DPDP: మీ ఫోన్‌ నంబరుకు రక్ష..

Eenadu icon
By Telangana News Desk Updated : 20 Dec 2025 03:52 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించేందుకు కేంద్రం 2023లో తీసుకొచ్చిన డీపీడీపీ చట్టానికి సంబంధించిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. నవంబరు 14 నుంచి కొన్ని అమలులోకి రాగా ఏడాది తర్వాత ఇంకొన్ని, 18 నెలల తర్వాత మరికొన్ని అమలులోకి రాబోతున్నాయి. ఈ లెక్కన 2027 మే 14 నుంచి డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ)చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. దుకాణానికి వెళ్లినప్పుడో, ఈకామర్స్‌ ద్వారా సరకులు కొన్నప్పుడో, క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడో... ఇలా వివిధ సందర్భాల్లో ఇచ్చే ఫోన్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ వంటి డిజిటల్‌ సమాచారం దుర్వినియోగం అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే డిజిటల్‌ సమాచారానికి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం డీపీడీపీ చట్టం తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నెలలోనే  నిబంధనలు రూపొందించినప్పటికీ వాటిపై ప్రజల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేసి నవంబరు 13న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిబంధనల్లో మొత్తం 23 సెక్షన్లు ఉన్నాయి. వీటిలో సెక్షన్‌ 1, 2, 17, 18, 19, 20, 21 తక్షణమే అమలులోకి వచ్చాయి. సెక్షన్‌ 4 మాత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన ఏడాదికి అంటే 2026 నవంబరు 13వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇక సెక్షన్‌ 3 తోపాటు 5 నుంచి 16, 22, 23 సెక్షన్లు మాత్రం 18 నెలల తర్వాత నుంచి అమలులోకి వస్తాయి. అనుమతి లేకుండా సమాచారాన్ని తీసుకున్నా, తీసుకున్న సమాచారాన్ని ఇతరత్రా వాడుకున్నా, చివరకు చోరీ అయినా సంబంధిత సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆరోపణలు నిరూపణ అయితే రూ.250 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు.

తక్షణం అమలులోకి వచ్చేవి...

  • డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకి ఛైర్‌పర్సన్, సభ్యుల ఎంపికకు క్యాబినెట్‌ కార్యదర్శి, న్యాయ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో సెర్చ్‌ కమిటీ ఏర్పాటు.
  • సెర్చ్‌ కమిటీ సూచించిన వారిని నియమించడం.
  • ఛైర్‌పర్సన్, బోర్డు సభ్యుల వేతనాలు, బోర్డు సమావేశాలకు సంబంధించి తేదీలు నిర్ధారించడం, ఈ సమావేశాలకు సంబంధించిన విధి విధానాలు, తీర్మానాలు ప్రతిపాదించడం.
  • ఫిర్యాదు లేదా సమాచారం వచ్చినప్పుడు ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయడం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వీలుపడకపోతే గడువు మరో మూడు నెలలు పెంచుకునే వెసులుబాటు.
  • విచారణకు ఎవరూ భౌతికంగా హాజరుకావాల్సిన పనిలేదు.ఆన్‌లైన్‌ ద్వారానే వాదన వినిపించవచ్చు. 
  • ఈ బోర్డు జారీ చేసే ఆదేశాలను విభేదించేవారు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు.

ఏడాది తర్వాత అమలులోకి వచ్చేవి..

వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు సంస్థలు కంటెంట్‌ మేనేజర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత సంస్థ సమర్పించే వివరాల ఆధారంగా డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఆ నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది. సంతృప్తి చెందితే నియామకాన్ని ఆమోదించే, లేదంటే తిరస్కరించే అధికారం బోర్డుకు ఉంటుందనే నిబంధన ఏడాది తర్వాత అమలులోకి వస్తుంది.

18 నెలల తర్వాత..

వ్యక్తిగత సమాచారం నమోదుకు అవలంబించాల్సిన పద్ధతులు, దానికి రక్షణ, ఒకవేళ సమాచారం చౌర్యానికి గురైతే తీసుకోవాల్సిన చర్యలు, తమ సమాచారం దుర్వినియోగం అయినట్లు బాధితుడు అనుమానిస్తే ఫిర్యాదు చేసే విధానం, దానికి సంబంధించి జరిగే విచారణ, తీర్పు వంటివి 2027 మే 13 తర్వాత నుంచి అమలులోకి వస్తాయి.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 03:37 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని