ఇరాన్‌ ‘అణు’చివేతకు మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌!

Eenadu icon
By International News Desk Published : 16 Oct 2026 05:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

అమెరికా అమ్ములపొదిలో శక్తిమంతమైన సంప్రదాయ ఆయుధం మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ (ఎంవోఏబీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఇరాన్‌ సైనిక, ఇంధన మౌలిక వసతులపై దాడికి సంబంధించి అగ్రరాజ్యం రూపొందించుకుంటున్న అత్యవసర ప్రణాళికల్లో ఈ బాంబు ప్రయోగం కూడా ఉందని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఆ అస్త్రం వల్ల ఇరాన్‌కు ఎంత నష్టం కలుగుతుందన్నది చర్చనీయాంశమైంది. పశ్చిమాసియా యుద్ధంలో వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అమెరికాకు ఎంవోఏబీ సరైన ఆయుధమవుతుందా అని నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. 

ఏమిటీ బాంబు? 

ఈ ఆయుధం పేరు జీబీయూ-43/బి మాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ (ఎంవోఏబీ). దీని సామర్థ్యం దృష్ట్యా సరదాగా దీన్ని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ అని కూడా పిలుస్తారు. దీని బరువు 9.8 టన్నులు. దీన్ని ఆకాశం నుంచి విమానం ద్వారా ప్రయోగిస్తారు. 2003లో ఇరాక్‌పై యుద్ధానికి ముందు అమెరికా వైమానిక దళ పరిశోధన ల్యాబ్‌ దీన్ని అభివృద్ధి చేసింది. అమెరికా అమ్ములపొదిలో ఇది అతిపెద్ద అణ్వస్త్రేతర థర్మోబారిక్‌ తరహా ఆయుధం. 

ఎలా పనిచేస్తుంది? 

ఎంవోఏబీను ప్రధానంగా గాల్లో పేలే (ఎయిర్‌ బ్లాస్ట్‌) ఆయుధంగా డిజైన్‌ చేశారు. సాధారణ బాంబులు నేలను తాకి, భారీ బిలాన్ని ఏర్పరుస్తుంటాయి. ఎంవోఏబీ తీరు భిన్నం. ఇది ‘ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌’ సాయంతో ఇది నేలకు 1.8 మీటర్ల ఎత్తులో పేలిపోతుంది. ఫలితంగా అందులోని 18,700 పౌండ్ల పేలుడు పదార్థం.. కొన్ని మైక్రోసెకన్ల వ్యవధిలోనే భారీగా రసాయన శక్తిని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఏర్పడే విస్ఫోట తరంగం నేలకు సమాంతరంగా గాల్లో దూసుకెళుతుంది. సంపీడనానికి లోనైన గాలితో కూడిన ఈ భీకర ప్రకంపన తన ప్రయాణ మార్గంలో భవనాలు, వాహనాలు, నేలపై ఉన్న బంకర్లు, రాడార్‌ కేంద్రాలను ధ్వంసం చేస్తుంది. 1.6 కిలోమీటర్ల వ్యాసంలోని ప్రదేశంలో దీని ప్రభావం ఉంటుంది. 

ఆక్సిజన్‌ మండిపోయి.. 

ప్రభావిత ప్రాంతంలో వేగంగా దహనక్రియ జరగడం వల్ల భారీ పరిమాణంలో ఆక్సిజన్‌ ఖర్చవుతుంది. దీంతో స్థానికంగా శూన్యం ఏర్పడుతుంది. సమీపంలోని గాలి తిరిగి ఆ ప్రదేశానికి దూసుకొచ్చే క్రమంలో బీభత్సం చోటుచేసుకుంటుంది. నేల కిందున్న సొరంగ మార్గాల ప్రవేశాలు కుప్పకూలుతాయి. లోపలున్న సైనికుల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. పేలుడు వల్ల ఉత్పత్తన్నమయ్యే తీవ్ర వెలుగు, పెను ప్రకంపన, గాల్లోకి ఎగిసే పుట్టగొడుగులాంటి భారీ మేఘం వంటివి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించడం ఖాయం.  

తొలిసారి అఫ్గాన్‌లో.. 

ఎంవోఏబీని తొలిసారిగా 2017 ఏప్రిల్‌ 13న అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్‌ ఉగ్రముఠాకు సంబంధించిన సొరంగం, గుహ కాంప్లెక్స్‌పై అమెరికా వైమానిక దళం ప్రయోగించింది. దీనివల్ల గుహ ప్రవేశమార్గాలు కూలిపోవడం, ఉగ్రముఠా వద్ద ఉన్న పేలుడు పదార్థాలు విస్ఫోటం చెందడం వంటి పరిణామాల కారణంగా పెను విధ్వంసం జరిగింది. పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. నాటి దాడి ఎంవోఏబీ రూపకల్పన ఉద్దేశాన్ని చాటింది. ఉపరితలంపై విస్తరించి ఉన్న నెట్‌వర్క్‌లు, తక్కువ లోతు కలిగిన గుహ ప్రాంగణాలు, భారీగా రక్షణ కలిగిన ప్రదేశాలను ధ్వంసం చేయడానికి ఈ బాంబు చక్కగా సరిపోలుతుందని వెల్లడైంది. 

అణు కేంద్రాలను ధ్వంసం చేయగలదా? 

ఇరాన్‌లో నేల ఉపరితలం నుంచి చాలా లోతులో ఉన్న ఫోర్దో, నతాంజ్‌ వంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయడం ఎంవోఏబీకి దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ బాంబు పలుచటి అల్యూమినియం తొడుగుతో తయారైంది. గాల్లో విస్ఫోటక శక్తిని పెంచేలా ఇది రూపొందింది. నేరుగా రాయి లేదా కాంక్రీటును తాకితే అది గరిష్ఠ విస్ఫోటం చెందడానికి ముందే విచ్ఛిన్నమవుతుంది. శిలలోకి అది ఎక్కువ లోతుగా చొచ్చుకెళ్లలేదు. ఇరాన్‌లోని ఫోర్దో అణు ఇంధన శుద్ధి కర్మాగారం 200-300 అడుగుల గ్రానైట్, రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీటు కింద ఉంది. కొండకు ఎగువన గాల్లో విస్ఫోటం వల్ల రాతి పొరల కిందున్న సెంట్రిఫ్యూజ్‌ హాల్స్‌ చెక్కుచెదరవు. చమురు శుద్ధి కర్మాగారాలు, ఎగుమతి టెర్మినళ్లు, విద్యుత్‌ గ్రిడ్‌లు, ఇంధన నిల్వ కేంద్రాల ధ్వంసానికి ఎంవోఏబీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ బాంబును నెమ్మదిగా కదిలే, స్టెల్త్‌ లక్షణం లేని రవాణా విమానం (ఎంసీ-130) ద్వారా జారవిడవాలి. ఎస్‌-300 వంటి గగనతల రక్షణ వ్యవస్థలు కలిగిన ఇరాన్‌ గగనతలంలోకి ఇలాంటి విమానం వెళ్లడం ప్రమాదకరం. 

ఎంవోఏబీ కన్నా ఎంవోపీ మేలు..

ఎంవోఏబీకి బదులు జీబీయూ-57ఏ/బీ మాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనట్రేటర్‌ (ఎంవోపీ) అనే బాంబుతో అమెరికాకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 13 టన్నుల బరువున్న ఈ బాంబును మందపాటి, దృఢ ఉక్కు కేసింగ్‌తో తయారుచేశారు. ఇది నేలలోకి లోతుగా చొచ్చుకెళ్లి విస్ఫోటం చెందగలదు. 60 అడుగులు మందం కలిగిన రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీటునూ చీల్చుకెళ్లగలదు. పైగా పటిష్ఠ గగనతల రక్షణ వ్యవస్థలున్న ప్రదేశంలోకి సులువుగా వెళ్లగల బి-2బి స్టెల్త్‌ బాంబర్‌ ద్వారా దీన్ని జారవిడవవచ్చు.

దిక్సూచి వ్యవస్థ

జీపీఎస్‌/ ఇనర్షియల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ. గాల్లో ఈ బాంబు ప్రయాణ మార్గాన్ని స్థిరీకరించేందుకు గ్రిడ్‌ ఫిన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి జారవిడిచే బాంబులను సాధారణంగా యుద్ధవిమానాలు, స్టెల్త్‌ బాంబర్లలోని అంతర్గత బాంబ్‌ బేలలో తరలిస్తుంటారు. అయితే ఎంవోఏబీ పొడవు, పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని సంప్రదాయ యుద్ధవిమానాల్లో అమర్చడం కష్టం. ఎంసీ-130 రవాణా విమానం ద్వారా లక్ష్యం వద్దకు తరలించాలి. డ్రాగ్‌ పారాచూట్‌ ద్వారా దీన్ని విమానం నుంచి గాల్లోకి జారవిడుస్తారు.

ఎంవోఏబీ వివరాలివీ.. 

  • పేలుడు పదార్థం: 18,700 పౌండ్ల హెచ్‌-6 (ఆర్‌డీఎక్స్, టీఎన్‌టీ, అల్యూమినియం పొడితో కూడిన శక్తిమంతమైన పేలుడు పదార్థ మిశ్రమం)
  • పొడవు: 9.1 మీటర్లు
  • వ్యాసం: 1.03 మీటర్లు
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పడేనా ట్రంప్‌ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
  • కోలుకుంటున్న పోప్‌ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్‌ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్‌ మేరీ మిల్బెన్‌ ఆరోపించారు.
  • ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే... ఎలాన్‌ మస్క్‌ కూడా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్‌ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్‌ బుధవారం పేర్కొంది.