
ఎలా గుర్తించాలి?

- A
- A+
- A++

కొంతకాలంగా అమర్ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్నేహితుడు సంపత్ గమనించి, ఏమైందని అడిగాడు. అమర్ నెమ్మదిగా మనసులోని మాట చెప్పాడు. ‘నా కొలీగ్స్ ఉద్యోగంలో వేగంగా ఎదుగుతున్నారు. చదువులో నేను వారికన్నా మెరుగ్గా ఉండేవాణ్ని. అలాంటిది ఇప్పుడెందుకు వెనకబడుతున్నానో అర్థం కావడం లేదు. ఆ మధ్య మా కంపెనీలో ఒక లైఫ్ కోచ్ స్వాట్(ఎస్‌డబ్ల్యూవోటీ) గురించి చెప్పారు. బలాలు(స్ట్రెంగ్త్స్), బలహీనతలు(వీక్‌నెసెస్), అవకాశాలు(అపార్చునిటీస్), అపాయాలు(థ్రెట్స్) అనే నాలుగు అంశాలను విశ్లేషించడం ద్వారా జీవితంలోనూ, వృత్తిలోనూ ముందుకు వెళ్లవచ్చన్నారు. బలాలను పెంచుకోవాలి, బలహీనతలను తగ్గించుకోవాలి, అవకాశాలను వినియోగించుకోవాలి, అపాయాలను అధిగమించాలి... అని అందరూ చెబుతున్నారు. కానీ వాటిని అసలెలా గుర్తించాలో ఎవరూ చెప్పడం లేదు’ అని అమర్ నిట్టూర్చాడు.
‘అదా నీ బాధ’ అంటూ సంపత్ చిరునవ్వుతో వాటి గురించి వివరించాడు.
‘ఏ పనులు నువ్వు ఇతరులకన్నా బాగా చేస్తావు? నీకున్న ప్రత్యేకమైన నైపుణ్యాలేంటి? నీకు గర్వంగా అనిపించే విజయాలేవి?... ఈ ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానాలే మన బలాలు. ఉదాహరణకు నువ్వు ప్రాజెక్ట్‌లను సమయానికి పూర్తి చేస్తావనుకో, అది నీ బలం. నీ దృష్టికోణం లోంచి మాత్రమే చూడకుండా, నీ చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలను తెలుసుకుని ఇలాంటివాటి జాబితా రాసుకో. వాటిని మరింతగా మెరుగుపరచుకో. ఇక రెండోది- ఏ పనుల నుంచి తప్పించుకుందామని చూస్తావు? నీవల్ల కాదులే అని ఇతరులు వేటి గురించి అంటారు? నీ అలవాట్లలో, వ్యక్తిత్వంలో వృత్తి ఎదుగుదలకు అడ్డుగా నిలిచే లక్షణాలు ఏమైనా ఉన్నాయా?... అవన్నీ బలహీనతలు. నలుగురి ముందు మాట్లాడటానికి సంకోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం.. లాంటివన్న మాట.
‘అవకాశాల విషయానికి వస్తే- మనకు సహాయపడే టెక్నాలజీలు ఏమిటి? మనం ఎంచుకున్న రంగం అభివృద్ధి చెందుతోందా? ఆ అభివృద్ధిలో మనం భాగం పంచుకోగలమా?... ఇలాంటివి. కంటికి కనబడే అవకాశాలను అందరూ అందిపుచ్చుకుంటారు. కంటికి కనబడని అవకాశాలను చూడగలగాలి. ఉదాహరణకు సహోద్యోగి సెలవుపెట్టినప్పుడు ఆ పనిని స్వచ్ఛందంగా చేస్తే కొత్త పని చేతనవుతుంది, అనుభవం పెరుగుతుంది. అమ్మో ఆ పని నాకెందుకు- అనుకుంటే ఏమీ రాదు. అలాగే పనిచేసే రంగానికి సంబంధించిన కొత్త సాంకేతికతలను నేర్చుకోవడం కూడా. ఇక్కడ స్వయంగా చొరవ చూపాలే కానీ, ఎవరూ వచ్చి మనకు చెప్పరు. ఇక, చివరిదైన అపాయాల దగ్గరికి వస్తే- ప్రస్తుతం ఉన్నచోట ఎదుర్కొంటున్న పోటీ, చేస్తున్న పనికి డిమాండ్ తగ్గడం, మారుతున్న సాంకేతికత దానికి కారణం కావడం... ఇలాంటివి.
‘స్వాట్ విశ్లేషణ మన బలాలు, బలహీనతలు, అవకాశాలు, అపాయాలను అద్దంలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా మన సమస్యలేంటో, వాటినెలా ఎదుర్కోవాలో అర్థమవుతుంది.’
బలహీనుల మీద తమ ప్రతాపం చూపేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతులు అనిపించుకోరు. సత్యమార్గంలో నడుస్తూ నిస్సహాయులకు తోడ్పడేవారే నిజమైన బలశాలులు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.