
Pulivendula: వివేకా కుటుంబంపై వైకాపా పగ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, కడప: భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట రూ.4కోట్ల విలువైన 7.03 ఎకరాల భూములుండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. ఇవన్నీ వైకాపా ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది. పులివెందుల మండలం కె.వెలంవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 కింద నాలుగు సర్వే నంబర్లలోని 7.03 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నంబరు 351/ఎలో 2.91 ఎకరాలు, 352లో 4.05 ఎకరాలు, 353/1లో 0.04 సెంట్లు, 354లో 0.03 సెంట్లు.. మొత్తంగా 7.03 ఎకరాలు ఇప్పుడు సౌభాగ్యమ్మ పేరిట వెబ్‌ల్యాండ్‌లో కనిపించడంలేదు. ఈ భూముల మ్యుటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకి వచ్చింది. రికార్డులు పరిశీలించగా 2022 వరకు సౌభాగ్యమ్మ పేరిటే భూములన్నాయి. సర్వే నంబరు 351/ఎ కింద ఉన్న 2.91 ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి (భర్త పేరు గంగిరెడ్డి) పేరిట బదలాయించినట్లు బయటపడింది.
తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి ద్వారా సాగిన అరాచకం
తన పేరిట వెబ్‌ల్యాండ్‌లో భూములు లేకుండా చేయడాన్ని తెలుసుకున్న సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పులివెందుల ఆర్డీవో చిన్నయ్య విచారణ చేపట్టి జేసీ అదితిసింగ్‌కు నివేదిక ఇచ్చారు. కె.వెలమవారిపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్లు 352, 353/1, 354లో ఉన్న మొత్తం 4.12 ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో అక్రమ మార్పులు జరిగినట్లు జేసీకి ఇచ్చిన నివేదికలో ఆర్డీవో పేర్కొన్నారు. ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ్మ పేరున రెగ్యులర్ ఖాతా నంబరు 763లో ఉండగా అవి నోషనల్ ఖాతా నంబరు 300004 కిందకు మార్చినట్లు తెలిపారు. మండల సర్వేయర్ సర్వే నిర్వహించి ఆ భూములు సౌభాగ్యమ్మవిగా తేల్చారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పులు అప్పటి తహసీల్దార్ కె.మాధవ కృష్ణారెడ్డి పని చేస్తున్న సమయంలో జరిగాయని తన నివేదికలో పేర్కొన్నారు. రికార్డుల పరంగా చూస్తే సౌభాగ్యమ్మకే భూములు చెందుతాయని, తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి వెబ్‌ల్యాండ్‌లో బదలాయింపు చేశారని విచారణ నివేదికలో వివరించారు.
పులివెందులలో నాలుగేళ్లు పనిచేసిన మాధవ కృష్ణారెడ్డి
2020 నుంచి 2024 వరకు పులివెందుల తహసీల్దార్‌గా మాధవ కృష్ణారెడ్డి పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘ఎఫ్’ సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వ స్థానంలోనే తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తున్నారు. కీలకమైన ఈ విభాగంలో నిషేధిత జాబితాలో భూములు చేర్చడం, తొలగించడంలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.