బ్రహ్మజ్ఞాని... భక్తకవి

Eenadu icon
By Editorial Team Published : 30 Dec 2025 03:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చంచల భక్తికి, అపార జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం రమణ మహర్షి. ఆయన ఎంతటి పూర్ణజ్ఞానులో, అంతటి భక్తిపూర్ణులు. పరమభక్తులకు భాగవతోత్తముడిగా, పారమార్థిక పిపాసితులకు జ్ఞానమూర్తిగా దర్శనమిచ్చే మహానుభావుడు. ఆ మౌనర్షి ఓ మహాకావ్యం. ఆస్వాదించ గలిగినంత ఆస్వాదించడమే. అది మన అర్హత, యోగ్యతలను బట్టి ఉంటుంది. రమణులను ఆశ్రయించినవారు ఎవరూ నిరాశగా తిరిగి వెళ్లరు. ఆధ్యాత్మికోన్నతికి మహర్షి రెండు మార్గాలను నిర్దేశించారు. ఒకటి ఆత్మవిచారణ. ఇది జ్ఞానమార్గం. ‘నేనెవరు?’ అని విచారణ చేసుకోవడం ద్వారా మనసు అణుగుతుంది. ఆ ప్రశ్న ఆలోచనలన్నిటినీ ధ్వంసం చేస్తుంది. చితిలో కట్టెలు ఎగదోయటానికి వాడే కట్టెలాగా, ఆ ప్రశ్న కూడా చివరికి ఆ చితిలోనే దగ్ధమైపోతుంది. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేవారు మహర్షి. ‘నువ్వు, ప్రపంచం, భగవంతుడు- ఒక్కటే. ఈ అనుభవాన్ని పొందడమే అద్వైతసిద్ధి’ అని ప్రబోధించేవారు. కానీ మనుషులు తమను తాము ఆత్మ విచారణ చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, తమ మూలాలు కనుగొన్నవారి చేతులు మహాశక్తితో సంపన్నమై ఉంటాయని ఉద్ఘాటించారు. జ్ఞానుల హృదయం వెన్నవంటిదని, పూర్ణప్రేమయే పరమ జ్ఞానమని రమణులు నిరూపించారు.

ఇక రెండోది శరణాగతి. ఇది భక్తిమార్గం. ‘విశ్వమయమైన శక్తికి నిన్ను నువ్వు హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా సమర్పించుకో! ఆ శక్తిలో నువ్వూ ఏకమవుతావు’ అనేవారు మహర్షి. వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభమైంది మదురైలోని మీనాక్షి అమ్మవారి సన్నిధి నుంచే! పరమశివుడిపై ప్రార్థనా గీతాలు రాసి తన శివభక్తిని లోకానికి చాటారు. గణపతిపై పద్యాలు రచించి విఘ్నేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇలా జ్ఞాన, భక్తియోగాలను ప్రబోధించడమే కాదు, ఆ రెండు మార్గాలను ఆచరణలో చూపి దీపగోపురంగా నిలిచినవారు రమణులు. అందుకే జ్ఞాన, భక్తి సాధకులందరూ ఆ మహనీయుడికి ఆకర్షితులయ్యారు. 

మహర్షి తమిళం, తెలుగు, మలయాళం, సంస్కృత భాషల్లో కవిత్వం చెప్పిన భక్తకవి. ప్రాచ్య, పాశ్చాత్య భావుకుల మధ్య రససేతువు నిర్మించిన భాషాజ్ఞాని. మహర్షి కవిత్వంలో మకుటాయమానమైంది- ఆయన తమిళంలో రచించిన ‘అక్షర మనమాలై’. అరుణాచలేశ్వరుణ్నే వరుడిగా భావించి తాను వధువై అల్లిన ‘అక్షర వరమాల’ అది. అరుణగిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు పరవశంతో పాడుకోవడానికి రమణులు ఆశువుగా అనుగ్రహించిన కవితల మాలికే ఆ ‘అక్షర మనమాలై’.   

రమణమహర్షిని దర్శించేందుకు వచ్చే విదేశీయులకు స్థానిక భక్తులు, ఆశ్రమ సిబ్బంది ఆచారాల నెపంతో నిబంధనలు పెట్టేవారు. కానీ రమణులు పాశ్చాత్యుల పరిస్థితిని పెద్దమనసుతో అర్థం చేసుకుని సడలింపులు చేసేవారు. ఆచారాలూ సంప్రదాయాల కన్నా విశుద్ధ భక్తి, విశ్వాసాలు ముఖ్యమనేవారు. ఎవరిపై ఎలాంటి వివక్షా లేకుండా అందరినీ ఆదరించేవారు. అందుకే ‘ఆ నవ్వులో ఎంత దాక్షిణ్యమో, ఆ చూపులో ఎంత కారుణ్యమో’ అని భక్తులు ముగ్ధులైపోయేవారు. ‘రమణులు ప్రశాంతతకు ప్రతిరూపం. ఆయన యోగులకే యోగిలాంటివారు’ అన్నారు మహర్షి అరవిందులు. 

(నేడు రమణుల జయంతి) 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :