Siddipet: ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు

Eenadu icon
By Crime News Desk Published : 22 Dec 2025 05:56 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెజ్జంకి, న్యూస్‌టుడే: తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు శ్రీహర్ష(32)కు కరీంనగర్‌ పరిధిలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రుక్మిణి(25)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. దంపతులు.. బెజ్జంకిలో అద్దె ఇంట్లో ఉంటూ సొంతంగా దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె హరిప్రియ ఉంది. శ్రీహర్ష మధ్యవర్తిగా ఉంటూ తెలిసిన వారికి దాదాపు రూ.13 లక్షల అప్పులు ఇప్పించారు.

రుణాలు తీసుకున్నవారు కొన్ని నెలలు సక్రమంగానే వడ్డీ చెల్లించినా తర్వాత మానేశారు. అప్పులిచ్చినవారు దుకాణం వద్దకు వచ్చి వారం రోజులుగా గొడవ చేస్తున్నారు. ఊళ్లో పరువు తీస్తామని బెదిరించారు. మనస్తాపంతో ఆదివారం శ్రీహర్ష, భార్య ఇద్దరూ పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరారు. కుమార్తె హరిప్రియ రసాయనం వాసనకు ఏడుస్తూ వాంతులు చేసుకుంది. గమనించిన ఇంటి యజమాని తలుపులు తీసేందుకు యత్నించి తెరచుకోకపోవడంతో పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తర్వాత తలుపులు పగులగొట్టి చూడగా రుక్మిణి మృతి చెంది కనిపించింది. శ్రీహర్షను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. 

ఐదు పేజీల ఆత్మహత్య లేఖ లభ్యం

ఆత్మహత్యకు ముందు శ్రీహర్ష రాసిన 5 పేజీల లేఖను గదిలో స్వాధీనం చేసుకున్నారు. ‘నమ్మి మీకు డబ్బులిప్పిస్తే చెల్లించకుండా మోసం చేశారు. అప్పులిచ్చిన వారి వేధింపులు మానసికంగా కుంగదీశాయి. ఒక్కడినే చనిపోదాం అనుకున్నా.. ఈ సమాజంలో భర్త లేని మహిళను హేళనగా చూస్తారని భావించి చావైనా బతుకైనా కలిసే అంటూ నిర్ణయం తీసుకున్నాం. తమ్ముడూ.. అమ్మనాన్నలని మంచిగా చూసుకో. మా ఇద్దరినీ ఒకే చితిపై దహనం చేయండి. మా మరణానికి కారణమైన వారిని విడిచిపెట్టొద్దు’ అంటూ ఐదుగురి పేర్లతో లేఖ రాశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లేఖలో పేర్కొన్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :