నెలసరి సమస్యలకు ‘సీడ్ సైక్లింగ్’!
ఇర్రెగ్యులర్ పిరియడ్స్ చాలామంది మహిళల్ని వేధించే సమస్య. దీనివల్ల బరువు పెరగడం, సంతాన లేమి, రక్తహీనత, ఆస్టియోపొరోసిస్.. వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే దీన్నుంచి విముక్తి పొందేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం, యోగా-ధ్యానం.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు.

- A
- A+
- A++

ఇర్రెగ్యులర్ పిరియడ్స్ చాలామంది మహిళల్ని వేధించే సమస్య. దీనివల్ల బరువు పెరగడం, సంతాన లేమి, రక్తహీనత, ఆస్టియోపొరోసిస్.. వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే దీన్నుంచి విముక్తి పొందేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం, యోగా-ధ్యానం.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. అయితే ‘సీడ్ సైక్లింగ్’ ప్రక్రియ కూడా ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యకు పరిష్కారం చూపడంలో సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇదొక్కటే కాదు.. దీన్ని పాటించడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఏంటీ ‘సీడ్ సైక్లింగ్’? దీన్నెలా పాటించాలో తెలుసుకుందాం రండి..
నెలసరి సక్రమంగా రాకపోవడానికి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా ఓ కారణమే! ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్.. వంటి హార్మోన్ల స్థాయులు తగ్గినప్పుడు పిరియడ్స్ క్రమం తప్పుతాయి. అందుకే వీటి ఉత్పత్తిని పెంచి నెలసరి క్రమంగా వచ్చేలా చేయడంలో నువ్వులు, అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు.. ఈ నాలుగు రకాల గింజలు/విత్తనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రుతుచక్రాన్ని బట్టి వీటిని రెండు దశలుగా తీసుకోవడమే ‘సీడ్ సైక్లింగ్’ ముఖ్యోద్దేశం.

ఏ దశలో.. ఏవి?
రుతుచక్రం అందరిలో ఒకేలా ఉండదు. కొందరికి 28 రోజులకు పిరియడ్స్ వస్తే.. మరికొందరికి 35 రోజులకు రావచ్చు.. ఇంకొందరికి ఒక నెల 28 రోజులకు, మరో నెల 35 రోజులకూ వస్తుంటుంది. ఇలాంటి ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య పరిష్కారానికి ఈ నాలుగు రకాల గింజల్ని రెండు దశలుగా తీసుకోవాల్సి ఉంటుంది.
⚛ మొదటిది ఫాలిక్యులర్ దశ – నెలసరి ప్రారంభమైన రోజు మొదలు అండం విడుదలయ్యే రోజు దాకా అంటే.. 1-14/16 రోజు వరకు ఈ దశగా పరిగణిస్తారు. ఈ సమయంలో రోజూ టేబుల్‌స్పూన్ చొప్పున అవిసె, గుమ్మడి గింజల్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
⚛ రెండోది ల్యుటీల్ దశ – అండం విడుదలయ్యే రోజు మొదలు తిరిగి నెలసరి ప్రారంభమయ్యే రోజు దాకా అంటే.. 15-28/30 రోజు వరకు ఈ దశగా పిలుస్తారు. ఈ రోజుల్లో రోజూ టేబుల్‌స్పూన్ చొప్పున పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు కలిపి తీసుకోవాలి.
28 రోజుల రుతుచక్రం ఉన్న వారు పై విధంగా దశల్ని విభజించుకొని గింజల్ని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఒకవేళ నెలసరి ఎప్పుడొస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని వారు మాత్రం ప్రతి రెండు వారాలకోసారి ఈ సీడ్ మిశ్రమాన్ని మార్చాల్సి ఉంటుంది. అంటే.. మొదటి రెండు వారాల్ని ఫాలిక్యులర్ దశగా భావించి రోజూ టేబుల్‌స్పూన్ చొప్పున అవిసె, గుమ్మడి గింజల్ని తీసుకోవడం; తదుపరి రెండు వారాల్ని ల్యుటీల్ దశగా పరిగణిస్తూ టేబుల్‌స్పూన్ చొప్పున పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ప్రయోజనాలెన్నో!
ఈ గింజల్ని నేరుగానైనా తినచ్చు.. లేదంటే కూరల్లో వేసుకోవడం, సలాడ్స్‌పై చల్లుకోవడం, పండ్ల రసాల్లో భాగం చేసుకోవడం.. ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఈ సీడ్ సైక్లింగ్ వల్ల ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.
⚛ ఈ గింజల్లోని విటమిన్లు, ఖనిజాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలు.. హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సమర్థంగా పనిచేస్తాయట. తద్వారా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ స్థాయులు బ్యాలన్స్ అవుతాయట. నెలసరి సక్రమంగా రావాలంటే ఈ సమతుల్యతే కావాలంటున్నారు నిపుణులు. కాబట్టి సీడ్ సైక్లింగ్ హార్మోన్ల సమతుల్యతను కాపాడి ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యను దూరం చేస్తుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
⚛ జీవక్రియల పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపడంలోనూ ఈ ప్రక్రియ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
⚛ టెస్టోస్టిరాన్, ఆండ్రోజెన్.. వంటి హార్మోన్ల అసమతుల్యత పీసీఓఎస్‌కు దారితీస్తుంది. అయితే సీడ్ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఈ హార్మోన్లూ బ్యాలన్స్ అవుతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా పీసీఓఎస్‌నూ అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా అవాంఛిత రోమాలు, అధిక బరువు.. వంటి సమస్యల నుంచీ విముక్తి పొందచ్చంటున్నారు.
⚛ సీడ్ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్.. వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయులూ బ్యాలన్స్ అవుతాయి. దీనివల్ల సహజంగా గర్భం ధరించే అవకాశాలు మెరుగుపడతాయి.
⚛ సీడ్ సైక్లింగ్ ప్రక్రియ మెనోపాజ్ దుష్ప్రభావాల్నీ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరించి.. ఈ సమయంలో వేధించే వేడి ఆవిర్లు, మూడ్‌స్వింగ్స్, చర్మం పొడిబారడం.. వంటి సమస్యలను నివారించడంలో సహకరిస్తుందట.
⚛ ఈ నాలుగు రకాల గింజల్ని/విత్తనాల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒమేగా-3,6 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, జింక్, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. ఫలితంగా శారీరక శక్తి పెరుగుతుంది. అలాగే పలు చర్మ సమస్యలకూ చెక్ పెట్టచ్చంటున్నారు నిపుణులు.
అయితే హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సమస్యలకు ఈ పద్ధతి పాటించడం మంచిదే అయినప్పటికీ.. ఆయా సమస్యలకు ఇది పూర్తి పరిష్కారం కాదని, అందరికీ ఇది వర్కవుట్ అవ్వచ్చు, కాకపోవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని పాటించే విషయంలో ఓసారి డాక్టర్ సలహా తీసుకోవడం, ఇతర సమస్యలేవైనా ఉంటే చెకప్ చేయించుకొని చికిత్స తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :