
లాండ్రీ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తోంది!
ఉన్నత విద్యను అభ్యసించిన చాలామంది.. ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేయాలనుకుంటారు. అయితే ఈ తరం మహిళలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

(Photos: Instagram)
ఉన్నత విద్యను అభ్యసించిన చాలామంది.. ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేయాలనుకుంటారు. అయితే ఈ తరం మహిళలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం గడించిన ఉద్యోగాన్ని సైతం వదులుకొని వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. అమెరికాలోని ఆరిజోనాకు చెందిన క్యామి(38) ఇదే కోవకు చెందుతుంది. కెరీర్‌లో కొత్తగా ఏదైనా చేయాలని కోరుకున్న ఆమె.. తన 13 ఏళ్ల నర్సింగ్ ఉద్యోగాన్ని వదులుకొని బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. పక్కా ప్రణాళికతో వ్యాపారం ప్రారంభించి ఏడాది తిరక్కముందే కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. మరి, క్యామి ప్రారంభించిన ఆ లాభదాయక వ్యాపారమేంటో తెలుసుకుందాం రండి..
ఆ మాట మర్చిపోలేను..
క్యామి.. ఆరిజోనాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఆంకాలజీ విభాగంలో నర్సుగా పనిచేసింది. ఇందులో 13 ఏళ్ల అనుభవం గడించిన ఆమె.. ఈ వృత్తిని వదిలి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. నిజానికి బిజినెస్ అంటే ఆమెకు ముందు నుంచే మక్కువ. అయితే ఏ బిజినెస్‌ను ఎంచుకోవాలన్న విషయంలో మాత్రం ఆమెకు స్పష్టత లేదు. తొలుత స్టోరేజీ యూనిట్లను తీసుకుని అద్దెకు ఇవ్వడం.. మొబైల్ హోం పార్కును కొనుగోలు చేయడం.. వంటి వాటిని పరిశీలించింది. అదే సమయంలో క్యామి స్నేహితురాలు క్యామీని తన ఫ్రెండ్‌కి పరిచయం చేయడంతో ఆ మాటల మధ్యలోనే లాండ్రోమ్యాట్ బిజినెస్ గురించి తెలుసుకుందామె. కస్టమర్ల నుంచి దుస్తులు తీసుకుని వాటిని వాషింగ్ మెషీన్లలో ఉతికి తిరిగి వారికి ఇవ్వడమే ఈ వ్యాపారం ముఖ్యోద్దేశం.
‘నేను వ్యాపార అన్వేషణ చేసే సమయంలోనే నా స్నేహితురాలు తన ఫ్రెండ్ ఒకరిని నాకు పరిచయం చేసింది. అప్పటికే అతడు రెండు చోట్ల లాండ్రోమ్యాట్లను నిర్వహిస్తున్నాడట. ‘ఒకవేళ కొన్నేళ్లు వెనక్కి వెళ్లే అవకాశం వస్తే.. నేను తిరిగి కాలేజీకి వెళ్లను. డిగ్రీలు చదవను. కానీ, లాండ్రోమ్యాట్ మాత్రం కొంటాను. ఎందుకంటే అవి మాత్రమే డబ్బుని ఇస్తాయి’ అని తన లాభదాయక వ్యాపారం గురించి ఒక్కమాటలో చెప్పాడు. ఆ మాటను నేను జీవితంలో మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చింది క్యామి.

ఉద్యోగాన్ని వదిలి..
అప్పటివరకు ఏ వ్యాపారం చేయాలో తెలియని తికమకలో ఉన్న క్యామి.. అతడిచ్చిన సలహాతో లాండ్రోమ్యాట్ బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ను ఆశ్రయించిన ఆమెకు.. అందులో అమ్మకానికి ఉన్న ఒక లాండ్రోమ్యాట్ లొకేషన్ కనిపించిందట. అందుకు మూడు లక్షల డాలర్లు చెల్లించాల్సి రావడంతో.. 2015లో ఆమె కొనుగోలు చేసిన ఇంటిని అమ్మేసింది. దాని ద్వారా రెండు లక్షల డాలర్లు మాత్రమే రావడంతో మిగతా మొత్తాన్ని లోన్ ద్వారా సమకూర్చుకుందట. అలా 2020లో క్యామి లాండ్రోమ్యాట్ బిజినెస్‌ను ప్రారంభించింది. అయితే ఇది అంతకుముందు 20 ఏళ్ల నుంచే నడుస్తుండడంతో.. తాను కొనుగోలు చేశాక సంపాదించిన డబ్బుతో క్రమంగా ఈ లాండ్రోమ్యాట్‌ని రెనోవేషన్ చేయించిందట. మొదట్లో ఇటు వ్యాపారానికి సమయం కేటాయిస్తూనే.. అటు నర్సింగ్ వృత్తినీ కొనసాగించిన క్యామి.. వ్యాపారంలో లాభాలు పెరగడంతో 2023లో నర్సు ఉద్యోగానికి రాజీనామా చేసింది. అదే ఏడాది కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసింది.

వారానికి 15 గంటలు!
క్యామి.. తన బిజినెస్‌లో లోతైన అవగాహన పెంచుకోవడానికి ఆన్‌లైన్‌లో శోధించడం.. పాడ్‌కాస్ట్‌లు చూడడం.. వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు చదవడం.. లాండ్రోమ్యాట్ కాన్ఫరెన్స్‌లకు హాజరవడం.. వంటివి చేసింది. అలా మొదట ఆరు నెలల తర్వాత కొంతమంది ఉద్యోగుల్ని నియమించుకుని వాష్ డ్రై పికప్, డెలివరీ సర్వీస్‌లను ప్రారంభించింది. క్రమంగా వ్యాపారంపై పట్టు సంపాదించడంతో లాభాలూ పెరిగాయి. ఈ క్రమంలోనే తన బిజినెస్‌కు సోషల్ మీడియా ప్రమోషన్ అవసరమని గుర్తించింది. అలా గతేడాది నుంచి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్.. వంటి మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులోనూ ఆమెకు ఆదరణ లభించడంతో.. వీటి ద్వారా కూడా డబ్బులు ఆర్జిస్తోంది.
‘ప్రస్తుతం నేను వారానికి 10 నుంచి 15 గంటలు మాత్రమే పనిచేస్తున్నా. మరో పది గంటల సమయాన్ని నా వ్యాపారానికి సంబంధించి సోషల్ మీడియా మార్కెటింగ్‌కి కేటాయిస్తున్నా.. వ్యాపారంలో అనుభవం గడించే కొద్దీ మొదట్లో ఉన్న ఒత్తిడి లేదు.. సవాళ్లూ తగ్గాయి.. నా కోసం అంటూ కాస్త సమయం కూడా కేటాయించుకోగలుగుతున్నా..’ అని చెబుతోంది క్యామి.
అందుకు బాధ లేదు!
క్యామి లాండ్రోమ్యాట్‌లో ప్రస్తుతం ఏడుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది సుమారు నాలుగు కోట్ల రూపాయలు సంపాదించిన ఆమె.. సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా దాదాపు 20 లక్షల రూపాయలు ఆర్జించింది. వీటితో అంతకుముందు వ్యాపారం కోసం తీసుకున్న రుణాల్ని సైతం తీర్చేసింది. వచ్చిన ఆదాయంలో కూడా అధిక భాగాన్ని అదే వ్యాపారంలో తిరిగి పెట్టుబడులు పెడుతూ తన బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తోంది క్యామి. భవిష్యత్తులో మరో లాండ్రోమ్యాట్‌ను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నానంటోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల మందికిపైగా ఫాలోవర్లున్నారు. 13 ఏళ్ల నర్సింగ్ కెరీర్‌కు స్వస్తి చెప్పి వ్యాపారాన్ని ప్రారంభించి.. విజయవంతంగా దూసుకుపోతోన్న క్యామి.. ‘ఉద్యోగాన్ని వదులుకున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు. మనల్ని మనం నిరూపించుకోవాలంటే ఉద్యోగమే చేయక్కర్లేదు.. మనసులోని తపనపై దృష్టి పెడితే చాలు..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోంది.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :