Property: గిఫ్ట్ డీడ్ Vs వీలునామా..ఆస్తి బదిలీకి ఏది సరైంది?

Eenadu icon
By Business News Team Published : 23 Dec 2025 15:58 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

మీ ఆస్తిని, మీకు సంబంధించిన వారికి లేదా ఇష్టపడే వ్యక్తికి బహుమతి ద్వారా లేదా వీలునామా ద్వారా బదిలీ చేయొచ్చు. ఆస్తులను జీవించి ఉన్నప్పుడే బహుమతి ద్వారా ఇవ్వడం సరైందా లేక మరణం తర్వాత వారసులకు ఆస్తులు చెందేలా వీలునామా రాయడం సరైందా అని తెలుసుకోవడంతో పాటు వీటి గురించి కొన్ని కీలకమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

బహుమతి ద్వారా

భారతీయ కాంట్రాక్ట్ చట్టంలోని నిబంధనల ప్రకారం, మీరు స్వయంగా సంపాదించిన ఆస్తిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. గిఫ్ట్‌ డీడ్‌ అమలు చేయడం ద్వారా స్థిరాస్తిని బహుమతిగా ఇవ్వవచ్చు. మీ ఆస్తిని బహుమతి ద్వారా ఇచ్చేటప్పుడు దాన్ని తీసుకున్న గ్రహీత ఇప్పటినుంచే ఆస్తిని నిర్వహించడానికి, అనుభవించడానికి హక్కు ఉంటుంది. అయితే, బహుమతిగా ఆస్తిని ఇచ్చేటప్పుడు మైనర్‌ కానీ, దివాలా తీసిన వ్యక్తి కానీ అయి ఉండకూడదు. ఆస్తి బదిలీ చట్టంలోని నిబంధనల ప్రకారం స్థిరాస్తికి సంబందించిన ప్రతీ లావాదేవీని ఆ ప్రాంత రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. గిఫ్ట్ డీడ్ అమలు అయిన తేదీ నాటికి, ఆస్తి మార్కెట్ విలువపై మీరు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. కొంతమంది దగ్గరి బంధువులకు బహుమతి ఇవ్వవలసి వస్తే, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ చెల్లింపులో రాయితీ నిబంధనలను కలిగి ఉన్నాయి.

పన్నులు

సెక్షన్ 56(2) నిబంధనల ప్రకారం మీ బంధువు కాని వ్యక్తికి బహుమతి ఇవ్వాలనుకుంటే(బహుమతికి సంబంధించిన విలువ రూ. 50,000 దాటితే), ఆస్తిని స్వీకరించిన వారు అందుకున్న సంవత్సరంలో ఆస్తికి సంబంధించిన మార్కెట్ విలువను అతని మొత్తం ఆదాయంలో చేర్చాలి. అటువంటి బహుమతులపై తగిన పన్ను చెల్లించాలి.

వీలునామా ద్వారా

ఏదైనా ఆస్తి బదిలీని వీలునామా ద్వారా కూడా అమలు చేయవచ్చు, కానీ, ఆ ఆస్తిని అప్పగించడం..వీలునామాను అమలు చేసే వ్యక్తి మరణించిన తర్వాత అమలులోకి వస్తుంది. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం, వీలునామాకు స్టాంప్ డ్యూటీ అవసరం లేదు. దాన్ని నమోదు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి, మీ ఆస్తిని మీరు కోరుకునే వ్యక్తులకు బదిలీ చేయడానికి వీలునామా..అత్యంత సులభమైన/చౌకైన మార్గం.

వీలునామా అవసరం..

వీలునామా నమోదు తప్పనిసరి కానప్పటికీ, మీ ఆస్తుల వారసత్వానికి సంబంధించిన వ్యాజ్యాలను, కుటుంబ సభ్యుల మధ్య గొడవలను నివారిండానికి వీలునామాను నమోదు చేయడం చాలా మేలు చేస్తుంది. వీలునామా ద్వారా ఆస్తిని పొందిన వారికి ఎస్టేట్‌ డ్యూటీ కూడా ఉండదు. అంతేకాకుండా, వీలునామా ద్వారా లేదా వారసత్వ చట్టాల ద్వారా వచ్చిన ఆస్తిపై ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.

వారసత్వం ద్వారా

ఒకరి మరణం తరువాత ఆస్తులను..వ్యక్తులు రెండు విధాలుగా వారసత్వంగా పొందవచ్చు. మరణించిన వ్యక్తి..ఆ సమయంలో అతను కలిగి ఉన్న ఆస్తులకు వీలునామా రాసి ఉండకపోతే, మరణించిన వ్యక్తికి వర్తించే వారసత్వ నిబంధనల ప్రకారం అతని సంబంధీకులకు ఆస్తులు బదిలీ అవుతాయి. మరణించిన వ్యక్తి వీలునామా రాసి ఉన్నట్లయితే, ఆస్తులు వీలునామాలో పేర్కొన్న వ్యక్తులకు వారసత్వంగా వస్తాయి. వీలునామా పరిధిలోకి రాని ఆస్తులు వారసత్వ చట్టం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన చట్టపరమైన వారసులకు వారసత్వంగా లభిస్తాయి.

ఏది మేలు?

ఆస్తిని ఇచ్చేటప్పుడు బహుమతా లేదా వీలునామాను ఎంచుకోవాలా అనే విషయాలను తప్పక అర్ధం చేసుకోవాలి. సమాజంలో ప్రతి వ్యక్తి/కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాలను నిర్ణయించే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణించాలి. మీ ఆస్తులను మరణం తర్వాత మాత్రమే మీకు నచ్చిన వ్యక్తులకు బదిలీ కావాలని కోరుకుంటే మీరు వీలునామాను అమలు చేయడం మంచిది. దీని వల్ల కలిగి ప్రయోజనమేంటంటే మీరు జీవించినంత కాలం ఆ ఆస్తిని అనుభవించడంతో పాటు దానిపై నియంత్రణను కూడా కలిగి ఉండొచ్చు. మీ మరణం తర్వాత మీ ఆస్తులు సజావుగా మీ వారసులు వారసత్వంగా పొందాలని మీరు కోరుకున్నప్పుడు వీలునామాను ఎంచుకోవడం మంచిది.

జాగ్రత్తలు

మీరు ఎవరికైనా తక్షణ సహాయం చేయాలని భావించినప్పుడు ఆస్తిని బహుమతి ద్వారా ఇవ్వొచ్చు. ముఖ్యంగా, మీరు మీ ఆస్తులన్నింటినీ లేదా ఎక్కువ భాగాన్ని బహుమతి ద్వారా మీ చట్టపరమైన వారసులకు బదిలీ చేస్తే, మీరు వృద్ధాప్యంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్లొచ్చు. అదే విధంగా, ట్యాక్స్‌ ప్లాన్‌ కోసం మాత్రమే మీ ఆస్తులను బదిలీ చేయడం కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే పన్నులలో కొంత డబ్బు ఆదా చేయడానికి, మీ విలువైన ఆస్తులపై నియంత్రణ కోల్పోవడం సరైంది కాదు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :