KTR: చెయ్యిచ్చిన పార్టీని నమ్మకండి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే: మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టడం మినహా రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి భారాస నేతలపై నిందలు మోపుతూ రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు చెయ్యి ఇచ్చిన పార్టీ, చెవిలో పూలు పెట్టే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

‘‘420 అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటైనా నెరవేర్చిందా? తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, రైతుభరోసా, స్కూటీలు వచ్చాయా? ఇవి వచ్చిన వారు కాంగ్రెస్‌కు.. రాని వారు భారాసకు ఓటేయాలి. బతుకమ్మ చీరలు, మైనార్టీలకు తోఫాలు ఇవ్వని కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు పెట్టి పురుషులకు డబుల్ టికెట్ తీసుకుంటున్నారు. గతంలో రేవంత్‌రెడ్డి బాన్సువాడకు వచ్చి ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని దూషించారు. అయినా పోచారం అదే పార్టీలోకి వెళ్లారు. ఆయనకు భారాస హయాంలో మంత్రి, సభాపతి పదవులు ఇచ్చి గౌరవిస్తే... పార్టీ మారి కేసీఆర్‌ను, ఓటేసిన ప్రజలను మోసగించారు. ఆయన ఎందుకు కాంగ్రెస్‌లోకి వెళ్లారో? ఈ ప్రభుత్వంలో ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలి. ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఉప ఎన్నికలో ప్రజలే వారి భవితవ్యం ఏంటో తేలుస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు స్టీల్ బిందెలను పంపిణీ చేశారు. వాటిని చూసి మహిళలు ఓట్లు వేసి మోసపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌లో లంకెబిందెలు దొరుకుతున్నాయి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్లారెడ్డి పోలీసులు అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని, తీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :