బైపాస్ వెంట బరితెగింపు

- A
- A+
- A++

న్యూస్‌టుడే, కార్పొరేషన్: నగరంలోని బైపాస్ రోడ్డులో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి అవెన్యూ ప్లాంటేషన్ పేరిట పెంచిన చెట్లను నరికేసి, బైపాస్ నాలాలు పూడ్చేసి రహదారిని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. పిస్తాహౌజ్ మొదలు భూత్పూర్ రహదారి కూడలి వరకు 8 కి.మీ. పొడవునా పలుచోట్ల బైపాస్ రోడ్డు పక్కన నాలాను కూల్చే పూడ్చేసి చదును చేసి ఆక్రమించేస్తున్నారు. పట్టపగలే ఈ తతంగం కొనసాగుతున్నా నగర ప్రణాళిక విభాగం కళ్లు మూసుకొని ఉండటం గమనార్హం.
ఇదంతా ఏడాది కాలంలోనే..
బైపాస్ రహదారిని 200 అడుగుల విస్తీర్ణంలో నాలుగు వరుసలతో నిర్మించారు. డివైడర్ 4 అడుగులు ఉండగా.. రోడ్డుకు ఇరువైపులా 80 అడుగుల విస్తీర్ణంలో తారురోడ్డు వేశారు. ఇరువైపులా మరో 20 అడుగుల రహదారి, మరో 8 అడుగుల మేర ఇరువైపులా నాలా నిర్మించారు. మిగిలిన మరో 12 అడుగుల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద నాలుగేళ్ల కిందట హరితహారం మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం చెట్లుగా ఎదిగాయి. ఏడాది కాలంగా బైపాస్ రోడ్డులో ఆక్రమణలు జోరందుకున్నాయి. రహదారికి పక్కనే సొంత భూములు, ప్లాట్లు ఉన్న యజమానులు చెట్లను నరికేస్తున్నారు. నాలా పూడ్చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు.
దర్జాగా నాలా పూడ్చివేతలు
కొందరు ఏకంగా బేకరీ, టీకొట్లు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు దాబాల ఏర్పాటుకు స్థలాలు అద్దెకు ఇస్తున్నారు. ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇప్పటికే 18 చోట్ల వ్యాపార సముదాయాలు వెలిశాయి. వీరిలో కొందరు బైపాస్ హద్దులు చెరిపేసి చెట్లు నరికి నాలా పూడ్చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పదేళ్లలో ఈ మార్గంలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని, చెట్లు పచ్చగా ఉండేవని, గతేడాది నుంచే ఆక్రమణలు పెరిగిపోయాయని, చెట్లు నరికేస్తున్నారని, వాటికి నీరు పట్టకపోవడంతో ఎండిపోతున్నాయని నగర ప్రజలు వాపోతున్నారు.
► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 04:49 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.