Water Disputes: జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ

Eenadu icon
By Telangana News Desk Published : 03 Jan 2026 03:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల్లో రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున నియమించింది. గత ఏడాది జులై 16న జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కమిటీకి ఛైర్మన్‌గా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్, సభ్యులుగా తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ(జనరల్‌)... ఆంధ్రప్రదేశ్‌ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఈఎన్సీ(నీటిపారుదల), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ ఉంటారు. వీరితోపాటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు, జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్‌ ఇంజినీర్‌ సభ్యులుగా, కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజినీర్‌ (ప్రాజెక్ట్‌ ఎప్రైజల్‌ ఆర్గనైజేషన్‌) మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు. 

నీటి యాజమాన్యంపై సూచనలు... 

జల వనరులకు సంబంధించి రెండు రాష్ట్రాలు వ్యక్తం చేసిన పలు అంశాలను సమగ్రంగా, సాంకేతికంగా పరిశీలించి... నీటి యాజమాన్యానికి సంబంధించి సూచనలు చేయడం, నీటి పంపిణీ న్యాయంగా, పటిష్ఠంగా అమలు జరిగేలా చూడటంపై కమిటీ దృష్టి సారిస్తుంది. ఈ కమిటీ 3 నెలల్లోగా నివేదికను అందజేయాల్సి ఉంటుంది. కమిటీకి అవసరమైతే ఇతర అధికారులు, నిపుణుల సాయం తీసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో గోదావరి-బనకచర్లపై చర్చ సందర్భంగా ఈ కమిటీ అంశం ముందుకు వచ్చింది. ప్రస్తుత కమిటీ బాధ్యతల్లో గోదావరి, కృష్ణా ఇలా దేన్నీ ప్రస్తావించకుండా రెండు రాష్ట్రాల మధ్య జలాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :