అన్నీ ఉన్నా... మారని ఆటతీరు!

Eenadu icon
By Editorial Team Published : 15 Oct 2026 01:43 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

జపాన్‌లో ఇటీవలే ఆసియా క్రీడలు ముగిశాయి. వందకు పైగా పతకాలను ఒడిసిపట్టాలన్న లక్ష్యంతో పోటీలకు వెళ్లిన భారత బృందం... తొంభై పతకాలు కూడా సాధించలేకపోయింది. మునుపటి కంటే ఇప్పుడు క్రీడలకు నిధులు పెరిగాయి, వసతులు మెరుగయ్యాయి, విదేశీ కోచ్‌లూ పెరిగారు. మరి మన ప్రదర్శన ఎందుకు పడిపోయింది? పతకాల శతకాన్ని ఎందుకు సాధించలేకపోయాం? అసలు లోపం ఎక్కడుంది? ఇలాగైతే రాబోయే ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల పరిస్థితేంటి!?

ఈసారి ఆసియా క్రీడలకు భారత్‌ ఎన్నో ఆశలతో వెళ్లింది. వందకుపైగా పతకాల సాధనే లక్ష్యంగా సుమారు అయిదు వందల మంది అథ్లెట్లను బరిలోకి దించింది. చెప్పాలంటే చాలామంది క్రీడాకారులను తప్పించి, కచ్చితంగా పతకం తెచ్చే సత్తా ఉన్న ప్లేయర్లనే ఎంపిక చేశామన్నారు. తీరా సమయం వచ్చేసరికి మన అథ్లెట్లు పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. కొంతమంది స్టార్లు మరీ తేలిపోయారు. డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేతలు పి.వి.సింధు (బ్యాడ్మింటన్‌), మను బాకర్‌ (షూటింగ్‌) పూర్తిగా విఫలమయ్యారు. ఆ స్థాయి అథ్లెట్లు ఒక కంచు పతకాన్ని కూడా తీసుకురాలేకపోవడం బాధాకరమే. ఇలా చెప్పుకొంటూపోతే ఈసారి క్రీడల్లో భారత్‌ది వైఫల్య ప్రస్థానమేనని అనిపించక మానదు!

బడ్జెట్‌ పెరిగినా పేలవ ప్రదర్శనే!

భారత్‌ 2022 ఆసియా క్రీడల్లో 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) గెలిచింది. ఈసారి ఆ గీతను దాటలేకపోయింది. మొత్తంగా మనకు 85 పతకాలు (21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు) మాత్రమే వచ్చాయి. గత క్రీడలతో పోలిస్తే ఇప్పుడు సౌకర్యాలు మెరుగయ్యాయి, నిధులు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ప్రతిభావంతులైన విదేశీ కోచ్‌లు కూడా ఎక్కువమంది లభించారు. విదేశాల్లో ప్రత్యేక శిక్షణ సైతం పెరిగింది. ఇన్ని ఉన్నా, మన బృందం మునుపటి పతకాల సంఖ్యను కూడా అందుకోలేకపోవడం క్రీడాభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. 2022 కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు రూ.3062 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పద్దులో రూ.4479.88 కోట్లు ప్రత్యేకించారు. అయినా ప్రదర్శనేమీ పెరగలేదు.

ఇండియా తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్‌. దానికి రెండేళ్ల సమయమే ఉంది. గత ఒలింపిక్స్‌కు భారత్‌ కనీసం పది పతకాల లక్ష్యంతో వెళ్లి ఆరు పతకాలే సాధించింది. దీంతో ఎలాగైనా తన ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరచుకుని, 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో కనీసం డజను పతకాలు తేవాలని భారత్‌ ఆశిస్తోంది. ఆసియా క్రీడల్లో మన అథ్లెట్ల వైఫల్యం చూస్తే ఈ లక్ష్యం నెరవేరేనా అనే అనుమానం కలుగుతోంది. ఆసియా స్థాయిలోనే భారత స్టార్లు సత్తా చాటలేకపోతే, పోటీ కఠినంగా ఉండే ఒలింపిక్స్‌లో ఏం రాణిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గాయాలు కూడా భారత్‌కు శత్రువులుగా మారుతున్నాయి. తాజా ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి (వంద మీటర్ల హర్డిల్స్‌) పోటీకి దిగక ముందే వార్మప్‌లో గాయపడింది. జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా గాయంతో ఆసియా క్రీడలకే దూరమయ్యాడు. అథ్లెట్ల గాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, వాళ్లు కోలుకునేలా చర్యలు చేపట్టకపోతే భారత్‌ పెద్ద క్రీడల్లో పతకాలు కోల్పోవడం ఖాయం. ఆసియా క్రీడల్లో హాకీ, కబడ్డీ, క్రికెట్‌ జట్లు మాత్రమే అంచనాలను నిలబెట్టుకున్నాయి. మరి పెద్దస్టార్లు ఎందుకు కనీసం ఒక్క పతకమైనా తేలేకపోయారన్నదే ప్రశ్న!

ఒలింపిక్స్‌లో రాణించాలంటే...

ఆసియా క్రీడల్లో చాలామంది ప్లేయర్లను వాళ్ల ఫామ్‌ ఆధారంగా కాకుండా, పేరు చూసి ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. కాబట్టే క్రీడల్లో పాల్గొనకముందే కొంతమంది గాయాలతో వైదొలగారనీ, కొందరు తొలి రౌండ్లలోనే ఓడిపోయారన్నది విశ్లేషకుల మాట. ఆటల్లో గెలుపోటములు సహజం. కానీ, కనీసం పోరాడకుండా... తొలి రౌండ్లలోనే ఇంటిముఖం పట్టడమే మింగుడుపడని విషయం. ఒలింపిక్స్‌లో చిన్నపాటి పొరపాట్లకు కూడా ఆస్కారం ఉండదు. ఫిట్‌నెస్‌ లేకపోతే ఆడలేం. కాబట్టి, ఇకనైనా భారత ఒలింపిక్‌ సంఘం మేలుకుని అథ్లెట్లపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. వాళ్ల శిక్షణను పర్యవేక్షిస్తూనే, గాయాలబారిన పడకుండా కాపాడుకోవాలి. కోట్లు పెట్టి తెచ్చుకుంటున్న విదేశీ కోచ్‌ల సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. దేశవాళీ దిగ్గజ క్రీడాకారుల సూచనలూ సలహాలతో ముందుకు సాగాలి. పతకాలు తీసుకురాగల సత్తా ఉన్నవారిని మాత్రమే విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలి. అప్పుడే ఒలింపిక్స్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శన కనపరచగలుగుతుంది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


English Translation

Translation pending...