పర్యాటకులకు ఏదీ భద్రత?

- A
- A+
- A++
భిన్న వాతావరణ పరిస్థితులు, సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన ఇండియాలో చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి రమణీయ ప్రదేశాలు అనేకమున్నాయి. దేశదేశాల పర్యాటకులను అవి విశేషంగా ఆకర్షిస్తున్నాయి. స్థానికంగా ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి ఊతమిస్తున్నాయి. 2023-24లో ఇండియా జీడీపీలో పర్యాటక రంగ వాటా 5.2శాతం. సుమారు ఎనిమిదిన్నర కోట్ల మందికి అది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇలా దేశ పురోగతికి తోడ్పడుతున్న టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ‘ప్రసాద్, స్వదేశీ దర్శన్’ వంటి కార్యక్రమాలను కేంద్రం అమలుచేస్తోంది. పర్యాటక రంగ ప్రాధాన్యాన్ని గుర్తించి తెలుగు రాష్ట్రాలూ ప్రత్యేక విధానాలు తెచ్చాయి. అదే సమయంలో మన దేశంలోని సందర్శనీయ ప్రాంతాలపై ఆసక్తితో దూరతీరాల నుంచి వస్తున్న వారిపై జరుగుతున్న దాడులు, హేయ నేరాలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక పాలసీ తేవాల్సిన అవసరముందన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజా సూచన ఆచరణీయమైనది. టూరిస్టులతో ఎలా మెలగాలన్నదానిపై ప్రవర్తనా నియమావళి రూపొందించి అన్ని రాష్ట్రాలు పటిష్ఠంగా అమలు పరిస్తే- అంతర్జాతీయంగా దేశం పరువుతీస్తున్న దారుణాలను సమర్థంగా అడ్డుకోవచ్చు.
ఈ ఏడాది మార్చిలో తమిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ఫ్రాన్స్ దేశస్థురాలి మీద ఒక గైడ్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అదే నెలలో దిల్లీలోని ఓ హోటల్లో బ్రిటిష్ మహిళపై ఇద్దరు దుర్మార్గులు అకృత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు చూపిస్తానని నమ్మబలికిన ఒక నయవంచకుడు జర్మనీ యువతిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ప్రయాణంలో పరిచయమైన లిథువేనియా మహిళపై నెల్లూరులో ఓ ప్రబుద్ధుడు అత్యాచార యత్నం చేయడం కొన్నాళ్ల క్రితం దుమారం రేపింది. ఇక విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక అయిన ప్రపంచ ప్రసిద్ధ హంపీలో పది నెలల కిందట ఒక ఇజ్రాయెలీ పర్యాటకురాలితో పాటు మరో మహిళనూ బలాత్కరించిన కీచకులు బాధితులతో ఉన్న వ్యక్తిని హతమార్చడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశీయులకే కాకుండా భారతీయులకూ పర్యాటక ప్రదేశాల్లో చేదు అనుభవాలెన్నో ఎదురవుతున్నాయి. రెండేళ్ల కిందట దిల్లీకి చెందిన ఓ కుటుంబం గోవా పర్యటనకు వెళ్తే కిరాతకులు కొందరు కత్తులతో విరుచుకుపడ్డారు. ఇలాంటి అమానుష ఉదంతాలు పర్యాటక రంగ ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయి.
విదేశీ పర్యాటకులను దోచుకోవడం, వారి ప్రాణాలను హరించడం, అపహరణ, లైంగిక దాడులు తదితరాలపై 2016-2023 మధ్య దేశవ్యాప్తంగా పదిహేడు వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. అందులో 111 అత్యాచారాలకు సంబంధించినవైతే, 45 హత్యోదంతాలున్నాయి. ఇలాంటి దాష్టీకాలకు తెగబడుతున్న వారికి త్వరితగతిన శిక్షలు పడుతున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితులన్నింటినీ ప్రస్తావిస్తున్న పలు దేశాలు బాగా ఆలోచించుకుని భారత పర్యటనకు వెళ్లాలని తమ పౌరులను హెచ్చరిస్తున్నాయి. జాతికి ఇదెంత అవమానకరం! ఇంటికొచ్చిన అతిథులను దేవుళ్లుగా భావించి సకల మర్యాదలూ చేసే సంస్కృతి మనది. అలాంటిది ఉరుకులూ పరుగుల జీవితంలో కాస్త సేదతీరదామని ఎంతో ఖర్చు, శ్రమకోర్చి వందలూ వేల కిలోమీటర్ల నుంచి తరలివచ్చే వారిని గౌరవంగా, సురక్షితంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యాటకులపై దురాగతాలకు ఒడిగట్టే వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు. దర్శనీయ ప్రదేశాలన్నిచోట్లా మౌలిక వసతులను పెంచి భద్రతను కట్టుదిట్టం చేయాలి. అప్పుడే పర్యాటక రంగాన అగ్రస్థానానికి చేరాలన్న ఇండియా కల వాస్తవరూపం దాలుస్తుంది.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 04:29 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.