బాధ్యతే అసలైన గౌరవం..!

ప్లాట్‌ఫామ్‌పై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న జనంలో ఆమె ఒకరు. కానీ, తను రైలు ఎక్కడానికి కాదు. ఆ ట్రైన్‌ నుంచి దిగే ప్రయాణికుల కోసం. వాళ్లిచ్చే సామాన్లు మోస్తేనే ఆమె పిల్లల కడుపు నిండుతుంది.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Dec 2025 02:22 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ప్లాట్‌ఫామ్‌పై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న జనంలో ఆమె ఒకరు. కానీ, తను రైలు ఎక్కడానికి కాదు. ఆ ట్రైన్‌ నుంచి దిగే ప్రయాణికుల కోసం. వాళ్లిచ్చే సామాన్లు మోస్తేనే ఆమె పిల్లల కడుపు నిండుతుంది. తనే సంధ్యా మారవి. భర్త మరణంతో పిల్లల భవిష్యత్తుకోసం రైల్వే కూలీగా మారారీమె.

జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలీదు. 2016లో భర్త మరణం సంధ్యా మారవిని కుదిపేసింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ముగ్గురు పిల్లలు. తను బాధ పడుతూ కూర్చుంటే వారి కడుపు నిండేదెలా అనుకున్నారామె. దాంతో కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకున్నారు. ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి వెళ్లింది లేదు. పెద్దగా చదువు లేదు. ఏ పని చేయాలో తెలియలేదు. అలాగని ఎవరి దగ్గరా చేయి చాచలేదు. కష్టాన్నే నమ్ముకున్నారు సంధ్య. కుటుంబాన్ని పోషించడానికి మగవాళ్లు మాత్రమే చేయగలిగే రైల్వే కూలీనే వృత్తిగా ఎంచుకున్నారు. జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో బ్యాడ్జ్‌ నెంబర్‌ 36, ఎరుపు చొక్కా ధరించి కూలీగా మారారీమె. 400మంది పురుషుల మధ్యలో ఒక్కరే మహిళ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిసారీ సుమారు 45కేజీల బరువుని భుజాలపై మోసుకెళ్లాలి. అయినా భయపడలేదీమె. ‘మొదటిసారి నేను స్టేషన్‌లో పనిచేయడానికి నిలబడినప్పుడు అందరూ వింతగా చూశారు. మగవాళ్లు మాత్రమే చేసే పని నీవల్ల అవుతుందా? ఇంత బరువు మోయగలవా అన్నట్లు చూశారు. వాళ్ల ముందే లగేజీని మోసి చూపించా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం బలంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు’ అంటారు సంధ్య. రోజూ కట్నీ నుంచి జబల్‌పుర్‌నకు 45కి.మీ ప్రయాణించి ప్రయాణికుల పిలుపుకోసం ఎదురు చూస్తుంటారీమె.

అమ్మ మేల్కొంటుంది...

స్టేషన్‌లో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లగానే ఆమెలోని కూలీ నిద్రపోయి అమ్మ మేల్కొంటుంది. పిల్లలకి అన్నం తినిపించి, చదువు చెప్పి, నిద్రపుచ్చే వరకూ విశ్రాంతి తీసుకోరామె. ‘భుజాన మోసేది ప్రయాణికుల బరువులు కాదు, నా ముగ్గురు పిల్లల భవిష్యత్తు’ అంటారు సంధ్య. కష్టాలకు కుంగిపోకుండా... నేను వాటిని గెలవగలను అని నిరూపించుకున్నారు. చేసే పని ఎలాంటిది అని ఆలోచించకుండా బాధ్యతే అసలైన గౌరవం అనుకున్న సంధ్య ఈతరం మహిళలకి స్ఫూర్తిదాయకమే కదూ!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :