‘విశ్వబంధు’గా భారతావని

Eenadu icon
By Editorial News Team Published : 20 Dec 2025 03:08 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

స్థానిక ప్రజావసరాలను తీర్చడంలో ప్రభుత్వం పాత్రేమిటో నిర్వచించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్య అధికారాల విభజనకు మాత్రమే మన రాజ్యాంగం పరిమితం కాలేదు. ప్రపంచంతో అనుసంధానం కావడంలో తప్పటడుగులు పడితే- దీర్ఘకాలంలో జాతి ప్రగతికి అవి నష్టదాయకాలవుతాయనే వాస్తవాన్ని భారత సంవిధానం గుర్తించింది. అందువల్లే అంతర్జాతీయంగా శాంతిభద్రతలను పెంపొందించడం, విదేశాలతో న్యాయబద్ధమైన, గౌరవప్రదమైన సంబంధాలను నెలకొల్పడం రాజ్యం బాధ్యత అని 51వ రాజ్యాంగ అధికరణ స్పష్టంచేస్తోంది. ‘విశ్వబంధు’గా భారతావని తేజరిల్లాలని ఆశిస్తున్న ఈ సంవిధాన సూత్రమే దశాబ్దాలుగా మన విదేశాంగ విధానానికి దారిదీపమవుతోంది. దానికి అనుగుణంగానే ఇండియా నేడు అనేక దేశాలకు విశ్వసనీయ నేస్తంగా, సహజ భాగస్వామిగా కొనసాగుతోంది. అగ్రరాజ్యాలతో సంబంధ బాంధవ్యాలను నెరపుతూనే- వర్ధమాన దేశాలతో చెలిమికి ఎప్పటికప్పుడు కొత్త చివుళ్లు తొడుగుతూ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకుంటోంది. బెదిరింపులు, బలప్రయోగాలు, రుణవలలతో పరాయి దేశాలపై పెత్తనం చలాయించే అమెరికా, చైనా దుర్వినీతులకు దూరంగా పరస్పర గౌరవం, నమ్మకం, సహకారాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజాగా జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో పర్యటించారు. ఆ మూడింటితో భారత ఆర్థిక, హార్దిక బంధాలను సుస్థిరం చేస్తూనే- వర్ధమాన రాజ్యాల ఆకాంక్షలను అర్థంచేసుకుంటూ, భుజంభుజం కలిపి వాటితో కలిసి నడిచేందుకు ఇండియా ఎప్పుడూ ముందుంటుందనే సానుకూల సందేశాన్ని అందించారు!

ఆఫ్రికా కొమ్ము భాగంలో ఎర్ర సముద్ర వాణిజ్య మార్గాలకు సమీపంలో భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న ఇథియోపియా- దాదాపు 14కోట్ల జనాభాతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 55 దేశాల ఆఫ్రికన్‌ యూనియన్‌ ప్రధాన కార్యాలయం కొలువైన ఇథియోపియాతో స్నేహాన్ని సుదృఢం చేసుకోవడం- ఆ ఖండంలోని మిగిలిన రాజ్యాలతో సుహృద్భావ సంబంధాలను పటిష్ఠపరచుకోవడానికి దోహదపడుతుంది.  అక్కడ చైనా ప్రాబల్య విస్తరణకు కొంతమేరకు పగ్గాలు వేయడంతో పాటు ఐరాస వేదికలపై మన ప్రయోజనాల పరిరక్షణకు ఆఫ్రికా మద్దతును కూడగడుతుంది. సంక్షుభిత పశ్చిమాసియాలో రాజకీయంగా సుస్థిరమైన జోర్డాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం- వ్యవసాయ, వాణిజ్య, భద్రతాపరమైన అవసరాలను తీర్చడంలో భారత్‌కు లాభదాయకమవుతుంది. శాంతియుతంగా కలిసి జీవించడమనే సమున్నత భావనకు కట్టుబడిన రెండు దేశాల నడుమ మైత్రి ఉభయతారకంగా వర్ధిల్లడానికి ప్రధాని మోదీ పర్యటన ఉపకరిస్తుంది!

భారతావనికి ప్రాచీన మిత్రరాజ్యమైన ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ముడిపడటం సహర్షంగా స్వాగతనీయం. ప్రస్తుతం వెయ్యి కోట్ల డాలర్లకు పైబడిన ద్వైపాక్షిక వాణిజ్య విలువ మరింత వృద్ధి చెందడానికి ఇది సాయపడుతుంది. ట్రంప్‌ సుంకాలతో అంతటా అనిశ్చితి అలముకున్న వాతావరణంలో మస్కట్‌తో మిత్రత్వం ఎంత బలిష్ఠమైతే భారత్‌కు అంతగా లాభిస్తుంది. ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలతో చెలిమి అంతర్జాతీయ సంబంధాల్లో సమతూకానికీ, బహుళపక్ష ప్రపంచంలో భారతావని పరపతి పెంపునకూ ఊతమిస్తుంది. అమెరికా పెత్తందారీతనానికి, చైనా విస్తరణవాదానికి భిన్నంగా స్నేహ సహకారాలతో సమష్టి శ్రేయస్సుకు పాదులుతీసే విదేశాంగ విధానమే ఇండియా ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తోంది. ఆ దౌత్యరీతిని అలా ముందుకు తీసుకెళ్లడమే వర్ధమాన దేశాల వాణిగా అంతర్జాతీయ యవనికపై భారతావని స్వరాన్ని మరింత దృఢతరం చేస్తుంది!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.