ప్రైవేటు పరిశోధనకు సర్కారీ దన్ను

- A
- A+
- A++

కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, సింథటిక్ బయాలజీ వంటి అధునాతన సాంకేతికతలే 21వ శతాబ్దిలో అభివృద్థికి చోదక శక్తులు. వీటిలో రాణించాలంటే ఆర్‌అండ్‌డీకి పెద్దపీట వేయాలి. ముఖ్యంగా సృజనశీలురను నియమించి, వారికి భారీగా నిధులూ, వసతులను కేటాయించాలి. రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమెరికా ఇలాగే పనిచేసి అగ్రరాజ్యంగా ఎదిగింది. చైనా సైతం అదే బాట పట్టి నేడు అమెరికాకు పోటీ ఇస్తోంది. ఇండియా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తోంది.
చైనా 2008లో ‘సహస్ర ప్రతిభల ఆకర్షక పథకం’ ద్వారా విదేశాల నుంచి సుమారు ఏడు వేల మంది తన శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులను స్వదేశానికి రప్పించింది. 2011లో సహస్ర యువ ప్రతిభావంతుల ఆకర్షక కార్యక్రమంతో విదేశీ సృజనశీలురనూ రప్పించుకోగలిగింది. కానీ- ఇదంతా అమెరికా, ఐరోపా దేశాల పరిశోధనా ఫలాలను కొల్లగొట్టడానికీ, మేధా హక్కుల చౌర్యానికీ డ్రాగన్ పన్నిన పన్నాగమని పాశ్చాత్య నిఘా సంస్థలు పసిగట్టాయి. దాంతో డ్రాగన్ ఆ పథకాల గురించి మాట్లాడటం మానేసి, 2023లో ‘క్విమింగ్(జ్ఞాన సముపార్జన)’ వంటి కార్యక్రమాలు చేపట్టింది. సృజనశీలురకు భారీగా నగదు, గృహవసతి, వారి జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు వంటి సదుపాయాలను అందిస్తోంది. మరోవైపు, అమెరికాలో ట్రంప్ సర్కారు హెచ్-1బీ, గ్రీన్‌కార్డ్ పథకాలకు కోతపెట్టడాన్ని కూడా చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. విదేశీ నిపుణులకు కె-వీసా పథకంతో ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాల వల్ల నేడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, 5జీ, 6జీ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో డ్రాగన్ అమెరికాను సవాలు చేస్తోంది.
లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
జిన్‌పింగ్ సర్కారు తమ యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచింది. ప్రతిభావంతులకు సౌకర్యాలు సమకూర్చి గొప్ప ఫలితాలు సాధిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం హార్వర్డ్ వంటి విఖ్యాత విశ్వవిద్యాలయాలు, జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ, ఆరోగ్య సంస్థ, సైన్స్ ఫౌండేషన్‌లకు నిధులు తెగ్గోసేసింది. ‘నాసా’కూ నిధులు తగ్గించేసింది! సైన్స్, టెక్నాలజీ రంగాల్లో దాదాపు అయిదు వేల రీసెర్చ్ గ్రాంట్లను రద్దు చేసింది. దీంతో ఆర్‌అండ్‌డీని ప్రైవేటు పరం చేయడమే ట్రంప్ ఉద్దేశమా అనే ప్రశ్న తలెత్తింది. అయితే, ఇక్కడ ట్రంప్ సర్కారు ప్రకటించిన ‘స్టార్ గేట్’ పథకాన్ని ప్రస్తావించాలి. దాని కింద ఓపెన్ ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి ప్రైవేటు సంస్థలు ఏఐ రంగంలో 50వేల కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతాయి.
భారత్ కూడా ఆర్‌అండ్‌డీలో ప్రైవేటుకు పెద్దపీట వేయదలచింది. ఆ క్రమంలోనే కేంద్రం- ప్రస్తుత బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశోధన-అభివృద్ధి, నవీకరణ నిధి(ఆర్‌డీఐ)ని ప్రకటించింది. ఈ నిధులను ఆరేళ్లలో ఖర్చుపెడతారు. తొలి విడతగా రూ.20వేల కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తారు. ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ (డీప్‌టెక్) రంగాల్లో ప్రైవేటు పరిశోధన ప్రాజెక్టుల కోసం ఆర్‌డీఐ నిధి నుంచి స్వల్ప వడ్డీపై దీర్ఘకాలిక రుణాలిస్తారు. ఇందుకోసం ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే అణు, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించిన కేంద్రం- డీప్‌టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, హరిత ఇంధనాలు, జాతీయ భద్రతతో ముడివడిన రక్షణ సాంకేతికతల్లోనూ ప్రైవేటు పరిశోధనలకు ఊతమిస్తుంది.
జంకును పోగొట్టేందుకే...
అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో అంతర్భాగమైన స్పెషల్ పర్పస్ ఫండ్(ఎస్‌పీఎఫ్)... లక్ష కోట్ల ఆర్‌డీఐకు నిర్వహణదారుగా ఉంటుంది. ఈ ఎస్‌పీఎఫ్ నుంచి ద్వితీయస్థాయి నిర్వహణ సంస్థలకు మూలధనం లభిస్తుంది. వీటిలో బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు(ఏఐఎఫ్), అభివృద్ధి ఫైనాన్స్ సంస్థలు(డీఎఫ్‌ఐ) ఉంటాయి. ఆర్‌డీఐ పథకాన్ని అమలుచేసే బాధ్యతను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ స్వీకరించినప్పటికీ- ఏయే కంపెనీలు, స్టార్టప్‌లకు నిధులివ్వాలనేది ఎంపిక చేయదు. మార్కెట్లో విజయం సాధించగల కంపెనీలను ఎంపికచేసే బాధ్యతను ద్వితీయ స్థాయి మేనేజింగ్ సంస్థలకు అప్పగిస్తుంది. ఇజ్రాయెల్‌లో యోజ్మా కార్యక్రమం, దక్షిణ కొరియాలో టెక్నాలజీ ఫండ్‌లు ఇదే మార్గాన్ని అనుసరించాయి. అమెరికా రక్షణ శాఖ, నాసా ఇచ్చిన నిధులూ ప్రోత్సాహకాల వల్లే సిలికాన్ వ్యాలీలో స్టార్టప్‌లు వరుస విజయాలు సాధించాయి. అలాగని ఆర్‌అండ్‌డీ ఎల్లవేళలా ఆశించిన ఫలితాలనే ఇవ్వకపోవచ్చు. కాబట్టి, దీనిపై భారీ పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు వెనకాడతాయి. ఈ జంకును పోగొట్టడానికి ప్రభుత్వమే నిధులిచ్చి ప్రైవేటు నవకల్పనలను ప్రోత్సహించాలన్నది ఆర్‌డీఐ పథకం ఉద్దేశం. 2047కల్లా నవీకరణ ద్వారా వికసిత భారత్ సాధనకు ఆర్‌డీఐ పథకం తోడ్పడగలదని ప్రభుత్వం ఆశిస్తోంది. ట్రంప్ నిర్ణయాలతో హెచ్-1బీ, గ్రీన్‌కార్డుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో భారతీయ ప్రతిభావంతులు ఇక పెద్దసంఖ్యలో అమెరికాకు వెళ్లలేకపోవచ్చు. వీరి ప్రజ్ఞను స్వదేశంలో వినియోగించుకోవడంతోపాటు, ఇప్పటికే విదేశాల్లో ఉంటున్న భారతీయ మేధావులను కూడా తిరిగి రప్పించాలి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.