Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం.. ట్రయల్ రన్‌కు సిద్ధం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విజయనగరం: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రయల్ రన్‌గా జనవరి 4న తొలి వాణిజ్య విమానం దిగనుంది. దిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత... ఈ ఏడాది మేలో ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు ఊహించని వేగంతో సాగుతూ అనుకున్న దానికంటే ముందే సిద్ధం అయ్యింది.
జీఎంఆర్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికి పౌర పనుల కాంట్రాక్టును ఎల్ &టి సంస్థ చేపట్టింది. వీరు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతారు. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ ఎ380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు, వైడ్-బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్ వే నిర్మించారు.


