అడగనివ్వండి!

Eenadu icon
By Editorial Team Published : 20 Dec 2025 03:10 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

పిల్లల మనసు అందమైన తోట. అందులో పూసే పూలు వారి ప్రశ్నలు. ‘ఎందుకు?’, ‘ఎలా?’, ‘ఏమిటి?’ అన్న సందేహాలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఆ పునాదిని బలంగా నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లది. 

ఈ మధ్య కాలంలో ఆ బాధ్యత నిర్లక్ష్యానికి గురవుతోంది. దానికి ఒకటీ రెండూ కాదు, ఎన్నో కారణాలు. పాఠశాలల్లో సిలబస్‌ భారం, ఇంట్లో అమ్మానాన్నలకు పనుల ఒత్తిడి, మిగిలే కాస్త సమయం ఫోన్లకు అంకితం కావడం... ఇవన్నీ పిల్లల నోరు మూయిస్తున్నాయి. వారిలో సహజంగా ఉండే కుతూహలాన్ని చంపేస్తున్నాయి.

వీటన్నిటికీ తోడు తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా... పెద్దల వైఖరి కూడా చిన్నారుల ఉత్సాహం మీద నీళ్లు చల్లుతోంది. ప్రశ్నలడిగే పిల్లల్ని ‘తలనొప్పి’గా భావించేవారు ఎక్కువయ్యారు. క్వొశ్చెన్‌ బ్యాంక్‌ అనీ, ఎన్‌సైక్లోపీడియా అనీ పేర్లు పెడుతున్నారు. వారి ఎదురుగానే సమాధానం ఇవ్వడానికి నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ‘బుర్ర తినకు, అవతలికి పో’ అంటూ గెంటేస్తున్నారు. కొందరు ప్రశ్నను బట్టి పిల్లల స్థాయిని నిర్ణయిస్తారు. ఎవరైనా తేలికపాటి ప్రశ్న వేస్తే ‘అది కూడా తెలియదా నీకు’ అంటూ అందరి ముందూ హేళన చేస్తున్నారు. ఇవన్నీ పిల్లల్ని చిన్నబుచ్చుతాయి. క్రమంగా వారిలో అడగాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. పాఠం అర్థం కాకపోయినా పూర్తిగా మౌనం పాటించేస్తారు. ఇది పెద్దవాళ్లకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ పిల్లల భవిష్యత్తు మీద పిడుగుపాటుతో సమానమైన పెద్ద సమస్య. అది పూర్తిగా వారి వ్యక్తిత్వాన్నే మార్చేస్తుంది.

ప్రశ్న అడగడం అనేది పిల్లల్లో సహజంగా ఉండే జిజ్ఞాసను సూచిస్తుంది. ఎంత ఎక్కువగా ప్రశ్నలడిగితే పిల్లలు అంత చురుగ్గా ఆలోచిస్తున్నట్లు. ఆలోచనే కదా మానసిక వికాసానికి పునాది. అందుకే పిల్లల్ని ప్రశ్నించనివ్వాలి. వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు వారికి అర్థమయ్యే స్థాయిలోనే జవాబివ్వాలి. వాళ్లు సంతృప్తి చెందకపోతే, ‘నువ్వు పెద్ద క్లాసుకు వెళ్లాక దాని గురించి పాఠం ఉంటుంది. అప్పుడు నీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీ టీచర్‌ ఇంకా బాగా చెబుతారు’ అని చెప్పొచ్చు. అప్పుడు వారిలో కుతూహలం ఇంకా పెరుగుతుంది. తమ సందేహాలకు సమాధానాలు పాఠాల్లో ఉంటాయన్న విషయం తెలిసి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఒక్కోసారి వాళ్లు అడిగే ప్రశ్నలకు పెద్దల దగ్గరా సమాధానం ఉండదు. అప్పుడు నిజాయతీగా ‘ఇది నాకు తెలియదు నాన్నా, మర్చిపోయినట్లున్నా. పుస్తకంలో చదివి చెబుతా’ అని చెప్పారనుకోండి... తెలియదని ఒప్పుకోవడంలో తప్పులేదని, పెద్దలు కూడా నేర్చుకుంటూ ఉంటారని, నేర్చుకుంటేనే ఎవరేది అడిగినా చెప్పగలుగుతామని- ఇలా చాలా విషయాలు వారికి తెలుస్తాయి. స్కూల్లో టీచర్లు కూడా రోజూ పాఠం చెప్పాక ఒక పదినిమిషాలు ప్రశ్నాసమయం కేటాయించి పిల్లల్లో ప్రశ్నించే అలవాటును ప్రోత్సహించాలి. ఎందుకంటే- ప్రశ్నించడమే అభివృద్ధికి మొదటి మెట్టు.

కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండటం వ్యాపారవేత్తకు బలం. అలాగని అన్నివేళలా కఠిన వైఖరి అవలంబించకూడదు. నమ్మిన విధానం ఫలితం ఇవ్వనప్పుడు వెనక్కి తీసుకోవడానికి సంకోచించకూడదు. ఎవరి నిర్ణయం అన్నది కాదు, ఎవరికి మేలు చేస్తుందన్నది ముఖ్యం.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.