హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!

హార్మోన్ల అసమతుల్యత.. దీని కారణంగా వివిధ సమస్యలు తలెత్తుతాయి. అయితే హార్మోన్లను తిరిగి సమతులం చేసుకోవాలంటే.. ఆహారమే కాదు.. మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.

Eenadu icon
By Vasundhara Team Published : 17 Jun 2026 20:43 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

హార్మోన్ల అసమతుల్యత.. దీని కారణంగా వివిధ సమస్యలు తలెత్తుతాయి. అయితే హార్మోన్లను తిరిగి సమతులం చేసుకోవాలంటే.. ఆహారమే కాదు.. మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అందులోనూ ముఖ్యంగా ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు.. హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

ఆయిల్‌ పుల్లింగ్‌తో..!

దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఉదయాన్నే ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం కొంతమందికి అలవాటు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను పెంపొందించడంలోనూ సహకరిస్తుందంటున్నారు నిపుణులు. ఈ పద్ధతి వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లిపోయి జీవక్రియల పనితీరు, పొట్ట ఆరోగ్యం మెరుగుపడతాయట. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యతను దూరం చేసుకోవచ్చంటున్నారు. అయితే ఇందుకోసం వాడాల్సిన నూనెల విషయంలో మాత్రం సంబంధిత వైద్య నిపుణుల సలహా తప్పనిసరి.

ఎండ పొడ.. తగలాల్సిందే!

నిద్ర లేచీ లేవగానే చాలామంది చేసే పని.. మొబైల్‌ పట్టుకోవడం. దీనివల్ల శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్‌. ఉదయాన్నే ఒత్తిడి దరిచేరితే.. ఇక ఆ రోజంతా చిరాగ్గానే గడపాల్సి వస్తుంది. కాబట్టి.. అటు ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తూనే, ఇటు హార్మోన్ల పనితీరుని పెంపొందించుకోవాలంటే లేలేత ఎండలో ఓ అరగంట గడపమంటున్నారు నిపుణులు. ఇది జీవ గడియారాన్ని ప్రేరేపించి.. భౌతిక, మానసిక, ప్రవర్తన పరంగా మార్పులు తీసుకొస్తుంది. తద్వారా చక్కటి జీవనశైలిని పాటించే అవకాశం ఉంటుంది.. నిద్ర సమయాల పైనా సానుకూల ప్రభావం పడుతుంది. శరీరానికి డి-విటమిన్‌ కూడా అందుతుంది. ఇలా జీవక్రియలన్నీ సక్రమంగా జరిగితే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఇక ఇదే ఎండలో చిన్నపాటి వ్యాయామాలు చేయడం, నడక.. వంటివి చేస్తే మరీ మంచిదని చెబుతున్నారు నిపుణులు.

పరగడుపునే వద్దు!

ఉదయం బ్రష్‌ చేసుకోగానే ఓ కప్పు కాఫీనో, టీనో తాగందే అడుగు ముందుకు పడదు చాలామందికి. అయితే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుపునే తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. దీనికి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. గ్రెలిన్, లెప్టిన్‌.. వంటి ఆకలి హార్మోన్లపై సానుకూల ప్రభావం పడుతుంది. ఫలితంగా రోజంతటికీ కావాల్సిన శక్తి శరీరానికి అందుతుంది. అలాగే నిద్ర సమయాల పైనా సానుకూల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు.

చెప్పుల్లేకుండా.. కాసేపు!

అడుగు తీసి బయటపెట్టామంటే చెప్పులు వేసుకోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు చాలామంది. కానీ ఉదయాన్నే కాసేపు చెప్పుల్లేకుండా నడవడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.

వ్యాయామాలతో..

రోజంతా ఉత్సాహంగా ఉండడంలో ఉదయాన్నే చేసే వ్యాయామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ ప్రక్రియ హార్మోన్ల సమతుల్యతనూ ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువులెత్తడం, కార్డియో వ్యాయామాలు.. హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయంటున్నారు. అలాగే స్క్వాట్స్‌, పుషప్స్, పులప్స్‌, లాంజెస్‌, క్రంచెస్‌.. వంటి వర్కవుట్లను మధ్యమధ్యలో కాస్త విరామమిస్తూ సాధన చేయడం వల్ల.. ఇటు ఫిట్‌నెస్‌, అటు హార్మోన్ల పనితీరునీ మెరుగుపరచుకోవచ్చంటున్నారు.

ఇక వీటన్నింటితో పాటు హార్మోన్ల సమతుల్యత కోసం డాక్టర్‌ సూచించిన మందులు, ఇతర సలహాలూ పాటించడం అలవాటుగా మార్చుకోవాలి. తద్వారా సత్వర ఫలితాన్ని పొందచ్చు.. వాటి మూలంగా ఎదురయ్యే అనారోగ్యాలనూ దూరం చేసుకోవచ్చు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :