Future City: ఫ్యూచర్‌ సిటీకి పోలీస్‌ కమిషనరేట్‌

Eenadu icon
By Telangana News Desk Published : 30 Dec 2025 04:15 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలీసింగ్‌ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న మూడు కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ రానుంది. దాంతోపాటు ప్రస్తుత రాచకొండ కమిషనరేట్‌ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్చనున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దులను పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. భువనగిరిని ప్రత్యేక పోలీసు జిల్లాగా మార్చనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు సోమవారమే కొలిక్కిరాగా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) పరిధిలోని ప్రాంతాన్నంతా జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే అత్యంత కీలకమైన పోలీసుశాఖలోనూ పెనుమార్పులు చేశారు. 

ఫ్యూచర్‌ సిటీపై ప్రత్యేక శ్రద్ధ

ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌ పరిధిలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లు ఉండగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రస్తుతం ఫ్యూచర్‌ సిటీ ప్రాంతం రాచకొండ పరిధిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాలు ముమ్మరమయ్యే పక్షంలో పోలీసుల పర్యవేక్షణ కూడా పెరగాల్సి ఉంటుంది. పైగా అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతానికి తరలివస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో వాటి భద్రత ప్రాధాన్యం సంతరించుకోనుంది. అందుకే ఫ్యూచర్‌ సిటీ ప్రాంతంలో శాంతిభద్రతలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, ఆమన్‌గల్లు తదితర ప్రాంతాలతో కొత్త కమిషనరేట్‌ ఏర్పాటు కానుంది. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. 

ఇక రాచకొండ కమిషనరేట్‌ను మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్చనున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోకి వస్తాయి. బోయినపల్లి, కార్ఖానా, తిరుమలగిరి తదితర పోలీస్‌ స్టేషన్లు ఇందులో కలవనున్నాయి. హైదరాబాద్‌ పరిధిని అటు శంషాబాద్‌కు, ఇటు రాజేంద్రనగర్‌కు విస్తరించనున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ కొన్ని మార్పులు జరగనున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... మల్కాజిగిరి సీపీగా అవినాశ్‌ మహంతి, ఫ్యూచర్‌ సిటీ సీపీగా సుధీర్‌బాబు, సైబరాబాద్‌ సీపీగా రమేశ్‌రెడ్డి, యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్‌ యాదవ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు నాన్‌ ఫోకల్‌ పోస్టులో ఉన్న రమేశ్‌రెడ్డిని కీలకమైన సైబరాబాద్‌ సీపీగా నియమించింది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :