VB G RAM G: ఏప్రిల్‌లో ‘వీబీ జీ రామ్‌ జీ’!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Jan 2026 06:19 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి: ఈ ఏడాది మార్చి వరకు పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌(గ్రామీణ)’ (వీబీ జీ రామ్‌ జీ) అమలులోకి రానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) కేంద్ర ప్రభుత్వం సవరించి కొత్తగా ‘వీబీ జీ రామ్‌ జీ’ని తీసుకొచ్చింది. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. కొత్త విధానంలో లేబర్, మెటీరియల్‌ బడ్జెట్‌ నుంచి పరిపాలనా ఖర్చుల వరకు కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు భరించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 9 నెలలు పూర్తయ్యాయి.

మిగిలిన మూడు నెలలకు కేంద్రం కొత్త విధానంలో బడ్జెట్‌ కేటాయిస్తుందా? పాత విధానమే మార్చి నెలాఖరు వరకు కొనసాగించాలా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టత ఇచ్చారు. మార్చి నెలాఖరు వరకు పాత విధానంలోనే నరేగా అమలు చేయాలని, ఏప్రిల్‌ 1 నుంచి ‘వీబీ జీ రామ్‌ జీ’ అమలులోకి వస్తుందని సూచించారు.

బడ్జెట్‌ రూ.6 వేల కోట్లు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి ‘వీబీ జీ రామ్‌ జీ’ బడ్జెట్‌ రూ.6 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర గ్రామీణ జనాభా ఆధారంగా వేతనాలు, మెటీరియల్‌ నిధులు, పరిపాలనా ఖర్చులతో కలిపి ఈ బడ్టెట్‌ ఉంటుందని లెక్కలేశారు. ఇందులో కేంద్రం రూ.3,600 కోట్లు (60%), రాష్ట్రం రూ.2,400 కోట్లు (40%) సమకూర్చనున్నాయి. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ‘వీబీ జీ రామ్‌ జీ’ బడ్జెట్‌ కేటాయిస్తుందని, దాని ఆధారంగా రాష్ట్ర వాటా నిధులు ప్రభుత్వం అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :