

Revanth Reddy: అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా.. అది నూటికి నూరుపాళ్లు విజయవంతం కావాలంటే అధికారుల సహకారం ఉండాలి. ఇప్పటికంటే పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలి. పనితీరులో మార్పు రాకపోతే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఈనాడు, హైదరాబాద్: ‘‘విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, దార్శనిక పత్రంలో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు వెంటనే నడుం బిగించాలి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలి. అన్ని విభాగాలు సమన్వయంతో, సమర్థంగా పనిచేస్తే.. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను అలవోకగా సాధించగలం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. సచివాలయంలో మంగళవారం వివిధ అంశాలపై నిర్వహించిన సమావేశానికి సీఎస్ కె.రామకృష్ణారావు సహా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘‘ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ వంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ అంటూ లేకపోవడంతో కొన్ని సమస్యలొచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాల్లో విధానాలు తెచ్చాం. రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్ ప్రణాళిక ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. ఇకపై ప్రతి నెలా కార్యదర్శుల పనితీరుపై సమీక్ష ఉంటుంది. కార్యదర్శులందరూ తమ పనితీరు, శాఖల పురోగతిపై సీఎస్‌కు ప్రతి నెలా నివేదిక సమర్పించాలి. మూడు నెలలకు ఒకసారి స్వయంగా నేను సమీక్ష నిర్వహిస్తా. ఐఏఎస్ అధికారులు పది రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలి. నెలలో కనీసం మూడుసార్లు తమ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలి. అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి. శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం లేకపోతే.. ఆశించిన ఫలితాలు రావు. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26లోగా సీఎస్‌కు అందించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్ వంటివి అందుతున్నాయో.. లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలి. ఉద్యోగాల డేటా విషయంలో పూర్తి బాధ్యత అధికారులదే.
ఖాళీ స్థలాల్లో నూతన ప్రభుత్వ భవనాలు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. జనవరి 26 లోపు అద్దె భవనాలను ఖాళీ చేసి.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మారాలి. ఖాళీ లేకపోతే.. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని 113 మున్సిపల్ ఆఫీసులు ఎక్కడెక్కడ అద్దె భవనాల్లో ఉన్నాయో గుర్తించి నివేదిక అందించాలి. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలుంటే వాటిని వినియోగించుకోవాలి. లేదంటే ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వెంటనే నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలి. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్‌వాడీలు.. అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలి. అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండొద్దు
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వాటాగా చెల్లిస్తే.. కేంద్రం దాదాపు 60 శాతం ఇస్తుంది. ఈ పథకాలతో రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుంది. అందుకు అనుగుణంగా అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలి. సీఎస్‌ఎస్ నుంచి వచ్చే నిధులకు అవసరమైన రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ‘ఈ-ఫైలింగ్’ సిస్టమ్ అమలు చేయాలి. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకుండా అన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలి. అన్ని విభాగాలు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి డాష్ బోర్డు సిద్ధం చేయాలి. సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలి. దీంతో అన్ని శాఖల పర్యవేక్షణ సులభతరం అవుతుంది.
రాష్ట్రానికి వెల్లువలా వచ్చిన పెట్టుబడులు ఎంత మేరకు గ్రౌండింగ్ అయ్యాయి.. వాటి పురోగతి ఏమిటనే విషయాన్ని ప్రతి నెలా సమీక్షించుకోవాలి. పరిశ్రమల కోసం భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలి. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్ వంటివి అమలు దిశగా ప్రణాళికలుండాలి. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని టీచింగ్ హాస్పిటళ్లు అద్భుతమైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలి. నిమ్స్ తరహాలో సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఉస్మానియా కొత్త ఆసుపత్రిని అన్ని వసతులతో తీర్చిదిద్దాలి. మెడికల్ కాలేజీ హాస్పిటళ్లను కూడా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌తో అనుసంధానం చేయాలి. అక్కడ సేవలందించే వైద్యులకు, సిబ్బందికి కూడా సర్జరీలు, ప్రత్యేక సేవలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :