
జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చేరువలో ఉంది. రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరేందుకు ఆ జట్టు మరో 83 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది.
బెంగాల్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తున్న జమ్మూ టీమ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. శుభమ్ పుండిర్ (23), వన్ష్‌రాజ్ శర్మ (9) క్రీజ్‌లో ఉన్నారు.
చివరి రోజు జమ్మూ లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త చరిత్ర అవుతుంది. రంజీ చరిత్రలో జమ్మూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. ఇంకా చెప్పాలంటే సెమీస్‌కు చేరడం కూడా ఇదే మొదటిసారి.
తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు వెనుకపడి కూడా అనూహ్యంగా పుంజుకొని, బెంగాల్‌ను 99 పరుగులకే (రెండో ఇన్నింగ్స్) కుప్పకూల్చిన జమ్మూ జట్టు, సరికొత్త చరిత్రకు అద్భుత పునాది వేసింది. అనంతరం స్వల్ప ఛేదనలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా ఏమాత్రం జంక లేదు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించింది.
మరోసారి చెలరేగిన నబీ
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన ఆకిబ్ నబీ మరోసారి విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటి బెంగాల్‌ను మడత పెట్టడంతో పెద్ద చెయ్యి వేశాడు. అతనికి సునీల్ కుమార్ (4-27), యుద్ధ్‌వీర్ చరక్ (5-0-29-2) సహకరించారు. వీరి ధాటికి బెంగాల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. షాబాజ్ అహ్మద్ (24) ఒక్కడే 20కి పైగా పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సుదిప్ ఘరామీ సహా సుదిప్ చటర్జీ, ఆకాశ్‌దీప్ డకౌట్లయ్యారు.
విజృంభించిన షమీ
అంతకుముందు టీమిండియా ప్లేయర్ మహ్మద్ షమీ 8 వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్‌లో చెలరేగిన నబీ బ్యాట్‌తోనూ రాణించడంతో జమ్మూ టీమ్ ఈ స్కోర్ చేయగలిగింది. నబీ (42).. యద్ద్‌వీర్ చరక్‌తో (33) తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించి, తన జట్టును 300 పరుగుల మార్కును దాటించాడు. అంతకుముందు కెప్టెన్ పరాస్ డోగ్రా (58), అబ్దుల్ సమద్ (82) అర్ద సెంచరీలతో రాణించారు.
ఘరామీ అద్భుత శతకం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదిప్ ఘరామీ అద్భుత శతకంతో (146) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. ఆకిబ్ నబీ 5, సునీల్ కుమార్ 3 వికెట్లతో సత్తా చాటారు.