KCR: నీళ్లపై ఇంత నిష్క్రియా?

Eenadu icon
By Telangana News Desk Published : 22 Dec 2025 03:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
6 min read

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నాను. ఇక మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. రెండేళ్లుగా అనేక ప్రజా సమస్యలపై భారాస పోరాడుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. రెండు, మూడు రోజుల్లో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశమవుతా. ఊరూరా ప్రజా ఉద్యమాలు చేస్తాం. కవులు, గాయకులను తట్టి లేపుతాం. బహిరంగసభలు పెడతాం. వాటికి నేను హాజరవుతా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనీయం. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన భారాస శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ 3 గంటలసేపు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

సమైక్య పాలనలో పాలమూరుపై వివక్ష 

‘‘సమైక్య పాలనలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంది. తెలంగాణలో కృష్ణా నది ప్రవేశించేది, ఎక్కువ దూరం ప్రవహించేది మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే. అయినా.. కాంగ్రెస్, తెదేపాలు ఆ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశాయి. పాలమూరు ఎత్తిపోతలు కొత్తది కాదు. గతంలోనే 174 టీఎంసీలకు రూపకల్పన జరిగింది. దీనిపై ఉద్యమ సమయంలోనే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లాం. తర్వాత బచావత్‌ ట్రైబ్యునల్‌ సుమోటోగా స్వీకరించి.. 17 టీఎంసీలు జూరాలకు మంజూరు చేసింది. 1974-78 మధ్య వాటాను కేటాయిస్తే.. దాన్నెవరూ పట్టించుకోలేదు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి.. తర్వాత కాలంలో దాన్ని పక్కనబెట్టారు. 2001లో గులాబీ జెండా ఎగిరే వరకూ ఇదే పరిస్థితి. తెలంగాణ ఏర్పడి నేను ముఖ్యమంత్రి అయ్యాక.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి అన్నింటినీ లైన్‌లోకి తెచ్చాం. 6.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు పారించాం. తుమ్మిళ్ల లిఫ్ట్‌ పూర్తిచేసి నీరిచ్చాం. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల సామర్థ్యం పెంచి.. 1.5 లక్షల ఎకరాలకు నీరందించాం. కృష్ణా నదిలో 170 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవాలనే వ్యూహంతో.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టాం. ట్రైబ్యునల్‌లో తెలంగాణకు కేటాయించిన 45 టీఎంసీలు, మైనర్‌ ఇరిగేషన్‌లో నష్టపోయిన 45 టీఎంసీలు కలిపి 90.81 టీఎంసీలకు ప్రతిపాదించాం. ప్రాజెక్టుకు రూ.35 వేల కోట్లు మంజూరు చేశాం. ఇందులో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి.. 90 శాతం పనులు పూర్తి చేశాం. 145 మెగావాట్ల కెపాసిటీ పంపులను అమర్చాం. ఒక పంపు మోటార్‌ను కూడా ఆన్‌ చేశాం. ఇంతలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్‌ వచ్చాక ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. రెండేళ్లు గడిచిపోయినా తట్టెడు మట్టి తీయలేదు.

ప్రతి దాన్నీ వ్యతిరేకిస్తున్న కేంద్రం

నేను కేంద్రంతో కొట్లాడి నీటి వాటాలపై సెక్షన్‌ 3 మంజూరు చేయించాను. కృష్ణాలో బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం వచ్చిన కేటాయింపు 811 టీఎంసీలే. కానీ బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ వచ్చాక.. అది దాదాపు 1,005 టీఎంసీలకు పెరిగింది. ఒరిజినల్‌గా మనకున్న 90 టీఎంసీలు, అదనంగా వచ్చేది కలిస్తే.. 170 టీఎంసీల దాకా తీసుకుపోవచ్చని ఆశపడ్డాం. పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరు పారించవచ్చని ఆకాంక్షించా. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ రాష్ట్రం చేసే ప్రతి ప్రతిపాదననూ కేంద్రం వ్యతిరేకిస్తోంది. మా హయాంలో కేంద్రంతో గట్టిగానే కొట్లాడి అనుమతులు సాధించుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీయేలో చేరడంతో.. ఆయన మాటలు పట్టుకొని కేంద్ర నేతలు అడ్డుతగులుతున్నారు. ఆయన ఒత్తిడితోనే పాలమూరు డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపింది. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకు నోరు పెగలడం లేదు? రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి.. కృష్ణా నదిలో 45 టీఎంసీలు నీళ్లు ఇమ్మని లేఖ రాశారు. ఇలా ఎలా రాస్తారు? బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నారు?

రియల్‌ ఎస్టేట్‌ తప్ప మరోటి లేదా? 

కాంగ్రెస్‌ ప్రభుత్వానివన్నీ దిక్కుమాలిన పాలసీలే. గురుకుల పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు చనిపోయారు. పిల్లల మరణాలను ఆపలేరు గానీ.. ఫ్యూచర్‌ సిటీ కడతారట. హైదరాబాద్‌ నగరం మధ్యలో ఉన్న ఫార్మా పరిశ్రమలను వెలుపలికి తరలించి.. 14 వేల ఎకరాలతో మేం ఫార్మాసిటీకి శ్రీకారం చుట్టాం. పలు దేశాలకు ఐఏఎస్‌లను పంపించి అధ్యయనం చేయించాం. ఫార్మా యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఆ భూములను అమ్ముకోవాలని చూస్తోంది. అక్కడ జూపార్క్‌ పెడుతుందట. ఎందుకు? ఇప్పుడున్న జూపార్క్‌ భూములను అమ్ముకోవడానికా? ఎంతసేపూ రియల్‌ ఎస్టేట్‌ దందా తప్ప మరొకటి లేదా? పచ్చి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కల్యాణలక్ష్మి, పింఛన్లు, ధాన్యానికి బోనస్, రైతుబంధు, రైతు రుణమాఫీ.. అన్నింట్లో మోసం చేసింది. రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయడం లేదు. 

అబద్ధాలతో ఎన్నేళ్లు మోసం చేస్తారు?

భారీగా సమిట్‌లు పెట్టి.. బిజినెస్‌ హైప్‌ చేస్తున్నారు. దీనికి ఆద్యుడు చంద్రబాబే. బాబు చెప్పిన బిజినెస్‌ లెక్కలు, ఎంఓయూలు విజయవంతమైతే.. ఏపీలో ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా? మొదటిసారి ఆయన సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్‌లో ఎంఓయూలు కుదుర్చుకున్నది ఎవరితో అన్నది ఆరా తీస్తే.. వంట మనుషులని తేలింది. నేను సీఎంగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లా. అంతకు రెండు మూడు నెలల ముందే.. ప్రధాని మోదీ వచ్చి రూ.14 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసి వెళ్లారు. నేను అదే విషయం ప్రస్తావిస్తే.. ఆ ఒప్పందాలన్నీ బోగస్‌ అని మధ్యప్రదేశ్‌ మంత్రే నాకు చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రజలను మోసం చేస్తోంది. అబద్ధాలతో ఎన్నాళ్లు మోసగిస్తారు? 

నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు..

మహిళలకు ఇస్తానన్న రూ.2 వేలకే దిక్కులేదు.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారు? మా హయాంలో ప్రజల ఆస్తి విలువ పెంచాం. రోడ్డు సమీపంలో 4 ఎకరాలున్న వారు కూడా ధీమాతో బతికేలా చేశాం. కానీ కాంగ్రెస్‌ వచ్చాక.. రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. తక్కువ ధరకే భూములను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని చెబుతున్నారు. కానీ కాగ్‌ ఈ విషయంలో ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది కదా? నన్ను ఇష్టానుసారంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నా చావును కోరుతూ శాపనార్థాలు పెడుతున్నారు. 

సర్కారుపై వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లో స్పష్టం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస మద్దతుదారుల విజయం కోసం కష్టపడిన వారందరికీ అభినందనలు. అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కనిపించింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’’ అంటూ కేసీఆర్‌ ధ్వజమెత్తారు. 

అజ్మేర్‌ షరీఫ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ఏటా సమర్పించినట్లుగానే ఈ ఏడాది కూడా భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చాదర్‌ను ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్‌ అలీ, పార్టీ మైనారిటీ నేతలు పాల్గొన్నారు. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.