
Andhra News: జల అంశాలపై కేంద్ర కమిటీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల అంశాలను చర్చించి పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అధ్యక్షతన మొత్తం మరో 12 మంది సభ్యులను నియమించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అనుమతితో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గత ఏడాది జులై 16న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన రెండు రాష్ట్రాల సీఎంల భేటీ నిర్ణయాల నేపథ్యంలో ఈ కమిటీకి రూపకల్పన చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పలు జల అంశాలు అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో దిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు భేటీ అయ్యారు. గత ఏడాది జులైలో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలూ పంపిన వాటి నుంచి మొత్తం 10 అంశాలను జలశక్తి శాఖ ఎజెండాగా నిర్ణయించింది. వాటిపై భేటీలో చర్చించారు.
జల అంశాలపై కమిటీలో చోటు కల్పించేందుకు రెండు రాష్ట్రాల నుంచి పేర్లు ప్రతిపాదించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఒకరి తర్వాత మరొకరు పేర్లు ప్రతిపాదించాలన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాలూ ఆలస్యం చేస్తూ వచ్చాయి. కిందటి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసేందుకు దిల్లీ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ అంశంలో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురి పేర్లు సూచిస్తూ జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ నుంచి కూడా పేర్లు పంపాలని కేంద్రం కోరగా ఆ రాష్ట్రం ఏడుగురిని ప్రతిపాదించింది. అయితే ఒక్కో రాష్ట్రం నుంచి నలుగురికి, కేంద్రం నుంచి నలుగురికి కమిటీలో చోటు కల్పించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణ, సమగ్ర సాంకేతిక దృక్పథంతో అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను ఈ కమిటీ ప్రతిపాదించాలని, సమర్థ నీటి పంపకాలకు అనుగుణంగా ఈ సిఫార్సులు ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కమిటీ ఛైర్మన్:కేంద్ర జల సంఘం ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు:జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్ ఇన్ చీఫ్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్
తెలంగాణ ప్రతినిధులు:నీటిపారుదలశాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్ (నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి)
కేంద్ర ప్రతినిధులు:కృష్ణా బోర్డు ఛైర్మన్, గోదావరి బోర్డు ఛైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్టులు, నిర్వహణ)
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :