Shubhanshu Shukla: ‘వ్యోమగామి కావాలంటే జ్ఞానదంతాలు వదులుకోవాల్సిందే’ - శుభాంశు

Eenadu icon
By National News Team Published : 25 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన శుభాంశు శుక్లా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అంతరిక్షయానానికి ముందు తన రెండు జ్ఞానదంతాలను తొలగించుకున్నట్లు చెప్పారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యోమగాములకు అవగాహన ఉన్నప్పటికీ.. అంతరిక్ష నౌకలో దంత శస్త్రచికిత్స చేయలేరన్నారు. అందుకే ముందస్తుగానే వీటిని తొలగించుకోవాల్సి వస్తుందని చెప్పారు.

‘‘దంతాల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైంది. ఎంపిక సమయంలో చాలా మంది (ఆసక్తికలిగిన వ్యోమగాములు) దంతాలు తీసేశారు. శిక్షణా సమయంలోనే వీటిని తొలగిస్తారు. ప్రయాణంలో ఏదైనా హెల్త్‌ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ ఇస్తారు. అక్కడ చేయలేనిదేదైనా ఒకటి ఉందంటే అది డెంటల్‌ సర్జరీ మాత్రమే. అందుకే ఎటువంటి సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. నేను రెండు జ్ఞాన దంతాలు తొలగించుకున్నా’’ అని శుక్లా పేర్కొన్నారు.

ఐఐటీ బాంబేలోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శుభాంశు శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్లాతోపాటు ‘గగన్‌యాన్‌’కు ఎంపికైన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ నాయర్‌, గ్రూప్‌ కెప్టెన్‌ అంగద్‌ ప్రతాప్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ నాయర్‌ మూడు దంతాలు తొలగించుకున్నారని, ప్రతాప్‌ నాలుగు తొలగించుకున్నారని శుక్లా వెల్లడించారు. మీరు వ్యోమగామి కావాలంటే మీ జ్ఞానాన్ని వదులుకోవాల్సిందేనంటూ ఆయన చమత్కరించారు. ఇదిలాఉంటే, ఇస్రో-నాసా సహకారంతో యాక్సియం స్పేస్‌ చేపట్టిన యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా అంతరిక్ష యానం చేసిన విషయం తెలిసిందే.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :