
హైదరాబాద్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్,హెచ్ ఎం డి ఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరుల హాజరయ్యారు.
దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జి లను ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటు పైన జాగ్రత తీసుకోవాలి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి.
ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డులు కేటాయించాలి. అడ్వటైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాలి. అనధికార అడ్వటైజింగ్ బోర్డు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలి. జంక్షన్‌ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.