పదండి... పుస్తకాల జాతరకు!

Eenadu icon
By Editorial News Team Published : 21 Dec 2025 02:29 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

త్తరాది ప్రాంతాలను ఊపిరాడనీకుండా, దారి కానరాకుండా దట్టంగా కమ్మేసే శీతాకాలం ఏటేటా తెలుగు రాష్ట్రాలకు మాత్రం- మంచు పల్లకీల్లో రెండు మంచి పండుగలను మోసుకొస్తుంది. పంచాంగాలు పేర్కొనే పర్వాలు కావివి. ఇవి సాహిత్యప్రియుల ఎదనలరించే పుస్తకాల జాతరలు. మస్తకాలకు విందులు. తొలుత భాగ్యనగరంలో పురివిప్పుకొనే కొత్తకొత్త పుస్తకాల అత్తరు పరిమళాలు- కాల పురుషుడికి కొసమెరుపులతో పవళింపు సేవలు చేసి, వీడ్కోలు చెబుతాయి. కొత్త ఏడాది ఉదయించగానే విజయవాడకు విస్తరించి సుప్రభాత సుగంధాలతో స్వాగతవచనాలు పలుకుతాయి. జనజాతర్లలోని రకరకాల రంగుల రాట్నాల మాదిరే- పుస్తకాల జాతర్లలోనూ, బండెనక బండి కట్టినట్లుగా రైలు పెట్టెల్లా స్టాల్స్‌ కొలువుతీరతాయి. షామియానా గూళ్లు కాస్తా పొత్తపు గుళ్లు అవుతాయి. కాకుంటే- రంగులరాట్నాలు తామే తిరుగుతాయి- ఇవి జనాన్ని తమచుట్టూ తిప్పుకొంటాయి. రెండింటా ఉద్వేగం, ఉల్లాసం సమానమే! రంగులరాట్నం- కాలచక్రాన్ని వెనక్కి తిప్పి మనల్ని బాల్యంలోకి నెడుతుంది. పొత్తపుగుడిలో చేరిన కావ్యాలు- కవుల కలాల సాయంతో కాలాన్ని వెలిగించి మనల్ని కలల ప్రపంచంలోకి నెడతాయి. జ్ఞాపకాల గుట్టలను తవ్వితీస్తాయి.

దేవుడి గుడి- ఆత్మ ప్రకాశానికి, పొత్తపు గుడి- మానసిక వికాసానికి! దేవాలయాల్లోకి అడుగుపెట్టగానే మధురమైన మంగళవాద్యాలు, కర్పూర హారతులు ఎదురవుతాయి. పొత్తపు గుడిలో నన్నయ మొదలు నవ్య తెనుగు కవులెందరో ఎదురొచ్చి ఆత్మీయంగా హత్తుకుంటారు. ప్రబంధకవులూ పాశ్చాత్య గ్రంథకర్తలూ జుగల్‌బందీలు నిర్వహిస్తారు. ‘జాతిబంధములన్న గొలుసులు జారి సంపదలబ్బెడున్‌’ అన్న మహాకవి మాటను నిజం చేస్తారు. దేశాల సరిహద్దులు చెరిపేస్తారు. కుల మత వర్గ భేదాలను రద్దుచేస్తారు. పొద్దంతా అరచేతిలో తిష్ఠవేసే అరిష్టాన్నుంచి- మన దృష్టిని తమవైపు ఆకర్షిస్తారు. మెదడుకు సేద తీరుస్తారు. కళ్లకు కాంతినిస్తారు. మంత్రనగరిలోకి ప్రవేశపెడతారు. అక్కడ ‘ఇంతలు కన్నులుండి... దారేదని వెదకెదవదేల మానవా?’ అంటూ వరూధినులు కవ్విస్తారు. నవపల్లవకోమల కావ్యకన్యకలు కన్నుగీటుతారు. లేజవరాళ్లు చెక్కిలి మీటుతారు. మరోవైపు నేతన్నల మగ్గాల్లోంచి, రైతన్నల నాగేటిచాళ్లనుంచి, శ్రామికుల పదును కొడవళ్లనుంచి, అణచివేతల్లోంచి, మూలమూలల్నుంచి- మూలుగులు చెవిని పడతాయి. కావ్యాలు బుద్ధిని ఆకట్టుకుంటే- కన్నీళ్లు గుండెను పట్టి ఊపుతాయి. రెండూ చేరి మనిషిని కదుపుతాయి. కుదుపుతాయి.

‘నీకంటూ ఓ మెదడుంది. దానికి కాసింత మేత పెట్టు’ అని చలం నచ్చచెబుతారు. ‘చదవడం మానేసిన రోజునుంచీ నువ్‌ మరణించడం ఆరంభిస్తావ్‌’ అని పాబ్లో నెరుడా హెచ్చరిస్తారు. ఆర్తితో ఆత్మీయంగా పొంగి వచ్చే తడి ఆరని తల్లిభాష గుండెను తడుముతుంది. అలనాటి షేక్‌స్పియర్‌ మొదలు మొన్నమొన్ననే కన్నుమూసిన గుగి వా థియాంగో వరకూ ఎందరో పాశ్చాత్యుల నోట ఆంగ్లభాష విభిన్న సంగీతాన్ని రుచి చూపిస్తుంది. రెండూ తెలిసిన రసజ్ఞుల తీరని దాహం- ఆ పడమటి సంగీతానికి పట్టుచీరలను చుట్టబెట్టి దప్పిక తీర్చుకుంటుంది. ‘నా పుస్తకం తమనెంతో ప్రభావితం చేసిందని ఎవరైనా వచ్చి చెబితే- నాకు కలిగే ఆనందం, సంతృప్తి- నోబెల్‌కు ఏమీ తీసిపోవు’ అన్న కవుల చిరకాల వాంఛలను ఆ రసజ్ఞులే తీర్చగలుగుతారు. మంత్రనగరి మహాయాత్రను మనం ముగించే సమయానికి ఆరుద్ర చెప్పినట్లు మనసుకు జ్వరమొస్తుంది. గుబులు జనిస్తుంది. ఆ పుస్తకాలను హత్తుకోవాలన్న కోరిక పుడుతుంది. వాటితో సొంతింట ఓ గదిని ఆలయంగా మార్చి అనునిత్యం ఆరాధిస్తే తప్ప ఆ గుబులు తీరదని అనిపిస్తుంది. చిత్రం ఏమంటే- అది మళ్లీమళ్లీ ఆవరించే జ్వరం, కోరుకునే దిగులు. పదండి- మనసు మన మాటను ఎప్పుడు వినవచ్చింది కనుక!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.