఆరో స్థానం. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల అరేబియా సముద్రంలో 40శాతం అధిక తీవ్రతతో తుపానులు పుట్టుకొచ్చాయి. వాటివల్ల భారీగా పంటనష్టం సంభవించింది.భవన నిర్మాణం కోసం చెరువులను పూడ్చేసిన నగరాల్లో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతిని ప్రభుత్వాలు గుర్తించాలి. వాతావరణ మార్పులతో ఎండలు మండిపోవడం, చలి తీవ్రత పెరుగుతున్నాయి. వాయవ్య, మధ్య భారత రాష్ట్రాల్లో వసంత రుతువు కనుమరుగైంది. ఏప్రిల్‌లో అకాల వర్షాలకు జమ్మూకశ్మీర్, సిక్కింలలో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. శీతాకాలంలోనూ ఉష్ణతాపం కొనసాగడంతో నేల నెర్రెలు చాస్తోంది. సముద్రాలు వేడెక్కి దక్షిణ సముద్ర తీరం దెబ్బతింటోంది. మహాసముద్రాలు దశాబ్దానికి 0.12 సెంటిగ్రేడ్ మేర వేడెక్కుతున్నాయి. సముద్ర మట్టాలు ఏటా 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. నిరుడు జనవరి-సెప్టెంబరు మధ్యకాలంలో 270 రోజులపాటు ప్రకృతి చిర్రుబుర్రులాడింది. 2024లో అలాంటి రోజులు 255 కాగా, 2022లో అవి 241 రోజులే! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాతావరణ మార్పులు బూటకమంటూ చమురు, బొగ్గుల తవ్వకాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. దీనివల్ల వాతావరణ వైపరీత్యాలు మరింత తీవ్రం కానున్నాయి. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలే ఇతర వర్ధమాన దేశాలనూ పీడిస్తున్నాయి. కాబట్టి, వాతావరణ మార్పులను తట్టుకోవడానికి సంపన్న దేశాలు ఇస్తామన్న నిధులూ సాంకేతికతలను వర్ధమాన దేశాలు రాబట్టుకోవాలి.

ఉదాసీనంగా ఉంటే అంతే!
ప్రకృతి ఉత్పాతాలను తప్పించుకోవాలంటే- ముందు బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని కట్టిపెట్టి పూర్తిగా పునరుత్పాదక ఇంధనాలకు మారాలి. 2030కల్లా కర్బన ఉద్గారాలను కనీసం 45శాతం మేర తగ్గించుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే 50శాతం విద్యుత్తును ఉత్పత్తి చేయడం, వాతావరణం నుంచి కర్బనాన్ని విడగొట్టే సాంకేతికతలను చేపట్టడం వంటివి విధిగా జరగాలి. అడవుల నరికివేత, చెరువుల పూడ్చివేత వంటి అకృత్యాలను అరికట్టి తీరాలి. ముఖ్యంగా ఈశాన్య భారత అడవులను కాపాడుకోవాలి. హిమనీనదాలు కరిగిపోకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. దుర్భిక్షాన్నీ అతివృష్టినీ తట్టుకునే పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు, ప్రకృతి ప్రకోపాల గురించి రైతులను ముందుగానే అప్రమత్తం చేసే సాంకేతికతలనూ విరివిగా వినియోగించాలి. అన్నదాతలు, వలసదారులు, నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలకు అలవాటుపడటం తప్ప, మనం చేసేదేమీ లేదనే ఉదాసీనతను వదిలించుకోవాలి. ‘కాప్-30’ శిఖరాగ్ర సభ హరిత వాతావరణ నిధిని ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దాని కింద ప్రతి దేశం వాతావరణ మార్పుల నిరోధ విధానాన్ని రూపొందించి, పక్కాగా అమలు చేయాలి. ఈ విషయంలో భారత్ ఇతర దేశాలకు మార్గదర్శిగా నిలవాలి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.