Google Trends - Bangladesh Protests: భారత్‌ వ్యతిరేకి హత్యతో బంగ్లాలో ఆగ్రహ జ్వాలలు.. ఎవరీ ఉస్మాన్‌ హాదీ..?

Eenadu icon
By International News Team Updated : 19 Dec 2025 14:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌ మరోసారి భగ్గుమంది. విద్యార్థి ఉద్యమంతో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇప్పుడు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఇంతకీ ఎవరీ ఉస్మాన్‌ హాదీ..?

భారత్‌ వ్యతిరేకి..

బంగ్లాదేశ్‌లోని ఝల్‌కాతీ జిల్లాలో 1994లో ఉస్మాన్‌ హాదీ జన్మించాడు. చిన్నప్పటినుంచే ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్‌.. విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీలీగ్‌ నేత, నాటి ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్‌ మంచ్‌ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్‌లను పంచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

  • బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు అడ్వైజరీ

ఎన్నికల ప్రచారంలో ఉండగా..

గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ.. యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ.. డిసెంబరు 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతడిపై దాడి జరిగింది.

హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం ప్రాణాలు విడిచాడు. తూటా గాయం కారణంగా హాదీ మెదడుకు తీవ్ర గాయమైందని వైద్యులు వెల్లడించారు.

వెల్లువెత్తిన నిరసనలు..

హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్‌ మంచ్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్‌, అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీలీగ్‌ ఆఫీసులకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు హాదీ మృతికి గానూ బంగ్లా ప్రభుత్వం ఒకరోజు సంతాపదినం ప్రకటించింది. 

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 11:48 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్‌ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.