



Year ender 2025: కదిలే కాలంలా... రేపు మనదవ్వాలంటే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కదిలే కాలంలా.... జారే రుతువుల్లా... మారే వాతావరణంలా.... ప్రపంచాన్ని ‘ఆర్టిఫిషియల్’ మార్పులూ... కమ్మేస్తున్నాయి! సాంకేతిక విప్లవాలు.... భౌగోళికాధిపత్యాలు... ఆర్థిక సమీకరణాలు... సామాజిక స్వరూపాలను అనూహ్యంగా మార్చేస్తున్నాయి.
వందల సంవత్సరాల్లో కనిపించని మార్పు... రాబోయే పదేళ్లలో కనిపిస్తుందంటున్నారు... ఇప్పుడున్న ఉద్యోగాలు ఉండకపోవచ్చు... చదువులు ఇలాగే సాగకపోవచ్చు... జీవితాలిలాగే గడవకపోవచ్చు! ఆల్గ్గోరిథమ్‌లు... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లతో పేద-పెద్ద అనే తేడా లేకుండా అందరిపైనా అప్రమేయ ప్రభావం! అందుకే.... వానాకాలానికి గొడుగులతో... మండుటెండలకు చల్లదనంతో సిద్ధమైనట్లు... అనూహ్య మార్పులకు సిద్ధమవటమూ ప్రతి కుటుంబానికీ ఇప్పుడు ఆవశ్యకం! అప్పుడే... రాబోతున్న ఆర్టిఫిషియల్ తుపానులో కొట్టుకుపోకుండా నిలబడగలుగుతాం! ఆ సన్నద్ధత మనలో ఎంతుందో బేరీజు వేసుకోవటానికి... అనివార్యమైన మార్పునకు సంసిద్ధమవటానికి... క్యాలండర్ మారుతున్న వేళ ఓ సుముహూర్తం! రండి... అనిశ్చిత భవిష్యత్తుకు సిద్ధమవటం ఎలాగో... చూద్దాం!
వేగంగా దూసుకొస్తున్న ఏఐ, మాయమవుతున్న కొలువులు, పుట్టుకొస్తున్న కొత్త కోర్సులు, ఆరోగ్య, ఆర్థిక ఒత్తిళ్లు, యుద్ధాలు, మారుతున్న భౌగోళిక రాజకీయ స్వరూపాలు...
ఇవన్నీ ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా భవిష్యత్ సవాళ్లకు సన్నద్ధం కావాలని చెబుతున్న సంకేతాలే!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సా (ఏఐ)... అగ్రరాజ్యాల అధికార యావా... కారణాలు ఏవైనా అనిశ్చితి ఖాయమనే విషయాన్ని 2025 స్పష్టం చేసింది.
అలాగని భవిష్యత్తు భయపడాల్సింది కాదు సిద్ధపడాల్సింది.
యోగ క్షేమం వహామ్యహమ్ అంటే...
రేపటికి సిద్ధంగా ఉండడమే!
ఏడాది మారుతోందంటే కేవలం కేలండర్ మార్పు మాత్రమే కాదు. మన కొలువులు, ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, మనసు... ఇలా అన్నింటినీ పరీక్షించుకునే, సమీక్షించుకునే సమయం కూడా!
2026 మనకు ఏమిస్తుందనేది, మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సంసిద్ధత సవాళ్లను తొలగించకపోవచ్చు. కానీ వాటిని జయించే శక్తినిస్తుంది.
మరి సరికొత్త ఏడాదికి మన జీవితం... మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం?
1.గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ తడవకుండా నిలువరిస్తుంది. పొదుపు - మదుపు కూడా మనల్ని ఆపదలో ఆదుకునే నేస్తాలవుతాయి. అనిశ్చితిని ఎదుర్కొనే సామర్ధ్యాన్నిస్తాయి.
చిత్తూరుకు చెందిన శాంతి దంపతుల నెల ఆదాయం రూ.45 వేలు. అందరి ఇళ్లలోలాగానే పిల్లల స్కూల్ ఫీజులు, పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం ఖర్చులు వాళ్లకూ ఉన్నాయి. ఇటీవల వారి వృత్తిజీవితంలో ఒడుదొడుకులొచ్చాయి. ఆదాయం ఆగిపోయింది. కానీ వాళ్ల జీవితం మాత్రం ప్రభావితం కాలేదు.

