FTA: కొత్త ఒప్పందాలు సరికొత్త అవకాశాలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ట్రంప్ సుంకాల బాదుడుకు అంతర్జాతీయ వాణిజ్యం కుదేలైంది. దీంతో ఆయా దేశాలతో విడివిడిగా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) జోరందుకున్నాయి. ఈ విషయంలో ఇండియా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలతో చర్చలు సాగిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తోనూ ఒప్పందంపై సంతకం చేసింది.
ఎఫ్‌టీఏ చలవతో భారతీయ ఐటీ, బీపీవో, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్ సేవల సంస్థలకు న్యూజిలాండ్‌లో మార్కెట్ విస్తరిస్తుంది. టూరిజం వృద్ధి అవుతుంది. భారతీయ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు, అధ్యాపకులు, విద్యార్థులు, శిక్షకులకు ఆ దేశంలో సులువుగా ప్రవేశం లభిస్తుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపై 500 కోట్ల డాలర్లకు చేరుతుంది. భారతీయ వస్తువులు సుంకాలు లేకుండా ఆ దేశంలోకి ప్రవేశించగలుగుతాయి. భారత్ నుంచి 1,379 రకాల వ్యవసాయ సరకులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, 363 సముద్ర ఉత్పత్తులు, వెయ్యి వస్త్రాలు, దుస్తుల రకాలు సున్నా సుంకంతో న్యూజిలాండ్ మార్కెట్‌కు ఎగుమతి అవుతాయి. మరోవైపు, భారత్‌లోకి న్యూజిలాండ్ వస్తువుల ఎగుమతులపై భారీగా సుంకాలు సడలిస్తారు. వచ్చే 15 ఏళ్లలో ఇండియాలోకి 2వేల కోట్ల డాలర్ల న్యూజిలాండ్ పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల భారతీయ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసుల రంగాలు లబ్ధి పొందుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎగుమతి కేంద్రిత సంస్థలూ లాభపడతాయి.
ఎగుమతులకు గిరాకీ

మరోవైపు, సువిశాల భారతీయ మార్కెట్‌లోకి న్యూజిలాండ్ నుంచి వచ్చే ఉన్ని, బొగ్గు, కలప, అవకాడో, బ్లూబెర్రీస్, పెర్సిమోన్ పండ్లపై సుంకాలను భారీగా తగ్గిస్తారు. కివి, ఆపిల్ పండ్లపై కోటాలవారీగా సుంకాల తగ్గింపు ఉంటుంది. ఆపిల్ పండ్ల విషయంలో భారత్ నుంచి రాయితీ పొందుతున్న ఏకైక దేశం న్యూజిలాండే. ఫైనాన్స్, విద్య, పర్యాటకం, భవన, మౌలిక వసతుల నిర్మాణం, వృత్తి సేవలతో పాటు 100 సర్వీసు రంగాల్లో న్యూజిలాండ్ కంపెనీలకు ప్రవేశ సౌలభ్యం లభిస్తుంది. న్యూజిలాండ్‌కు జమ్మూకశ్మీర్ నుంచి పష్మినా ఉన్ని, హస్తకళా వస్తువులు, కుంకుమ పువ్వు ఎగుమతులు పెరుగుతాయి. పంజాబ్ నుంచి క్రీడావస్తువులు, వస్త్రాలు, బాస్మతి బియ్యం, గుజరాత్ నుంచి వజ్రాలు, పింగాణి, ప్రాసెస్ చేసిన ఆహారానికి అవకాశాలు అధికమవుతాయి. పశ్చిమ బెంగాల్ నుంచి దార్జిలింగ్ టీ, వస్త్రాలు, జనపనార వస్తువులు, కేరళ నుంచి మసాలా ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్స్, కొబ్బరి పీచు ఉత్పత్తులు, ఒడిశా నుంచి వస్త్రాలు, హస్తకళా వస్తువులు, తమిళనాడు నుంచి వస్త్రాలూ ఆటో విడిభాగాల ఎగుమతులు ఊపందుకుంటాయి.
గరిష్ఠ ప్రయోజనాలు...
మోదీ సర్కారు హయాములో భారత్ 2021 నుంచి మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, ఎఫ్టా దేశాలైన స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, లీచ్టెన్‌స్టీన్, బ్రిటన్, ఒమన్‌లతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకుంది. తాజాగా న్యూజిలాండ్‌తో ఏడో ఎఫ్‌టీఏ కుదిరింది. ఆయా దేశాల నుంచి పాలు, పాల ఉత్పత్తులు, కొన్నిరకాల వ్యవసాయ సరకులను దిగుమతి చేసుకుంటే భారతీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకని, ఎఫ్‌టీఏల నుంచి వాటిని మినహాయించింది. పశ్చిమాసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లలో భారతీయ ఎగుమతులకు ప్రాధాన్య ప్రాతిపదికన ప్రవేశ సౌలభ్యం పొందింది. అమెరికా, కెనడా, ఐరోపా సమాఖ్యలతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తోంది. అయితే, ఎఫ్‌టీఏ భాగస్వాముల నుంచి కొన్ని రకాల ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు, ఎఫ్‌టీఏల ద్వారా లభించే ప్రయోజనాలను భారతీయ ఎంఎస్‌ఎంఈలు మెరుగ్గా వాడుకోవాల్సి ఉంది. ఎఫ్‌టీఏల ప్రయోజనాలను సమర్థంగా వాడుకోవాలని రాష్ట్రాలకు, కంపెనీలకు కేంద్ర వాణిజ్య శాఖ సూచించాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కంపెనీల కోసం ఎఫ్‌టీఏ హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేసి ఎగుమతిదారులను ప్రోత్సహించాలి. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులను, ఫార్మా, ఐటీ ఉత్పత్తులను విరివిగా ఎగుమతి చేయడానికి సన్నద్ధం కావాలి. పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లను మమేకం చేయాలి. రేవులు, రోడ్డు రవాణా సంస్థలు, నౌకా రవాణా సంస్థలు, శీతల గిడ్డంగులను ఎగుమతి గొలుసు వ్యవస్థల్లో భాగస్వాములుగా మార్చాలి. ఇలాంటి చర్యలద్వారా ఎఫ్‌టీఏలతో గరిష్ఠ ప్రయోజనాలు పొందాలి.
తెలుగు రాష్ట్రాలకు మేలు
తెలంగాణ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల నుంచి ఔషధాలు, వైద్యసాధనాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, బియ్యం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు చాలా తక్కువ సుంకాలతో న్యూజిలాండ్‌లో ప్రవేశించగలుగుతాయి. ఐటీ, డిజిటల్ సేవలు, సైబర్ భద్రత, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్ సేవలకూ గిరాకీ పెరుగుతుంది. ఏపీ నుంచి చేపలు, రొయ్యలు, బియ్యం, మసాలా దినుసులు, ప్రాసెస్ చేసిన ఆహారం, దుస్తులు, జౌళి ఎగుమతులకు సానుకూలత ఏర్పడుతుంది. విశాఖపట్నం, కృష్ణపట్నం రేవుల నుంచి భారీగా ఎగుమతులు చేపట్టవచ్చు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :