బండకింద కొక్కులు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాణిజ్య సిలిండర్‌కు బదులు గృహ వినియోగ బండలు

- A
- A+
- A++

ఈ చిత్రంలో వంట గ్యాస్‌ను వినియోగిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ జిల్లా కేంద్రంలో ఉంది. ఇక్కడ వాణిజ్య సిలిండర్‌కు బదులు గృహ వినియోగ బండను బహిరంగంగా ఉపయోగిస్తున్నా ..పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇది ఈ ఒక్క చోటే కాదు ఉమ్మడి జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన వంట గ్యాస్ పక్కదారి పడుతోంది. పట్టణాలు, గ్రామాల్లో కొందరు దళారులు, ఏజెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 70 శాతానికి పైగా హోటళ్లలో యథేచ్ఛగా వీటిని వాడుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో తప్పనిసరిగా వాణిజ్య సిలిండర్లు వినియోగించాలని నిబంధనలు చెబుతున్నా.. ఎక్కడా అమలు కావడం లేదు.
- ఉమ్మడి జిల్లాలో గ్యాస్ సిలిండర్లను అందించేందుకు పలు ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో దీపం, ఉజ్వల, ప్రైవేటు గ్యాస్ కనెక్షన్లు కలిపి 12.10 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి నెల నుంచి రెండు నెలల వ్యవధిలో 14.2 కేజీల బండను రూ.925 అందిస్తున్నారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.19 కేజీలది రూ.1820 పైగా ఉంటుంది. దీంతో తక్కువ ధర ఉన్న గృహావసరాల సిలిండర్లనే వాణిజ్యానికి వినియోగిస్తున్నారు.
- పక్కదారి పట్టించడంలో కొందరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి వారు ఉన్నారు. సిలిండర్లు సరఫరా చేసే వారు వీరికి ఊతంగా నిలుస్తున్నారు. రెండు నెలలకు ఒక సిలిండర్ వినియోగించుకునే కుటుంబాల నుంచి గ్యాస్ పుస్తకాలు సేకరించి, వారు నెలకు ఒక సిలిండర్‌ను బుక్ చేసి, హోటళ్లకు రూ.300-400 అదనంగా తీసుకుని తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమార్కులైన ఒక్కో వ్యక్తి వద్ద 10 నుంచి 20 పుస్తకాలు ఉన్నట్లు సమాచారం.
- ఈ వ్యవహారమంతా యథేచ్ఛగా సాగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం తనిఖీల ఊసెత్తకపోవడంతో నియంత్రణ ఉండటం లేదు.
తనిఖీలు చేపడతాం: మోహన్‌బాబు, డీఎస్‌వో, సూర్యాపేట
హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాణిజ్య సిలిండర్లను మాత్రమే వినియోగించాలి. త్వరలో తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిస్తే ఆయా నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, సరఫరా చేసిన ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.