Swiggy Report: బిర్యానీ భళా.. స్విగ్గీలో నిమిషానికి 200 ఆర్డర్లు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆహార ప్రియులు మాత్రం బిర్యానీకే జై కొడుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు బర్గర్లు, పిజ్జాలు, దోశలను ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నారట. ఈ ఏడాది ఆన్‌లైన్ ఆర్డర్లకు సంబంధించి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ 2025 నివేదికను విడుదల చేయగా.. ఈ ఏడాదిలో మొత్తంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది.
నిమిషానికి 194 ఆర్డర్లు..
ఆన్‌లైన్ ఆర్డర్లలో వినియోగదారులు తమ ఫేవరేట్ వంటకంగా బిర్యానీనే ఎంచుకోగా.. నిమిషానికి 194 ఆర్డర్లు వస్తున్నట్లు అంచనా. వీటిలో చికెన్ బిర్యానీదే అగ్రస్థానం. 5.77 కోట్ల చికెన్ బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో బర్గర్లు (4.42 కోట్లు), పిజ్జాలు (4.01 కోట్లు) దోశలు (2.62 కోట్లు) ఉన్నాయని పేర్కొంది.
స్థానిక వంటకాలకు..
స్థానిక వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, పర్వత ప్రాంత వంటకాలు 9 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. వీటితోపాటు మలబారి, రాజస్థానీ, మాల్వానీతో సహా ఇతర ప్రాంతీయ వంటకాల ఆర్డర్లు రెట్టింపు అయినట్లు తెలిపింది. లంచ్ కంటే డిన్నర్‌లోనే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. విదేశీ వంటలనూ అమితంగా ఇష్టపడుతున్నారని స్విగ్గీ వెల్లడించింది. మెక్సికన్ (1.6 కోట్లు), టిబెటన్ (1.2 కోట్లు), కొరియన్ (47లక్షల) వంటకాలకు కూడా ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.
ఒకే వ్యక్తి 3 వేల ఆర్డర్లు..
హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ రూ.47 వేలతో 65 బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేసినట్లు తెలిసింది. ముంబయికి చెందిన ఓ వినియోగదారుడు ఈ ఏడాది 3 వేల సార్లు ఆర్డర్ చేశాడట. అంటే రోజుకు తొమ్మిది ఆర్డర్లు. దేశంలో ఇదే అత్యధికమని స్విగ్గీ నివేదికలో పేర్కొంది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :