India-Bangladesh: భారత్‌ను రెచ్చగొట్టేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతితో బంగ్లాదేశ్‌లో ( Bangladesh) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు గత కొన్ని నెలలుగా బంగాళాఖాతంలో ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భారత్‌ను కావాలనే రెచ్చగొడుతోందని అర్థమవుతోంది. ఆ దేశానికి చెందిన చేపల బోట్లు తరచూ భారత ప్రాదేశిక జలాల్లోకి (Indian maritime waters) చొచ్చుకు రావడం, ఎన్నడూ లేని విధంగా బంగ్లా నేవీ కూడా ఈ ప్రాంతంలో గస్తీ పెంచడం దీనికి బలం చేకూరుస్తోంది.
డిసెంబర్ 15 సంఘటనతో బంగాళాఖాతంలో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చారని ఆరోపిస్తూ.. 16 మంది మత్స్యకారులతో వెళ్తున్న భారత్‌కు చెందిన బోటును.. బంగ్లా నేవీ సిబ్బంది ఢీ కొట్టి వారందర్నీ సముద్రంలో తోసేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 11 మందిని రక్షించారు. మరో ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఈ ప్రమాదం నుంచి బయటపడివారు అది బంగ్లాశ్‌కు చెందిన బోటే అని చెబుతుండగా.. ఘటన జరిగిన ప్రాంతానికి తమ పెట్రోలింగ్ బోటు 12 మైళ్ల దూరంలో ఉందని బంగ్లా అధికారులు వాదిస్తున్నారు.
పాక్‌కు దగ్గరవుతూ..
బంగ్లాలో చోటుచేసుకున్న హింసాత్మక అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడం, మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి నుంచి భారత్‌తో బంగ్లా సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. అదే సమయంలో క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది. అంతేకాకుండా బంగాళాఖాతంలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. యూనస్ వ్యాఖ్యలు కూడా అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ‘ఈ ప్రాంతం మొత్తానికి బంగ్లాదేశ్ సముద్ర రక్షకురాలు’ అంటూ గతంలో యూనస్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు తగినట్లుగానే బంగ్లా నేవీ.. సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ తీవ్రం చేసింది. భారత్ మత్స్యకారులను నిర్బంధించడం, వారి బోట్లను స్వాధీనం చేసుకోవడం, కోస్ట్‌గార్డ్ సిబ్బందితో కవ్వింపులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతోంది.
నోటిఫికేషన్ తర్వాత మరిన్ని కవ్వింపు చర్యలు
బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టి.. లబ్ధి పొందేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌కు చెందిన చేపల బోట్లు ఇండియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్)ను దాటి రావడం ఎక్కువైంది. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు చెందిన బోట్లు.. భారత్ జలాల్లోకి చొరబడ్డాయి. 35 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని.. 500 కేజీల చేపలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఎనిమిది బోట్లు, 170 మంది సిబ్బందిని భారత్ దళాలు అరెస్టు చేశాయి. బంగ్లాలో ఎన్నికలకు సంబంధించి గత నెల అక్కడి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి.
ఢాకాపై పాకిస్థాన్, చైనా దేశాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో 1971 (భారత్-బంగ్లా యుద్ధం) తర్వాత భారత్ మరో సవాల్‌ను ఎదుర్కుంటోందని ఇటీవల పార్లమెంటరీ కమిటీ కూడా అభిప్రాయపడిందంటే.. పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా అక్కడ తీవ్ర స్థాయిలో అందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో ఓ హిందూ వ్యక్తిని అల్లరి మూకలు హత్య చేశాయి. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోనప్పటికీ.. ఆ దేశం మాత్రం భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 19:44 IST