ఎలా సాధ్యమైంది?
6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ చేతిలో ఉంది. కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ముందే ఉంది.
- ఇంటి గోడలు, తలుపులు బలంగా ఉన్నాయా అని చూసుకున్నట్లే... కుటుంబానికి రక్షణ సక్రమంగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. చాలామంది ప్రతినెలా సంపాదిస్తారు. కానీ ఒక్క నెల జీతం ఆగితే అంతా అల్లకల్లోలం! ఆర్థిక భద్రత అంటే... ఎక్కువ సంపాదన కాదు. తక్కువ అవసరాలు... అనిశ్చితిని తట్టుకునే శక్తి! అందుకే ఎంత ఎక్కువ జీతం వస్తుందని కాకుండా... ఆరునెలలు జీతం రాకున్నా నిలబడగలుగుతామా అనేది ప్రధానం! ఎమర్జెన్సీ ఫండ్.... అన్నిరకాల బీమాలే ఈ కాలపు రక్షణ గోడలు! అత్యవసర నిధి, బీమాలు, అనవసర ఈఎంఐలు తగ్గించుకోవటం అనేవి లగ్జరీలు కావు. జీవన రక్షణ పరికరాలు.
- మధ్యతరగతికి డబ్బు ఉన్నా టెన్షనే... లేకున్నా టెన్షనే! అంటే డబ్బు సమస్య అనేది జీతం తక్కువ ఉండటం వల్ల వచ్చేది కాదు.. ప్లానింగ్ లేకపోవటం వల్ల వచ్చేది. అందుకే సంవత్సరమంతా ఎంత సంపాదించాలని కాదు... ఎంత నిలబెట్టుకోవాలని ఆలోచించాలి. 20లలో ఏం చేయాలో, 30లలో ఏం చేయాలో, 40లలో ఏం చేయాలో ముందుగా ఆలోచించుకొని ఆచరణలో పెడితే నిశ్చింతగా ఉండొచ్చు.
- నిజానికి మనలో చాలా మంది ఆర్థిక అక్షరాస్యులం కాదు. ఆర్థిక ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలో? ఎలా తెలివిగా మదుపు చేయాలో, పెట్టుబడి పెట్టాలో తెలిసినవారు చాలా తక్కువ మంది. ఆర్థిక ప్రణాళిక అంటే చాలామంది డబ్బులు దాచుకోవటం అనుకుంటారు. కేవలం దాచుకుంటేనే సరిపోదు. దాచుకున్నదాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేయాలి. అలా చేయటంలో లాభం ఏంటి? రిస్క్ ఏంటో తెలియాలి.
- ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, పొదుపు- మదుపు ఏమిటి? అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే ఎలా తట్టుకోవాలి? అనే అంచనాలతో అవసరమైన అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కొవిడ్ తగ్గినా దాని ప్రభావం మన ఆరోగ్యాలపై, కుటుంబాలపై ఇంకా ఉంది. ఉపద్రవాల నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి.
- కుటుంబ ఆర్థిక భద్రత అనేది ఒక్కరి భుజస్కందాలపైనే కాదు... కుటుంబంలోని అందరి అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అందుకే పిల్లలతో కలసి సేవింగ్స్, ఖర్చులు... బీమాల గురించి మాట్లాడుతుండాలి. అదే నిజమైన ఫైనాన్షియల్ లిటరసీ!
చెక్ కరో..!
- వార్షిక వ్యయాన్ని సమీక్షిస్తున్నారా?
- అత్యవసర నిధి ఏర్పాటు చేశారా?
- నామినీ వివరాలు అప్‌డేట్ చేసుకున్నారా?
- పన్ను పొదుపు విషయాలకు ప్రణాళిక ఉందా?
- ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నారా?
- క్రెడిట్, సిబిల్ నివేదికలను తనిఖీ చేస్తున్నారా?
- అప్పులను తనిఖీ చేసి క్లియర్ చేసుకుంటున్నారా?
- దీర్ఘకాల పొదుపు, మదుపు చేస్తున్నారా?
- బీమా సొమ్మును సమీక్షిస్తున్నారా?
- మీ ఆస్తులను లక్ష్యాలకు అనుగుణంగా మారుస్తున్నారా?
2. మన లక్ష్యాలు చిన్నవా, పెద్దవా అనే విషయాన్ని ప్రకృతి పట్టించుకోదు. చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుంటే మనలోని అంతర్గత శక్తి వాటిని సాధించేందుకు తోడ్పడుతుంది. పెద్ద లక్ష్యాలను కోరుకుంటే అందుకు తగ్గట్టు సామర్ధ్యం రెట్టింపవుతుంది.
అనిల్ వయసు 34 ఏళ్లు. రోజుకు 10 గంటలు లాప్‌టాప్ పైనే పని. ఇటీవలే బీపీ, షుగర్ మొదలయ్యాయి.
డాక్టర్ చెప్పిన మాట
సమస్య నీది కాదు... నీ జీవన శైలిది.
- యుక్త వయసులో ఉన్నప్పుడు నిద్రలేకుండా... ఆహారం పట్టించుకోకుండా... ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు కూడా జంక్‌ఫుడ్‌లకు అలవాటు పడుతున్నారు. మొబైల్‌పై చూపించే శ్రద్ధ శరీరంపై చూపించట్లేదు. రీల్స్‌కు ఇస్తున్న సమయం మనసుకు ఇవ్వట్లేదు. ఫలితంగా బీపీ, షుగర్, డిప్రెషన్‌లు ఇప్పుడు వయసును అడగటం మానేశాయి. అందరినీ అలుముకుంటున్నాయి. మూడు పదులు రాకముందే జుట్టు నెరుస్తోంది.
- కడుపు నిండితే సరిపోదు.... శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలి. రోజుకు ఏది.. ఎంత తీసుకుంటున్నామో తెలుసుకోవాలి. డైట్ లిటరసీ కూడా కావాలి. ఈరోజు పిల్లల ఆహారం... రేపటి వారి శరీరం... మెదడు... రోగనిరోధక శక్తి! అంటే మనం పెట్టే తిండే భవిష్యత్ పౌరులను, దేశాన్ని తయారుచేస్తుంది.
- వ్యాధులు చెప్పిరావు. వయసెంతనీ అడగవు... మంచి జీవనశైలే నిజమైన ఔషధం. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆయుష్షు పెరగాలన్నా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాల్సిందే. వ్యాధి లేకపోవటమే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు... శక్తి, నిద్ర, చురుకుదనం ఉంటేనే నిజమైన ఆరోగ్యం. ఇంట్లో అంతా బిజీ... కానీ ప్రతి ఆదివారం... కలిసి నడక... ఇంటి భోజనం, ఫోన్ ఫ్రీ టైమ్... ఇలాంటి చిన్న అలవాట్లు పెద్ద ప్రభావం చూపుతాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. మితిమీరిన స్క్రీన్‌టైమ్ శరీరాన్ని త్వరగా వృద్ధాప్యంవైపు నడిపిస్తుంది.
- అందుకే ఆరోగ్య భద్రతంటే... జిమ్‌లో మెంబర్‌షిప్, డైట్ కంట్రోల్ కాదు. జీవితంలో క్రమశిక్షణ. రోజూ నడక... సరైన నిద్ర, ఫోన్‌కు కొంత దూరం... ఆత్మీయ సంభాషణలు..... ఇవే మన భవిష్యత్తుకు బీమాలు...ధీమాలు! ఆరోగ్యాన్ని తర్వాత చూసుకుందాం అన్నామంటే... భవిష్యత్తును అప్పు పెట్టడమన్నట్లే!
మన ఆరోగ్యం మందులు, ఆసుపత్రులతో కాదు రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఏళ్లుగా మనం నిర్లక్ష్యం చేసిన అలవాట్ల వల్ల వ్యాధులు మొలకెత్తుతున్నాయి. వాటికి నారు నీరు పోసి పెంచేది మనమే.
చెక్ కరో..!
- ఏటా ఒక్కసారైనా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా?
- అవసరమైన వ్యాక్సిన్ల గురించి తెలుసుకుంటున్నారా?
- వైద్యుల సూచనల మేరకు కనీసం రెండేళ్లకు ఒకసారైనా దంతాలు శుభ్రం చేయించుకుంటున్నారా?
- తరచూ కంటి పరీక్షలకు వెళ్తున్నారా?
- ఆందోళన, మానసిక కుంగుబాటు, ఒత్తిడిని తగ్గించే జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
- దినచర్య, నిద్ర సమయాలకు సరైన ప్రణాళిక పాటిస్తున్నారా?
- పౌష్టికాహారం, రోజులో కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమకు కేటాయిస్తున్నారా?
- ఆరోగ్య బీమా తీసుకున్నారా?

3. ఇతరులను చూసో, ఇతరులు చెప్పారనో, ఉద్వేగంలోనో తీసుకునే నిర్ణయాలు, చేసుకునే తీర్మానాలు నిలవవు! అవసరాలు, ప్రయోజనాల ఆధారంగా, వ్యక్తిగత మెరుగుదలకు ఉపయోగపడే వాటినే కొనసాగించాలి. నిన్నటి కంటే ఈరోజు... ఈరోజుకంటే రేపు మిమ్మల్ని మరింత మెరుగ్గా చేసేవాటినే తీర్మానాల జాబితాలో ఉంచుకోవాలి.
రాహుల్, హైదరాబాద్‌లో మూడేళ్లుగా కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏఐ టూల్స్ రావడంతో ఆయనున్న టీంలో ఐదుగురిని తొలగించారు. రాహుల్ మాత్రం సేఫ్.
ఎందుకు?
అతను భవిష్యత్తును ఊహించి డేటా ఎనలిటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ముందే నేర్చుకున్నాడు.
- డిగ్రీలు ఒకప్పుడు ఉద్యోగ తలుపులు తెరిచే తాళంచెవిలాంటివి! కానీ ఇప్పుడు అదొక్కటే సరిపోవటం లేదు. డిగ్రీ ఉద్యోగాన్నిచ్చినా... దాన్ని నిలబెట్టేది మాత్రం నైపుణ్యమే. ఆ స్కిల్లింగ్ ఆగిపోయినా, పాతబడినా... ఆదాయం కూడా ఆగే ప్రమాదం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కుటుంబాన్ని నిలబెట్టేది సంపద ఒక్కటే కాదు నైపుణ్యం కూడా!
- ఇంతదాకా ఏం చదివారు అని అడుగుతున్నవారే... ఇప్పుడు ఏం చేయగలగరని అడుగుతున్నారు... ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంబీఏలు జీవితానికి, జీతానికి గ్యారెంటీలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు డిగ్రీలు మామూలైపోయాయి. నైపుణ్యం మనల్ని ఆ మామూలు నుంచి వేరు చేస్తోంది.
- ఉద్యోగం అంటే ఆరామ్ కుర్చీ కాదు. నిరంతర ప్రయాణం! మున్ముందు ఉద్యోగాలు ఇలాగే ఉండకపోవచ్చు. కొలువులు కొన్ని మాయం కావొచ్చు. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా ఉంటుంది. అది... పని! అది చేయడం రావాలి. రావాలంటే నైపుణ్యం కావాలి.
- చిన్నప్పటి నుంచే పిల్లల చదువుల తీరు మారాలి. సమాధానాలు సరిగ్గా రాయటమే కాదు... సరైన ప్రశ్న అడగటాన్నీ ప్రోత్సహించాలి. మార్కులు ఎన్ని వచ్చాయనేది కాదు... సమస్యనెలా పరిష్కరిస్తున్నారనేది కీలకం. అదే భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్ల మధ్య బతుకు మంత్రం అవుతుంది.
- అలాగని ఒకే స్కిల్ మీద ఆధారపడితే కూడా ప్రమాదమే. ఒకదాంట్లో పూర్తి పట్టు.... ఇతరాలపై అవగాహన అవసరం. ఉదాహరణకు- ఓ అకౌంటెంట్‌కు డాటా ఎనలిటిక్స్... మేనేజర్‌కు టెక్నాలజీ పరిజ్ఞానం, టెక్నిషియన్‌కు కమ్యూనికేషన్ స్కిల్! ఉద్యోగంలో భద్రత అంటే ఉద్యోగం మారినా... ఆదాయం ఆగని స్థితి. 40 ఏళ్ల వయసులో ఏం నేర్చుకుంటాం అనుకోవద్దు... నేర్చుకునే మనసుంటే అదే అసలు యవ్వనం!
- నిశితంగా చూస్తే ప్రపంచంలో అనిశ్చితితో పాటు అవకాశాలూ పెరుగుతున్నాయి. అందుకే పరిస్థితులను చూసి భయపడడం కాదు... వాటిపై స్పష్టత తెచ్చుకోవాలి. తప్పుచేసినా నేర్చుకునే ధైర్యం నేటి అవసరం. ఇతరులతో పోలిక కాదు... తనతో తనకు పోటీ... నిన్నటి తనకు... ఇవాల్టి తనకు పోలిక! ఏమైనా మెరుగయ్యామా అనే కొలబద్ద! అలా స్వీయాభివృద్ధికి బాటలు వేసుకునేవారిదే విజయం.

2026 మీకు కొలువునివ్వొచ్చు. ఇవ్వకపోచ్చు. కానీ ఉపయోగపడే మనిషిగా ఉంటే మాత్రం తప్పకుండా నిలబెడుతుంది. అందుకు సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సింది.
చెక్ కరో..!
- కొత్త సాంకేతికత, డిజిటల్ అక్షరాస్యతలో మీ స్థానం?
- ఏఐ ఏజెంట్‌లో నైపుణ్యం పెంచుకుంటున్నారా?
- ప్రామ్ట్ ఇంజినీరింగ్‌పై అవగాహన ఉందా?
- కోడింగ్ లాంగ్వేజ్‌లు, కొన్ని నాన్ కోడింగ్ నైపుణాలపై దృష్టి పెడుతున్నారా?
- ఏఐ ఎథిక్స్ తెలుసా?
- 20-20-20, ఎల్‌బో రూల్స్‌పై అవగాహన ఎంత?
- సైబర్ సెక్యూరిటీ విధానాలు తెలుసుకుంటున్నారా?
- డీప్‌ఫేక్‌పై అప్రమత్తంగా ఉంటున్నారా?
- నో కోడ్ ఆటోమేషన్ వినియోగిస్తున్నారా?
- వివిధ సోర్సుల్లో లభించే కంటెంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారా?
- డిజిటల్ మర్యాదలు పాటిస్తున్నారా?
- నైపుణ్యాలను పెంపొందించుకునేలా వివిధ కోర్సులు చేస్తున్నారా?

4.ఒకప్పుడు కుటుంబ భద్రత అంటే... ఇల్లు, స్థిర ఉద్యోగం, కొంత పొదుపు! రోజురోజుకూ వేగంగా మారుతున్న టెక్నాలజీ... రాజకీయ, ఆర్థిక అనిశ్చిత ప్రపంచంలో భద్రతకు అర్థం మారుతోంది. మార్పులకు భయపడకుండా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం సంపాదించుకోవటమే భద్రమైన కుటుంబానికి అర్థం. కేవలం డబ్బుంటే సరిపోదు. భవిష్యత్తు భద్రత నాలుగు స్తంభాలపై నిలబడుతుంది. డబ్బు, ఆరోగ్యం, నైపుణ్యం, సంబంధాలు... ఇవన్నీ సమపాళ్లలో ఉన్న కుటుంబమే సుభిక్షంగా ఉంటుంది.
సుధీర్ వయసు 41 మంచి ఆదాయం ఉంది. కానీ తీవ్రమైన ఒత్తిడీ ఉంది. చుట్టూ అందరూ ఉన్నారు... కానీ ఆనందంలేదు.
కారణం?
ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకునేది వాట్సప్‌లో
- ఇళ్లలో టీవీల సైజ్‌లు పెద్దవయ్యాయి. ఫోన్లు స్మార్ట్ అయ్యాయి. పరస్పర సంభాషణలు చిన్నబోతున్నాయి. కమ్యూనికేషన్ పెరిగింది... కానీ కనెక్టివిటీ తగ్గింది!
- ఒంటరితనం అతిపెద్ద సమస్యగానే కాదు కొత్త వ్యాధిగా మారుతోంది. కుటుంబం ఉన్నా మనసు ఒంటరిగా ఉంటే ప్రమాదమేకదా!
- ఒకవైపు తల్లిదండ్రులు... వృద్ధాప్యంలోకి అడుగుపెడుతుంటే... పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్నారు. ఈ రెండు తరాల మధ్య వారధి నిర్మించాల్సిందే.
- సిప్‌లు, షేర్‌మార్కెట్లే కాదు... సంబంధాలు కూడా పెట్టుబడులే. సమయం పెడితే లాభం... నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోలేని సంబంధాలను మించిన ఘోరం మరోటి లేదు.
- మనవారికి సమయం ఇస్తే బంధాలు అవే బలపడతాయి. బలమైన సంబంధాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
- మనసే మనకు మొదటి పెట్టుబడి... దాన్ని రక్షించుకుంటే... ప్రశాంతంగా ఉంచుకుంటే భవిష్యత్తు ఎలా ఉన్నా భయపెట్టదు.
ఉద్యోగాలు మారవచ్చు... కొలువులు పోవచ్చు...ఆదాయాలు తగ్గవచ్చు....ప్లాన్‌లు దెబ్బతినవచ్చు... ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో మనల్ని నిలబెట్టగలిగే అత్యంత ముఖ్యమైన నైపుణ్యం మానసిక స్థిరత్వం! అది కుటుంబ భద్రత నుంచి వస్తుంది. కుటుంబ భద్రత అంటే... ఎప్పుడైనా మాట్లాడగలిగే వాతావరణం ఉండటం. మావాళ్లున్నారని ధైర్యాన్నిచ్చే వాతావరణం ఉండటం. వారానికో రెండుసార్లు కలసి భోజనం చేయటం... రోజూ 10 నిమిషాలు అంతా కలసి మాట్లాడుకోవడం! ఇవే నిజమైన రక్షణ గోడలు. అవే మానసిక స్థిరత్వాన్నిస్తాయి. ధైర్యాన్నిస్తాయి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. కుటుంబం మన మొదటి రక్షణఛత్రం.
కుటుంబ భద్రతంటే సమస్యలు లేకపోవటం కాదు... ఉన్నప్పుడూ స్పష్టంగా ఉండగలగడం. ధైర్యంగా నిలబడటం.
చెక్ కరో..!
- వారంలో ఒక రోజును కుటుంబం కోసం కేటాయించుకుంటున్నారా?
- ఇంట్లోవారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా?
- విభేదాలను సున్నితంగా పరిష్కరించుకుంటున్నారా?
- నిద్రకు ముందు కనీసం 5 నిమిషాలైనా భాగస్వామితో మాట్లాడుకుంటున్నారా?
- ఇద్దరి ప్రేమను, భాషను అప్పుడప్పుడు సమీక్షించుకుంటున్నారా?
- తినేటప్పుడు, నిద్రకు ముందు, లేచిన తర్వాత నో ఫోన్ జోన్ పాటిస్తున్నారా?
- ఆర్థిక అంశాలు కలిసి చర్చిస్తున్నారా?
- ఇతరుల వ్యక్తిగత సమయం, అభిరుచులను గౌరవిస్తున్నారా?
- భార్యాభర్తలు కలిసి చేయాలనుకున్న అంశాలు ఆచరణలో ఉన్నాయా?
ఇల్లు ఇటుకలతో కాదు...విలువలతో నిలబడుతుంది. అలాగే మంచి భవిష్యత్తు కేవలం అదృష్టంతో కాదు... సంసిద్ధతతో సాధ్యమవుతుంది!
రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవటం కాదు. ఏం జరిగినా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం! సన్నద్ధత భవిష్యత్తుపై భయంతో కాదు. సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం!
డబ్బు రావచ్చు పోవచ్చు... ఉద్యోగం మారొచ్చు... టెక్నాలజీ పాతది పోయి కొత్తది రావొచ్చు. కానీ నేర్చుకునే మనసు... మాట్లాడుకునే కుటుంబం... మారటానికి సిద్ధంగా ఉండే ఆలోచన... ఉంటే ఏ కుటుంబమైనా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నట్లే! కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ మీరెంత సన్నద్ధం... చెక్ యువర్‌సెల్ఫ్!
-ఈనాడు ప్రత్యేక విభాగం
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :