TG News: కోడలితో అక్రమ సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కుమారుడిని హత్య చేయించిన తండ్రి

Eenadu icon
By Crime News Team Updated : 21 Dec 2025 18:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కరీంనగర్ నేరవార్తలు: కోడలితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రే.. సుపారీ ఇచ్చి కుమారుడిని హత్య చేయించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. హత్య అనంతరం మిగిలిన సుపారీ డబ్బుల కోసం నిందితులంతా ఒకే చోటుకు చేరడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్‌ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.

జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అంజయ్య (36)కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అంజయ్య తన పొలం పనులు చూసుకుంటూ.. ఉపాధి నిమిత్తం 2017 విదేశాలకు వెళ్లి తిరిగి 2019లో స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తండ్రి లచ్చయ్య, తన భార్య సాన్నిహిత్యాన్ని గమనించి అంజయ్య ఇద్దరినీ మందలించాడు. ప్రవర్తన మార్చుకోవాలని తన హెచ్చరించాడు. అయినా వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇదే విషయాన్ని కొందరి బంధువుల వద్ద చెప్పుకొని బాధపడ్డాడు.

అక్రమ సంబంధానికి కుమారుడు అడ్డువస్తున్నాడని భావించిన లచ్చయ్య, కోడలితో కలిసి మూడు నెలల కిందట ఓ మంత్రగాడి వద్దకు వెళ్లి మందు పెట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. ఒక వేళ అంజయ్య అనారోగ్యానికి గురైతే అతనికి సేవ చేయాల్సి వస్తుందని భావించి ఆ పథకం విరమించుకున్నారు. నెల రోజుల క్రితం లచ్చయ్య తనకు తెలిసిన మధ్యవర్తి అయిన కొలిపాక రవితో.. అంజయ్యను హత్య చేయాలని చెప్పాడు. రవి తనకు తెలిసిన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహ్మద్ అబ్రార్‌తో రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో లచ్చయ్య రూ.1.25 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. నెల రోజుల నుంచి కోటేశ్వర్, అబ్రార్‌లు అంజయ్యతో పరిచయం పెంచుకొని రోజూ మద్యం సేవించేవారు.

ఈనెల 2న కోటేశ్వర్, అబ్రార్, రవిలు అంజయ్యను ఊరి శివారులోని కెనాల్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. తరువాత గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కెనాల్‌లో పడేశారు. అంజయ్య కనిపించడం లేదని భార్య, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 5న అంజయ్య మృతదేహాన్ని కాలువలో గుర్తించారు. ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయి మృతి చెందినట్టు నిందితులు నమ్మించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. సుపారీ కింద మిగిలిన రూ.1.75లక్షలు తీసుకోవడానికి నిందితులు లచ్చయ్య ఇంటికి రాగా.. పోలీసులు వారి కదలికలను గుర్తించి పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులైన తండ్రి లచ్చయ్య, అంజయ్య భార్య, కోటేశ్వర్, అబ్రార్, రవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 17:50 IST