Telangana Assembly: 5 వరకు సమావేశాలు

Eenadu icon
By Telangana News Desk Published : 30 Dec 2025 04:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి ‘బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)’లో నిర్ణయం తీసుకుంటారు. శీతాకాల అసెంబ్లీ, మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగా..ఉదయం 11.10 గంటలకు మండలి.. మధ్యాహ్నం 12.30 గంటలకు అసెంబ్లీ వాయిదా పడింది. శాసనసభ, మండలి సమావేశాలు తిరిగి వచ్చే నెల 2 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. తొలిరోజు సభ ప్రారంభం కాగానే.. దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా.. జీహెచ్‌ఎంసీలో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, ప్రజాకవి దివంగత అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనల తొలగింపు, తెలంగాణ జీఎస్‌టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, పే స్ట్రక్చర్‌ సవరణకు సంబంధించిన రెండు ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్‌ ప్రచురణల ఆర్డినెన్సులకు చట్టబద్ధత కల్పించే బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ సమగ్ర శిక్షా(టీఎస్‌ఎస్‌) ఆడిట్‌ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా ఆడిట్‌ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు, తదితర పత్రాలను అసెంబ్లీ ముందు పెట్టారు. తర్వాత సభలో సుమారు రెండు గంటలు జీరో అవర్‌ కొనసాగింది. అనంతరం సభను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. అంతకుముందే శాసనమండలి కూడా సంతాప తీర్మానాల అనంతరం వాయిదా పడింది.

సెంబ్లీ సమావేశాల తొలిరోజు సోమవారం మాజీ ముఖ్యమంత్రి,  భారాస అధినేత కేసీఆర్‌ హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే.. ప్రతిపక్షనేతగా తనకు కేటాయించిన సీటులో ఆయన ఆసీనులయ్యారు. మరికొద్ది నిమిషాల్లో సభ ప్రారంభమవుతుందనగా.. సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..నేరుగా కేసీఆర్‌ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రాకతో లేచి నిల్చున్న కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి నమస్కారం చేస్తూ కరచాలనం చేశారు. కేసీఆర్‌ కూడా ప్రతి నమస్కారం చేస్తూ సీఎంతో కరచాలనం చేశారు. భారాస అధినేత ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్‌ తదితరులను కూడా సీఎం పలకరించారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ విప్‌లు, పలువురు మంత్రులు కూడా వచ్చి కేసీఆర్‌ను పలకరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. సంతాప తీర్మానాలు సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో.. కేసీఆర్‌ సభ నుంచి బయటకు వచ్చి.. నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. సభ ప్రారంభానికి ముందు.. అసెంబ్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, అజారుద్దీన్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మండలి కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కేసీఆర్‌కు భారాస ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు.

శాసనసభ వాయిదా అనంతరం.. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన స్పీకర్‌ ఛాంబర్‌లో అసెంబ్లీ బీఏసీ సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్‌ బీర్ల అయిలయ్య, భారాస ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి.. భాజపా, ఎంఐఎం, సీపీఐ శాసనసభాపక్ష నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అక్బరుద్దీన్‌ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు, శాసనసభ కార్యదర్శి తిరుపతి, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. శాసనసభను కనీసం 15 రోజులు నిర్వహించాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని భారాస సభ్యులు డిమాండ్‌ చేశారు. నదీ జలాలపై ప్రభుత్వం పీపీటీ ఇస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. భారాస హయాంలో అప్పటి ప్రతిపక్షంగా తాము అడిగితే పీపీటీకి అవకాశం ఇవ్వకపోవడంతో.. నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తుచేసినట్లు తెలిసింది. ఆఖరి నిమిషంలో అడగడం వల్ల అప్పట్లో అవకాశం ఇవ్వడం కుదరలేదని, ఇప్పుడు తాము ముందే కోరుతున్నామని, ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేమూ వాకౌట్‌ చేయాలా? అని భారాస సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించడం లేదని, ఈ రోజు కూడా తాను లేకుండానే బాల్కొండలో క్రిస్మస్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దృష్టిపెడతామని స్పీకర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. గత రెండేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా తాము ప్రతిపాదించిన ఒక్క అంశాన్ని కూడా చర్చకు స్వీకరించలేదని, ఈసారైనా యూరియా కొరత, రుణమాఫీ, పంట బోనస్, రైతుభరోసా, జాబ్‌ క్యాలెండర్‌ తదితర 15 ప్రతిపాదిత అంశాలపై చర్చించాలని భారాస సభ్యులు కోరారు. 20 రోజుల పాటు సభను నిర్వహించాలని భాజపా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 32 ప్రజా సమస్యలను బీఏసీ ముందు పెట్టి.. వీటిపై చర్చకు అవకాశం ఇవ్వాలన్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలో అంశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ చెప్పినట్లు తెలిసింది. శాసనమండలిలో ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీలోనూ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఎమ్మెల్సీలకు కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని ఈ సదర్భంగా పలువురు కోరినట్లు తెలిసింది. సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏవీఎన్‌ రెడ్డి, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. శాసనసభ బీఏసీ సమావేశ అనంతరం హరీశ్‌రావు నేతృత్వంలో భారాస ఎమ్మెల్యేలు తమకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు వినతిపత్రమిచ్చారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :