Goa: పర్యాటకానికి గోవా పాఠం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

శీతాకాలం పర్యాటకుల స్వర్గధామం గోవా. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని దక్షిణ గోవాలో ఆవిష్కరించారు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలతో పాటు శ్రీరామచంద్రుణ్ని కూడా చూసి ముగ్ధులవుతున్నారు. ఈ వెలుగుల వెనక దట్టమైన చీకటి కూడా ఉంది. 64 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున పోర్చుగీస్ వారి నుంచి విమోచన పొందిన గోవాకు ఇప్పుడు కావాల్సింది- డ్రగ్స్ దందా, దోపిడీలు, పర్యాటకులపై అత్యాచారాలూ వేధింపుల నుంచి నిజమైన విముక్తి!
డిసెంబరు వచ్చిందంటే చాలు పర్యాటకులతో గోవా కిటకిటలాడిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది కుర్రకారు సైతం గోవా వెళ్లడానికి ఆరాటపడిపోతుంటారు. ఐటీ ఉద్యోగులైతే అక్కడ పార్టీల కోసం ముందుగానే ‘డేట్స్’ ఫిక్స్ చేసేసుకుంటారు. ఈ సీజన్‌లో విదేశీ పర్యాటకులకూ కొదవుండదు. గోవాలోని పచ్చటి కొండలు, పాలనురుగు జలపాతాలు, ముచ్చటైన సాగర తీరాలు, పొడవాటి కొబ్బరి చెట్ల నడుమ వయ్యారాలు పోయే రహదారులు, శతాబ్దాల నాటి చర్చిలకు తోడు... ఎత్తయిన పైకప్పులూ బాల్కనీలూ ఉండే భవంతులు సైతం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అడుగడుగునా ప్రకృతి సౌందర్యం, భారత-పోర్చుగీస్ సంస్కృతుల సంగమమైన ఈ ‘తూర్పురోమ్’ చరిత్ర కూడా ప్రత్యేకమైనదే. 1510లో బీజాపుర్ సుల్తానుల చేతిలోంచి పోర్చుగీసు పాలనలోకి వెళ్లిపోయిన గోవాకు... భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన పద్నాలుగేళ్లకు గాని విమోచన లభించలేదు! నాలుగున్నర శతాబ్దాల తరబడి ‘గోపకపట్టణ’లో తిష్ఠవేసిన పోర్చుగీస్ పాలకులు దాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ససేమిరా ఇష్టపడలేదు. అదిగోఇదిగో అంటూ కాలయాపనచేస్తూ రావడంతో, మరిక సహించబోమంటూ భారత్ 1961 డిసెంబరు 18న ‘ఆపరేషన్ విజయ్’ చేపట్టింది. త్రివిధ సేనలు 36గంటల పాటు సాగించిన దాడుల ధాటికి అక్కడి గవర్నర్ జనరల్ బిత్తరపోయారు. ఆ మరుసటి రోజే ఆయన లొంగిపోవడంతో గోవాతో పాటు పోర్చుగీస్ ఆధీనంలోని దమణ్ దీవ్‌లూ ఇండియా వశమయ్యాయి. అందుకే డిసెంబరు 19వ తేదీని గోవా విమోచన దినోత్సవంగా జరుపుతున్నారు.
పారని నిజాం పాచిక!
ఆంగ్లేయులు ఇండియాకు స్వాతంత్య్రం ప్రకటించడానికి సిద్ధమవుతున్న ఘడియలవి. దేశ నాయకులతో జోరుగా మంతనాలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న నాటి నిజాం పాలకుడూ, ప్రపంచ కుబేరుడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఎటూ పాలుపోలేదు. స్వతంత్ర భారతంలో తన ఆటలు సాగవనీ, తన విదేశీ వాణిజ్యానికి దారులన్నీ మూసుకుపోవడం ఖాయమనీ ఆయనకు తెలుసు. దాంతో నిజాం- తన దూతగా నవాజ్ జంగ్‌ను లండన్‌లోని బ్రిటిష్ ఉన్నతాధికారి సర్ అలెగ్జాండర్ రోజర్స్ దగ్గరికి పంపాడు. ఆయన రాయబారంతో లండన్, లిస్బన్‌లలో పోర్చుగీస్ అధికారులతో రహస్య మంతనాలు సాగించాడు నిజాం. గోవాను తనకు అమ్మేయాలనీ, కనీసం లీజుకైనా ఇవ్వాలని ప్రతిపాదించాడు. గోవా నుంచి అరేబియా సముద్రం మీదుగా వ్యాపారం చేసుకుంటాననీ, ఎంత కావాలంటే అంత ఇస్తాననీ అభ్యర్థించాడు. కానీ, పోర్చుగీసు పాలకులు ససేమిరా కుదరదని చెప్పేశారు. తరవాత ఆ ప్రయత్నాలు కొంత ముందుకెళ్లినా అప్పటికి నిజాం ఊహించలేకపోయాడు- తన సంస్థానం కూడా స్వతంత్ర భారతంలో విలీనమైపోతుందని!
పరువుమాస్తోంది అందుకే...
పోర్చుగీస్ వారి నుంచి విముక్తి పొందిన గోవా మొదట కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ వచ్చింది. 1987 మే 30న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పర్యాటకమే ప్రధాన ఆదాయవనరుగా కలిగిన గోవా తలసరి ఆదాయంలోనూ, మానవాభివృద్ధి సూచీలోనూ ముందువరసలో నిలుస్తోంది. నిరుడు కోటి మందికి పైగా అక్కడ పర్యటించగా, వారిలో సుమారు నాలుగున్నర లక్షల మంది విదేశీయులున్నారు. దక్షిణాది వారు, ముఖ్యంగా తెలుగు పర్యాటకులు ఎక్కువగా నార్త్ గోవాలోని కాలన్‌గూట్, బాగా, అంజునా బీచ్‌లకు వెళ్తుంటారు. చారిత్రక అగుండా చపోరా కోటలనూ చుట్టివస్తారు. పాత గోవాలోని చర్చిలు, మపుసా వంటి మార్కెట్లు అన్నా మనవారికి మహా సరదా. ఇప్పుడు శ్రీరాముడి మహావిగ్రహం దక్షిణ గోవాలోని పర్తగాలీలో కొలువుతీరింది కాబట్టి, ఇకపై అక్కడ కూడా పర్యాటకులు పెరుగుతారని అంచనా.పర్యటన సంగతి సరే... గోవాలోని ఐఐటీ, బిట్స్ పిలానీ, ఐఐఎం వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఎంతోమంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. ఉత్తర గోవాతో పోలిస్తే దక్షిణ గోవా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏకాంతం, ప్రశాంతత కోరుకునేవారు అక్కడి పాలోలెం, అగోడా బీచ్‌లలో కనిపిస్తారు. విదేశీయులు ఎక్కువగా వచ్చేది అక్కడికే. ఇప్పుడు చిక్కొచ్చిపడిందీ అక్కడే. విదేశీ వనితలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలతో గోవా పరువుమాస్తోంది. ఎక్కడో మోరాకో నుంచి వచ్చిన మహిళ తీవ్ర అస్వస్థతతో గోవా ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంటే... అక్కడి వైద్యుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడంటే ఏమనుకోవాలి? 2019లో 9.4లక్షల మంది విదేశీ పర్యాటకులు పంజిమ్‌కు వస్తే, ఇప్పుడు అందులో సగంమందైనా రావడం లేదంటే అందుక్కారణం ఇలాంటి అకృత్యాలే!
తెలుగు రాష్ట్రాలకూ డ్రగ్స్ సరఫరా...
గోవాలో డ్రగ్స్ దందా, పర్యాటకులను దోచుకోవడం వంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. బ్రెజిల్, నైజీరియా వంటి దేశాల నుంచి గోవాకూ; అక్కడి నుంచి హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకూ డ్రగ్స్ సరఫరా అవుతుండటం కలవరపరుస్తోంది. మొన్నీమధ్యే దర్యాప్తు నిమిత్తం గోవా వెళ్లిన తెలంగాణ యాంటీనార్కోటిక్స్ పోలీసులు అక్కడ ఓ నిందితుణ్ని పట్టుకుని రూ.1.25 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏప్రిల్‌లో దక్షిణ గోవాలో రూ.43 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గోవా పర్యాటకాన్ని పట్టిపీడిస్తున్న అత్యాచారాలూ వేధింపులూ ట్యాక్సీ దందాలూ డ్రగ్స్ మాఫియా నుంచి తక్షణమే బయటపడాలంటే, ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. టూరిజానికి పెద్దపీట వేయాలనుకుంటున్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ ‘బీచ్ ప్యారడైజ్’ చేదు అనుభవాలను గమనంలో ఉంచుకోవాలి. మాదక ద్రవ్యాలకూ వేధింపులకూ తావులేని సురక్షితమైన, ఆహ్లాదకరమైన పర్యాటకానుభూతిని అందివ్వాలి. మరీ ముఖ్యంగా విదేశీ పర్యాటకుల భద్రతకు పూచీ వహించాలి. అప్పుడే ప్రగతికి ఊతంగా పర్యాటకం మూడు పువ్వులూ ఆరుకాయలుగా వర్థిల్లగలదు!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :