CM Chandrababu: దేశ క్వాంటమ్ నిర్దేశకులం మనమే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: హైటెక్ సిటీ హైదరాబాద్‌కు గేమ్‌ఛేంజర్‌గా మారితే.. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్‌ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ (ఏక్యూవీ)’ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘ప్రపంచశ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారత్ క్వాంటమ్ భవిష్యత్తును నిర్దేశించే ప్రదేశంగా మారుతుంది. ఇక్కడి నుంచి క్వాంటమ్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటాం. పనులు జరిగేలా చూస్తాం. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం. డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, మెడ్‌టెక్, స్పేస్ సిటీ లాంటివి రాష్ట్రంలో అందుబాటులోకి తెస్తున్నాం. డిఫెన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమేట్ మోడలింగ్‌కు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ భవనాలకే కాదు.. అంతర్జాతీయ క్వాంటమ్ విప్లవంలో భాగమయ్యేనిపుణులకూ పునాది వేసుకుంటున్నాం. ఇప్పటివరకు అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారు. ఇకపై అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు’ అని పేర్కొన్నారు.

తొలి కంప్యూటర్ వచ్చేది ఈ ఏడాదే
‘సాంకేతికత గొప్పదనాన్ని అందిపుచ్చుకునే ప్రధాని మనకు ఉండడం అదృష్టం. క్వాంటమ్ మిషన్ కార్యకలాపాలు ఏపీ నుంచే ప్రారంభం కావాలని కోరగానే సహకరించారు. అతి తక్కువ సమయంలోనే క్వాంటమ్ కంప్యూటర్ ఏపీలో ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థలకు ధన్యవాదాలు. ఈ ఏడాది ఏప్రిల్ 14న అంతర్జాతీయ క్వాంటమ్ డే రోజున రెండు స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్లను రిఫరెన్స్ ఫెసిలిటీగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి ప్రారంభించబోతున్నాం. డిసెంబర్ నుంచి రాష్ట్రంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి తెస్తాం. 85% క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలు ఇక్కడే తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్లకూ సరఫరా చేయాలన్నదే మా ఆలోచన’ అని తెలిపారు.

ఏఐ లివింగ్ ల్యాబ్ విశ్వవిద్యాలయం
ఐఎస్‌బీ తరహాలో ఏఐ లివింగ్ ల్యాబ్ యూనివర్సిటీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఏఐ, క్వాంటమ్ ఏఐలలో కోర్సులు అందించేలా అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం. ప్రజలందరికీ ఏఐ సాంకేతికత చేరాలన్నదే మా ఆలోచన. క్వాంటమ్‌తో కూడిన లాజిస్టిక్ ద్వారా వ్యయం తగ్గుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వినియోగిస్తే రిస్క్ తగ్గుతుంది. విద్యుత్తు ఉత్పత్తి రంగంలో దీని వినియోగం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి, పంపిణీ సాధ్యమవుతాయి. అమరావతి డీప్‌టెక్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పరిశ్రమలు, విద్యా రంగం, విద్యార్థులకు పిలుపునిస్తున్నా’ అన్నారు.

గతంలో ఐటీ, సెల్‌ఫోన్ల గురించి మాట్లాడితే తనను విమర్శించినవారి పిల్లలంతా ఐటీ రంగంలో అమెరికాలో స్థిరపడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘వచ్చే 30-40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చే అంశాలపైనే నేనెప్పుడూ ఆలోచిస్తా. దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయి. ఐటీపై పూర్తి అవగాహన ఉన్నందునే లోకేశ్‌కు ఆ శాఖ బాధ్యతలు అప్పగించాను. పని పట్ల నిబద్ధతకు పెట్టిందిపేరు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కామకోటి. 16న అమరావతికి బిల్‌గేట్స్ వస్తున్నారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర ప్రణాళికలతో ముందు కెళ్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.
క్వాంటమ్ ద్వారా చేసిన ఆవిష్కరణకు నోబెల్‌ప్రైజ్ సాధిస్తే రూ.100 కోట్ల నజరానా ఇస్తామని ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ‘యువ మేధావులు పరిశోధనలు చేయాలి. 2030 నాటికి 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులు అవసరమని అంచనా. దేశంలోని ఐటీ నిపుణుల్లో 35% తెలుగువాళ్లే. క్వాంటమ్ కోర్సుల్లో శిక్షణకు పిలుపునిస్తే 50వేల మంది వచ్చారు. దశలవారీగా 35 లక్షల మందికి శిక్షణ ఇప్పిస్తాం. ఐఐటీ మద్రాస్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కోర్సులు అందించినప్పుడు దేశవ్యాప్తంగా 2.08 లక్షల మంది విద్యార్థులు రిజిస్టరైతే వారిలో సగం మంది ఆంధ్రప్రదేశ్ వారే. క్వాంటమ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం ముందుకొచ్చింది. అందులో 10లక్షల మంది ఏపీకి చెందిన యువత ఉండేలా ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. మన యువత సాంకేతిక రంగంలో క్వాంటమ్ వేగంతో దూసుకెళ్తోంది. కుప్పంలో ఏడోతరగతి విద్యార్థి ఏఐతో ఆరోగ్యపరీక్షలు చేశాడు. రాష్ట్రంలోని 50 లక్షల మంది యువత ఏఐ నేర్చుకుని అద్భుతాలు సృష్టించాలి. ఏపీలో విద్యార్థులంతా ఏఐ ఆల్గరిథమ్స్‌లో శిక్షణ పొందాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 03:20 IST