సర్వీస్‌ కమిషన్లను సంస్కరించాల్సిందే!

Eenadu icon
By Editorial News Team Updated : 22 Dec 2025 03:53 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

మ మంచీచెడూ చూసుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం మీదే ఒక సమాజ పురోగతి ఆధారపడి ఉంటుంది. సామాన్య జనంలో ఆ విశ్వాసాన్ని కల్పించడంలో ప్రభుత్వాధికారులదే కీలక భూమిక. పాలకులు, పౌరుల మధ్య వారు వారధులుగా నిలుస్తూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులకు చేర్చడానికి కృషి చేయాలి. ముఖ్యంగా అసహాయులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేయాలి. ఆ మేరకు ప్రజోపయోగ విధానాల అమలులో ఉన్నతోద్యోగుల ప్రాధాన్యం అగణితమైనది కాబట్టే వారి కొలువులకు తగిన భద్రత ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీతి నిజాయతీలతో ప్రజానీకానికి సేవలందించే సమర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేయడం రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల (ఎస్‌పీఎస్సీల) బాధ్యత. ఆ కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించడంలో అవి పూర్తిగా సఫలం కాలేకపోతున్నాయన్నది వాస్తవం. ప్రజాప్రయోజనాలకు చెరుపు చేసే ఈ దుస్థితి చెదిరిపోవాలంటే, తాజాగా ఎస్‌పీఎస్సీ ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించినట్లుగా సర్వీస్‌ కమిషన్ల పనితీరు పారదర్శకం కావాలి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ స్పష్టంచేసినట్లు పరీక్షల్లో అక్రమాలను పరిహరించి వికసిత భారత్‌ ప్రయాణంలో ఎస్‌పీఎస్సీలు చురుకైన పాత్ర పోషించాలి!

రాజ్యాంగ నిర్దేశం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికకు కేంద్రంలో యూపీఎస్సీ, రాష్ట్రాల్లో పీఎస్సీలు ఏర్పాటయ్యాయి. పరీక్ష తేదీలను పక్కాగా ప్రకటించి, లక్షల సంఖ్యలో దరఖాస్తుదారులను వడపోసి వివాదాలకు అతీతంగా నియామకాలు చేపట్టడంలో యూపీఎస్సీ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. మరోవైపు ఎస్‌పీఎస్సీలేమో అవినీతీ అక్రమాలు, క్వశ్చన్‌ పేపర్ల లీకేజీలు, పరీక్షలూ ఎంపికల్లో లుకలుకలు, మితిమీరిన రాజకీయ జోక్యాలతో కునారిల్లుతున్నట్లు చిరకాలంగా విమర్శలున్నాయి. సర్వీస్‌ కమిషన్లు కళంకితులకు ఆవాసాలయ్యాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ జీఎస్‌ సింఘ్వీ గతంలోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి సర్కారీ ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో యువత రేయింబవళ్లు కష్టిస్తూ, ఎంతో డబ్బుపోసి శిక్షణ పొందుతూ సంసిద్ధమవుతుంటారు. కమిషన్ల కార్యకలాపాల్లోని పెడపోకడలకు నిరుద్యోగుల కలలు కల్లలు కాకుండా కాచుకోవాల్సిన ప్రాథమిక కర్తవ్యం ప్రభుత్వాలదే!

అధికారిక లెక్కల ప్రకారం గడిచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉద్యోగాలూ బోర్డు పరీక్షలకు సంబంధించి 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయి. కోట్ల మందిపై అవి ప్రతికూల ప్రభావం చూపాయి. పరీక్షల నిర్వహణలో విపరీత జాప్యాలు,  అవకతవకలూ, ఫలితాల వెల్లడిలో అస్తవ్యస్త ధోరణుల వల్ల తప్పని కోర్టు కేసులు ఎస్‌పీఎస్సీలపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విత్తనంలోని సారాన్నిబట్టే పంట దిగుబడి వస్తుంది. అలాగే సరైన సేవాస్ఫూర్తి, దీక్షాదక్షతలు కలిగిన వారిని కార్యనిర్వాహక వ్యవస్థలోకి తీసుకొస్తేనే సమ్మిళిత ప్రగతి సాధన సాకారమవుతుంది. రాజ్యాంగ ప్రమాణాలూ చట్టాలకు కట్టుబడి జనజీవన ప్రమాణాల పెంపునకు అంకితమై పనిచేయగలిగిన వారు సర్వీసులోకి వస్తే- ఆపై ముప్పై నలభై ఏళ్ల పాటు స్థానిక ప్రజానీకానికి మేలు జరుగుతుంది. అలాంటి వారికి నారుమళ్లు కావాల్సిన ఎస్‌పీఎస్సీలు దారితప్పకుండా చూసుకోవడం అత్యావశ్యకం. రాజకీయాలతో సంబంధం లేని నిష్పాక్షిక మేధావులు, వృత్తినిపుణులను పీఎస్సీ పదవుల్లో నియమించాలి. ఆధునిక సాంకేతికత సాయంతో పరీక్ష పేపర్ల లీకేజీలను అడ్డుకోవాలి. అలాంటి పాతకాలకు పాల్పడేవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూడాలి!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 03:07 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.