Manushi Chillar : ఇదీ నా మార్నింగ్ రొటీన్!
చందమామ లాంటి అందం కోసం మన సినీ తారలు ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నెన్నో సౌందర్యోత్పత్తులూ వాడుతుంటారు. కానీ తన బ్యూటీ రొటీన్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుందంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్.

- A
- A+
- A++

(Photos: Instagram)
చందమామ లాంటి అందం కోసం మన సినీ తారలు ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నెన్నో సౌందర్యోత్పత్తులూ వాడుతుంటారు. కానీ తన బ్యూటీ రొటీన్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుందంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఈ వేదికగా పంచుకొనే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్‌ని బయటపెట్టింది. తన అందాన్ని సంరక్షించుకునే క్రమంలో తాను ఉదయాన్నే పాటించే కొన్ని సౌందర్య చిట్కాల్ని వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2017లో మన దేశానికి ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని తీసుకొచ్చింది మానుషి. డాక్టర్ కావాలన్న తన తపనను త్యాగం చేసి మరీ మిస్ వరల్డ్‌గా అవతరించిందీ బ్యూటీ. ఆపై బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వేలంటైన్’, ‘టెహ్రాన్’, ‘మాలిక్’.. వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది మానుషి. ఈ క్రమంలోనే తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విశేషాలు, బ్యూటీ-ఫ్యాషన్ సీక్రెట్స్ వంటివీ పంచుకుంటుంటుంది. అయితే తాజాగా తన మార్నింగ్ బ్యూటీ రొటీన్‌ని వీడియో రూపంలో ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిందీ బాలీవుడ్ తార.

క్లెన్సర్ వాడను!
ఉదయం నిద్ర లేవగానే మొదట నేను చేసే పని ముఖం కడుక్కోవడం. అయితే ముఖం శుభ్రం చేసుకోవడానికి చాలామంది సబ్బు, ఫేస్‌వాష్.. వంటివి వాడుతుంటారు. నేను ఇవేవీ వాడకుండా కేవలం చల్లటి నీటితో ముఖం కడుక్కుంటా. ఎందుకంటే దీనివల్ల రాత్రంతా చర్మం నుంచి విడుదలైన సహజసిద్ధమైన నూనెలు అలాగే నిలిచి ఉండి చర్మానికి సహజసిద్ధమైన మెరుపును అందిస్తాయి. అదే ఫేస్‌వాష్/సబ్బు వాడితే ఇవి తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. అసలే నాది పొడి చర్మం. కాబట్టి ఉదయం ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు క్లెన్సర్ వాడను. అలాగే బలంగా కాకుండా కాటన్ టవల్‌తో నెమ్మదిగా అద్దుతూ ముఖాన్ని తుడుచుకుంటా.
తేనెతో మాస్క్!
ముఖాన్ని పొడిగా తుడుచుకొని తేనె అప్లై చేసుకుంటా. గుండ్రంగా, మృదువుగా రుద్దుతూ దీన్ని ముఖానికి పట్టిస్తా. తేనె చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది. షూటింగ్స్ హడావిడి ఉన్నప్పుడు ఈ తేనె మాస్క్‌ని ఐదు పది నిమిషాలు ఉంచుకొని శుభ్రం చేసుకుంటా. లేదంటే ఓ అరగంట పాటు అలాగే ఉండిపోతా. అప్పుడప్పుడూ తేనెలో ఓట్స్ కలుపుకొని ముఖానికి పట్టిస్తా. ఆపై గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకుంటా.

నీళ్లు.. ఇలా!
నా మార్నింగ్ రొటీన్‌లో భాగంగా చర్మ సౌందర్యం కోసం పై పూతలే కాదు.. ఆహారం విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటా. ఈ క్రమంలో ఉదయాన్నే నేను మొదట తీసుకునేది హైడ్రోజనేటెడ్ వాటర్. మా నాన్న నాకు దీన్ని అలవాటు చేశాడు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నిండి ఉన్న ఈ నీళ్లు చర్మాన్ని ఒత్తిడి నుంచి కాపాడతాయి. అలాగే చర్మం మెరుపును పెంచి.. ముడతలు-గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా సంరక్షిస్తాయి. అలాగే ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని శక్తి స్థాయులూ పెరుగుతాయి.
వ్యాయామానికి ముందు..!
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయామం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేను గ్లిజరిన్‌ని నా చర్మానికి అప్లై చేసుకుంటా. దీనివల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది. అలాగే ఇది చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చేసి.. మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్.. వంటివి రాకుండా కాపాడుతుంది. ఇక ప్రి-వర్కవుట్ మీల్‌గా.. పప్పన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తీసుకుంటా. అది కూడా మితంగానే! దీన్నుంచి కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నా శరీరానికి అంది.. తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి లోలోపలి నుంచి మెరుపును తీసుకొస్తాయి.

సన్‌స్క్రీన్ మరవను!
వ్యాయామం ముగించుకొని స్నానం చేశాక.. మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఈ ప్రక్రియ నా చర్మానికి ఓ థెరపీలా పనిచేస్తుంది. గుండ్రంగా, మృదువుగా మర్దన చేసుకుంటూ దీన్ని చర్మానికి పట్టిస్తా. ఇక బయటికి వెళ్లే ముందు ఐ-క్రీమ్, సన్‌స్క్రీన్ రాసుకోవడం అస్సలు మరవను. ఇది నా బ్యూటీ రొటీన్‌లో ముఖ్యమైన భాగం కూడా! ఐ-క్రీమ్ కళ్ల కింద నల్లటి వలయాలు, వాపు వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే సన్‌స్క్రీన్ ట్యాన్ నుంచి నా చర్మాన్ని రక్షిస్తుంది. నిజానికి స్కూల్లో ఉన్నప్పుడు చర్మం, అందం గురించి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు.. కానీ కాలేజీలోకొచ్చాకే అందంపై శ్రద్ధ పెరిగింది. అప్పట్నుంచి సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ నా బ్యూటీ రొటీన్‌లో చేర్చుకున్నా.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 18 Dec 2025 18:56 IST