GHMC: జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ.. హైకోర్టు నోటీసులు

Eenadu icon
By Telangana News Team Published : 24 Dec 2025 21:29 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకొస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తుక్కుగూడ మున్సిపాలిటీతో పాటు మరికొన్నింటిని జీహెచ్ఎంసీలో విలీనం నిమిత్తం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకువస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ 9, 10, 11లను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు అయింది. తుక్కుగూడకు చెందిన బరిగెల రాజు ఈ పిటిషన్ వేశారు. 

దీనిపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా తుక్కుగూడ జీహెచ్ఎంసీలో విలీనమైందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ కోర్టుకు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేయాలనుకుంటున్నారని, అయితే విలీనం నేపథ్యంలో హద్దులు మారడంతోపాటు ఇతరత్రా ప్రభావం పడుతుందన్నారు. నోటిఫికేషన్‌కు ముందు మున్సిపల్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు లేవని, ఇది పారదర్శకంగా లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :