
Team India: షాకులుంటాయా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ముంబయి: టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ఇంకా 50 రోజుల సమయం ఉండగానే భారత జట్టును ప్రకటించబోతున్నారు సెలక్టర్లు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారమే జట్టును ఎంపిక చేయబోతోంది. భారత్ ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. జట్టును ఇప్పుడే ప్రకటిస్తున్నప్పటికీ.. టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం ఆతిథ్య హోదాలో భారత్‌కు ఉంది. అందుకే అయిదారుగురిని స్టాండ్‌బైలుగా ప్రకటించనున్నారు సెలక్టర్లు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఇలాగే జట్టులోకి తీసుకున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా సెలక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడే జట్టునే.. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే అవకాశముంది. ఇక సెలక్టర్లు ప్రకటించబోయే జట్టులో ఆశ్చర్యపరిచే పేర్లేమీ ఉండకపోవచ్చని అంచనా. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. వాళ్లిద్దరూ జట్టులో కొనసాగడం ఖాయం. టీ20 ప్రపంచకప్‌ను సూర్యకు కెప్టెన్‌గానే కాక ఆటగాడిగానూ చివరి అవకాశంగా భావిస్తున్నారు. టీ20ల్లోకి పునరాగమనం చేసినప్పటికీ నుంచి నిలకడ అందుకోలేకపోతున్న శుభ్‌మన్‌పై వేటు వేసి యశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటివ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ సెలక్టర్లు ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువే. సూర్య, గిల్‌లకు తోడు అభిషేక్, తిలక్ బ్యాటర్లుగా కొనసాగుతారు. జితేశ్‌ను తొలి ప్రాధామ్య వికెట్ కీపర్‌గా ఎంపిక చేయనున్నారు. సంజు శాంసన్ రెండో వికెట్ కీపర్‌గా ఉంటాడు. హార్దిక్, దూబె, అక్షర్, సుందర్ ఆల్‌రౌండర్లుగా జట్టులో ఉండడం ఖాయం. బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ స్పెషలిస్టు బౌలర్లుగా కొనసాగుతారు. యశస్వి, నితీశ్, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధ్‌లను స్టాండ్‌బైలుగా ఎంపిక చేసే అవకాశముంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 04:00 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.