అంతా నకిలీ... సాంకేతిక మకిలి!

Eenadu icon
By Editorial Team Published : 21 Dec 2025 02:33 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

గమే మాయ.. జీవుడు మాయ అంటారు వేదాంతులు. ఒక పట్టాన అంతుపట్టని ఆ సిద్ధాంతాల సంగతి అటుంచితే, ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను విపరీతంగా దుర్వినియోగం చేస్తున్న కొందరు ప్రబుద్ధుల మూలంగా ఏది నిజమో, ఏది మాయో తెలియని గందరగోళం నెలకొంటోంది. కొత్త ఆవిష్కరణలు ఏవి వచ్చినా వాటిని ఎలా తమ స్వార్థానికి వాడుకుందామా అని కాచుకుని కూర్చున్న కేటుగాళ్ల మూలంగా ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. దాంతోపాటు వ్యక్తిగత గోప్యత, పరువు ప్రతిష్ఠలు, దేశ భద్రత, ప్రజాస్వామ్య వ్యవస్థలే ప్రమాదంలో పడుతున్నాయి.

ఊహించనంత రాబడులు రావాలంటే ఫలానా సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సూచిస్తున్నట్లుగా ఉన్న  వీడియో ఒకటి ఇటీవల వైరల్‌ అయ్యింది. తానెప్పుడూ అలా చెప్పనని, ఆ వీడియో నకిలీదని తాజాగా ఆమె తేల్చి చెప్పారు. కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే దండిగా లాభాలొస్తాయని ఇన్ఫోసిస్‌  నారాయణ మూర్తి, ముఖేష్‌ అంబానీలు చెబుతున్నట్లుండే డీప్‌ఫేక్‌ వీడియోలు గతంలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిని నమ్మి బెంగళూరులో ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయలు హారతి కర్పూరం చేసుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్‌ రూపంతో వచ్చిన అలాంటి దొంగ వీడియోను చూసి నిజమనుకుని అదే నగరంలో మరో మహిళ 3.7 కోట్లు పోగొట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రతన్‌ టాటాలు సైతం పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లున్న ఫేక్‌ వీడియోలు కొద్ది రోజుల కిందట నెట్‌లో దర్శనమిచ్చాయి. ‘రూ.22వేలు పెట్టండి... ఫోన్‌ ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం పొందండి’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లున్న డీప్‌ఫేక్‌ వీడియో సైతం ఇటీవల బయటకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక వెబ్‌సైట్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా కూడా కేటుగాళ్లు నకిలీ దృశ్యాలను సృష్టించారు. అధునాతన సాంకేతికతను దారి మళ్లించి స్నేహితులు, బంధువుల్లా వీడియో, ఆడియో కాల్స్‌ చేస్తున్న సైబర్‌ బందిపోట్లు అమాయకుల నుంచి దర్జాగా డబ్బు దండుకుంటున్న ఉదంతాలూ తరచూ వెలుగుచూస్తున్నాయి.  ప్రజల రోజువారీ జీవనాన్ని మరింత మెరుగుపరచడానికి, దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన టెక్నాలజీని ఇలా మోసాలు, దుర్మార్గాలకు సాధనంగా మారుస్తున్న వారు సమాజానికి పట్టిన చీడపురుగులు!

రాజకీయాల్లో ఎదుటి పక్షాలను జనంలో పలుచన చేయాలంటే మైకులు పట్టుకుని ఉన్నవీ లేనివీ చెబుతూ గతంలో గొంతు చించుకునేవారు. ఎంతో డబ్బు పోసి రాత్రికిరాత్రి దొంగ పోస్టర్లు అంటించేవారు. ఏఐ వచ్చాక ఈ నయవంచక నేతల పని మరింత  సులువైంది. దాని సాయంతో మంచినీళ్లు తాగినంత తేలిగ్గా ప్రత్యర్థి రూపాన్ని ముందు పెట్టి, దాంతో  వివాదాస్పద, అబద్ధపు వ్యాఖ్యలు చేయిస్తున్నారు. అలా దొంగ వీడియోలు, ఆడియోలు సృష్టిస్తూ జనం దృష్టి మళ్లిస్తున్నారు. తనతో సహా భాజపా సీనియర్‌ నాయకుల వ్యాఖ్యలను వక్రీకరించడానికి ఏఐని వాడుతున్నారని మోదీ గత ఎన్నికలప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా సైతం అలాగే తమను అభాసుపాలు చేస్తోందని ప్రతిపక్షాలు వాపోయాయి. పరిశీలనల ప్రకారం గత సాధారణ ఎన్నికల సమయంలో 75శాతం భారతీయులు డీప్‌ఫేక్‌ వీడియోలను చూశారు. అందులో ప్రతి నలుగురిలో ఒకరు వాటిని నిజమని నమ్మారు. బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌లు ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న నకిలీ వీడియోలు దుమారం రేపాయి. పేద కుటుంబాలకు కేంద్రం రూ.12వేలు అందిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించినట్లు ఒక డీప్‌ఫేక్‌ వీడియో ఇటీవల షికార్లు చేసింది. చెప్పనిది చెప్పినట్లు, జరగనిది జరిగినట్లు, ఉన్నది లేనట్లు జరుగుతున్న వికృత ప్రచారాలు ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అంతిమంగా  అవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి  గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయి.

మన దేశంలో 90 కోట్ల మందికి పైగా అంతర్జాలం వాడుతున్నారు. 49 కోట్ల మందికి క్రియాశీల సోషల్‌ మీడియా అకౌంట్లు ఉన్నాయి. దాంతో డీప్‌ఫేక్‌ చిత్రాలు, వీడియోలు, ఆడియోలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. మెకాఫీ సంస్థ అధ్యయనం ప్రకారం గడిచిన ఏడాది కాలంలో మూడొంతుల మంది భారతీయులు డీప్‌ఫేక్‌ వీడియోలు చూశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న లింగవివక్ష మూలంగా ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్త్రీలకు లైంగిక వేధింపులు అధికమయ్యాయి. వాటికి డీప్‌ఫేక్‌లు సైతం జతకావడంతో వ్యక్తిగత గోప్యత గాలిలో దీపమవుతోంది. నటీమణులు, ఇతర మహిళల డీప్‌ఫేక్‌ వీడియోలతో కొందరు దుర్మార్గులు సోషల్‌ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నారంటేనే తమనెవరు ఏం చేస్తారులే అన్న ధీమా ఎంతలా వారిలో ఎగదన్నుతోందో అర్థమవుతుంది. కొందరు యువతులు సోషల్‌ మీడియాలో సరదాగా పంచుకునే ఫొటోలను సేకరిస్తున్న కొన్ని మానవ రూప తోడేళ్లు- వాటిని నగ్నంగా మార్చి డబ్బు డిమాండ్‌ చేస్తున్న ఉదంతాలూ కొంత కాలంగా పెరుగుతున్నాయి. ఫేక్‌ ప్రచారాలతో సంస్థలు, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే పన్నాగాలూ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

ఇంతలా డీప్‌ఫేక్‌లు సమాజానికి చెరుపు చేస్తున్నా, వాటికి అడ్డుకట్ట వేసేందుకు దేశీయంగా పటిష్ఠ చట్టం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించాలి. ఫేక్‌ దృశ్యాలు, ఆడియోలను ఎప్పటికప్పుడు తొలగించేలా సామాజిక మాధ్యమాలను నియంత్రించాలి. ఎవరు చెప్పినా వినాలి, విన్నదాన్ని వెంటనే విశ్వసించకుండా నిజానిజాలు తెలుసుకుని ముందుకు సాగినవారే తెలివైనవారు అని హితబోధ చేశాడు సుమతీ శతకకర్త. కాబట్టి అంతర్జాలంలో కనపడే ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మకుండా, ఆ సమాచారాన్ని ప్రధాన స్రవంతి పత్రికలూ మీడియాతో సరిచూసుకోవాలి. అలా సత్యాసత్యాలు గ్రహించాలి. లేకపోతే ఏఐ మాయా ప్రపంచంలో మన కళ్లూ చెవులే మనల్ని నిలువునా మోసం చేస్తాయి!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.